AP Capital: మరో పదేళ్లు కావాలట.. జగన్‌పై లోకేష్ ఫైర్..
ABN , Publish Date - Feb 17 , 2024 | 04:01 AM
Nara Lokesh: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పేరిట వైసీపీ నేతలు మరో మోసానికి దిగారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు.
ప్రజలను మభ్యపెట్టడానికే: లోకేశ్
అశోక్ గజపతిరాజును వైసీపీ నేతలు అవమానించారు. ఆయనవంటి మంచి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి వేధించినవారిని వదిలిపెట్టం. ఉత్తరాంధ్ర గంజాయి వ్యాపారానికి అడ్డాగా మారింది. తూర్పు గోదావరి ఎమ్మెల్సీ అనంతబాబు ఇక్కడ గంజాయి పండిస్తున్నాడు.
- లోకేశ్
3 రాజధానుల పనైపోయింది
ఇప్పుడు హైదరాబాద్ ఇంకో పదేళ్లు కేపిటల్‌గా ఉండాలట!
విపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి జగన్ మద్దతు
గద్దెనెక్కగానే 3 ముక్కలాట
రాజధాని ఏదంటే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చారు
భూములిచ్చిన రైతులకు నాలుగేళ్లుగా వేధింపులు
రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెట్టారు
ఉత్తరాంధ్రను మాఫియా డాన్లకు అప్పగించారు
టీడీపీ యువ నేత ధ్వజం
విజయనగరం, రామతీర్థం, గంట్యాడల్లో శంఖారావం
విజయనగరం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పేరిట వైసీపీ నేతలు మరో మోసానికి దిగారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. మూడు రాజధానుల పనైపోయిందని, ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు హైదరాబాద్‌ను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర జిల్లాలను మాఫియా డాన్ల చేతుల్లో పెట్టారని, వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. ‘శంఖారావం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన విజయనగరం జిల్లా విజయనగరం, రామతీర్థం, గంట్యాడల్లో జరిగిన సభల్లో ప్