Share News

Housing Department : ఇళ్ల నిర్మాణం ఇష్టారాజ్యం!

ABN , Publish Date - Dec 16 , 2024 | 05:17 AM

ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన ఒక లబ్ధిదారు పీఎంఏవై అర్బన్‌ పథకం కింద ఇల్లు నిర్మించుకుంటున్నారు. గత అక్టోబరులో ఆ ఇంటికి శ్లాబు పూర్తవడంతో ఆన్‌లైన్లో నమోదు చేశారు.

Housing Department : ఇళ్ల నిర్మాణం   ఇష్టారాజ్యం!

  • బీఎల్‌సీ విధానానికి, లబ్ధిదారుల ప్రయోజనాలకు తూట్లు

  • పీఎంఏవైలోనూ అదే పద్ధతిలో నిర్మాణాలు

  • లబ్ధిదారుల ప్రమేయం లేకుండానే విద్యుత్‌ పరికరాల కొనుగోళ్లు

  • రాష్ట్రమంతటా ఇదే తీరులో ఇండెంట్లు

  • ముందుగా నగదు కట్‌.. ఆ తర్వాతే ప్రపోజల్స్‌

  • కాంట్రాక్టర్ల స్వప్రయోజనాలకు పెద్దపీట

  • గృహనిర్మాణశాఖ తీరుపై లబ్ధిదారుల గుస్సా

  • ప్రభుత్వం మారినా తీరు మారదా అంటూ ఆగ్రహం

ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన ఒక లబ్ధిదారు పీఎంఏవై అర్బన్‌ పథకం కింద ఇల్లు నిర్మించుకుంటున్నారు. గత అక్టోబరులో ఆ ఇంటికి శ్లాబు పూర్తవడంతో ఆన్‌లైన్లో నమోదు చేశారు. అంతే.. వెంటనే లబ్ధ్దిదారు స్కీమ్‌ ఖాతా నుంచి రూ.5,750లు కట్‌ అయ్యాయి. ఆరా తీస్తే.. ఆ ఇంటి విద్యుదీకరణ కోసం ఎలక్ట్రికల్‌ అప్లయెన్సెస్‌ పేరుతో ఆ నగదు కట్‌ చేసినట్లు తెలిసింది. దీంతో అతడు తనకు నచ్చినట్లుగా ఇంటికి విద్యుదీకరణ ఏర్పాటు చేసుకునే అవకాశం కోల్పోయాడు. పైపెచ్చు ఎక్కువ మొత్తంలో నగదు కట్‌ అయింది!

బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో మరో లబ్ధిదారుకూ ఇదే అనుభవం ఎదురయింది. అసలు ఎలాంటి వైర్లు వేస్తారు? వాటి నాణ్యత, మన్నిక ఎలా ఉంటుంది? అనేదానితో సంబంధం లేకుండా, అతడికి తెలియకుండానే నగదు రూ. 5,750 కట్‌ అయింది. దీంతో అతడూ ఆందోళనకు దిగాడు. రాష్ట్రమంతటా ఇదే పద్ధతిలో లబ్ధిదారుల అభీష్టం, ఆకాంక్షలతో సంబంధం లేకుండా ఇండెంట్లు ఇచ్చేసి గృహనిర్మాణ శాఖ ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. దీంతో హౌసింగ్‌ శాఖ తీరుపై లబ్ధిదారుల్లో ఆందోళన ఆగ్రహం వ్యక్తమవుతోంది.

(గుంటూరు-ఆంధ్రజ్యోతి)

ఒకప్పుడు లబ్ధిదారులకు గృహ రుణాలు, రాయితీలు ఇవ్వడానికే పరిమితమైన గృహ నిర్మాణ శాఖ, కాంట్రాక్టర్ల ద్వారా నిర్మించే కార్యక్రమం చేపట్టి లబ్ధిదారులకు నష్టం చేస్తోంది. లబ్ధిదారుల ఆకాంక్షలు, ప్రయోజనాలకు భిన్నంగా తన కార్యకలాపాలు సాగిస్తోంది. కాంట్రాక్టు పద్ధతిలో నాణ్యత లేని ఇళ్లను నిర్మించడంతోపాటు, లబ్ధిదారుల ప్రమేయం లేకుండా కాంట్రాక్టు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించేలా స్వేచ్ఛను ఇచ్చేసింది. దీంతో వారు పనిముట్ల పేరుతో ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. లబ్ధిదారులకు తెలియకుండానే వారి గృహ నిర్మాణ ఖాతా నుంచి నిధులు కట్‌ చేసుకుని, ఆ తర్వాత లబ్ధిదారుల తరఫున ప్రపోజల్స్‌ పంపమని కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం గృహ నిర్మాణ శాఖ కమిషనరేట్‌ స్థాయిలో జరుగుతుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.


  • బెనిఫిషరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఎక్కడ?

గృహ నిర్మాణ శాఖ తొలి నుంచి లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకునే విధానానికి శ్రీకారం చుట్టింది. ఆ విధానంలో లబ్ధిదారు తన అభిరుచికి అనుగుణంగా ఇల్లు కట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఖర్చు తగ్గించుకునేలా నచ్చిన చోట సామగ్రి కొనుక్కునే అవకాశమూ ఉంటుంది. దీంతో ప్రభుత్వాలు బెనిఫిషరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌(బీఎల్‌సీ) విధానాన్నే అమలు చేస్తాయి. తొలిగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఎన్టీఆర్‌ ఈ వి ధానాన్నే అమలు చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఈ విధానానికి గృహనిర్మాణ శాఖ తూట్లు పొడుస్తోంది. పత్యామ్నాయంగా తామే ఇళ్లు కట్టించి ఇచ్చే పద్ధతులను ప్రభుత్వాలు ముందుకు తెస్తున్నాయి. ఈ పద్ధతిలో లబ్ధిదారులు అనేక విధాలుగా నష్టపోతున్నారని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు.

  • అక్రమాలకు హౌసింగ్‌ సహకారం

లబ్ధిదారు ఇల్లు కట్టుకోగానే వివిధ దశల్లో ప్రభుత్వ సహాయం అందుతూ ఉంటుంది. అలా వచ్చే నగదును కాంట్రాక్టర్లు లబ్ధిదారులకు తెలియకుండానే కట్‌ చేసుకుంటున్నారు. శ్లాబ్‌ పూర్తయిన వెంటనే వాటి వివరాలు ఆన్‌లైన్లో నమోదవుతాయి. అలా నమోదైన వెంటనే లబ్ధిదారుల హౌసింగ్‌ ఖాతా నుంచి రూ. 5,750 రూపాయలు కట్‌ అయిపోతున్నాయి. ఇది రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ స్థాయిలోనే జరుగుతోందని తెలుస్తోంది. తొలుత శ్లాబ్‌ పూర్తయిన లబ్ధిదారుల ఖాతాల నుంచి నగదు కట్‌ అయిన తర్వాత జిల్లా కార్యాలయాల నుంచి విద్యుత్‌ ప్రపోజల్స్‌ పంపించాలని రాష్ట్ర కార్యాలయ అధికారులు కోరుతున్నారు. అంటే లబ్ధ్దిదారులతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇలా నగదు కట్‌ అయిపోతోంది. కాగా, ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఇళ్ల నాణ్యత కనీస ప్రమాణాలను కూడా అందుకోలేకపోతోందన్న విమర్శలు ఉన్నాయి.


  • ప్రభుత్వం మారింది.. విధానం మారాలి!

గత ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన ప్రజలు ఆ ప్రభుత్వానికి స్వస్తి చెప్పారు. ప్రస్తుత కూటమి సర్కార్‌ కూడా ఆ విధానాలనే కొనసాగించడం పట్ల లబ్ధిదారుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. గృహనిర్మాణ లబ్ధి కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.4 లక్షలకు పెరిగింది. తద్వారా దోపిడీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక బీఎల్‌సీకి ప్రాధాన్యమిచ్చి లబ్ధిదారు తనకు నచ్చిన పద్ధతిలో ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించాలని ఇంజనీరింగ్‌ నిపుణులు సూచిస్తున్నారు.

  • నగదు కట్‌ చేసేసి.. మీటర్లు కూడా కొనుక్కోమంటున్నారు!

విద్యుత్‌ మీటర్ల పేరుతో నగదు కట్‌ చేస్తున్నారన్న విషయంపై బాధిత లబ్ధిదారులను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా, ఈ విషయమే తమకు తెలియదని, మమ్మల్నే మీటర్లు కొనుక్కోవాలని అధికారులు చెబుతున్నారని వాపోయారు. ఎందుకు కట్‌ అవుతుందో తెలియదుగానీ నగదు రావాల్సిన ప్రతిసారీ కొంత కోత పడుతోందని, అదేమని అడిగితే అధికారులు ఏదో కొన్నామని చెప్పి తప్పించుకుంటున్నారని చెప్పారు.

  • జగనన్న కాలనీలతో స్వరూపం మారిన హౌసింగ్‌

గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. లబ్ధిదారుడే నేరుగా ఇల్లు నిర్మించుకోవడం ఒక పద్ధతి కాగా, ఇందులో ప్రభుత్వం నిధులను దశలవారీగా ఇస్తుంది. రెండోది ఇంటికి అయ్యే మెటీరియల్‌ ఖర్చును సబ్సిడీతో అందిస్తుంది. మూడో పద్ధతిలో పూర్తిగా ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది. బీఎల్‌సీ విధానం ప్రాతిపదికగా ఉన్న తొలి ఆప్షన్‌ను ఎవరూ ఎంచుకోలేదు. చౌకగా సామగ్రి వస్తుందన్న ఆశతో రెండోది ఎంచుకున్నవారు కొందరైతే, ప్రభుత్వం ఇచ్చే రూ.లక్షా 80 వేలతో ఇల్లు కట్టుకోలేమని, మూడో ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ఈ రెండు ఆప్షన్లలో లబ్ధిదారు నుంచి అంగీకార పత్రం తీసుకుని కాంట్రాక్టర్లే నిర్మాణాన్ని చేపడుతున్నారు. నిబంధనలపై అవగాహనలేని లబ్ధిదారులు సంతకాలు చేశారు.

Untitled-3 copy.jpg


  • లబ్ధిదారులు వద్దంటే నగదు వెనక్కి ఇచ్చేస్తాం

విద్యుత్‌ ఉపకరణాల పేరుతో కట్‌ అయిన మొత్తానికి తగిన విధంగా విద్యుత్‌ ఉపకరణాలు అందజేస్తాం. ఎల్‌ఈడీ లైట్లు, ఫ్యానులు, ఇతర పరికరాలు అందజేస్తాం. లబ్ధిదారు సమ్మతిస్తేనే పంపిణీ జరుగుతుంది. లేదంటే నగదు వెనక్కిచ్చే వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. నగదు కట్‌ అయినవారు ఆందోళన చెందాల్సిన పనిలేదు.

- వెంకటేశ్వరరావు, హౌసింగ్‌ పీడీ, బాపట్ల

  • మా జిల్లా నుంచి ప్రపోజల్స్‌ పంపలేదు

విద్యుత్‌ ఉపకరణాల కింద నగదు కట్‌ అవుతున్నాయి. అది రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి జరుగుతోంది. వాళ్లే విద్యుత్‌ పరికరాలు పంపిస్తామని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఎంతమందికి కట్‌ అయింది.. ఎన్ని ప్రపోజల్స్‌ పంపించాలనే సమాచారం మాకు ఇంకా రాలేదు.

- పెరుగు ప్రసాద్‌, హౌసింగ్‌ పీడీ, ప్రకాశం జిల్లా

Updated Date - Dec 16 , 2024 | 05:18 AM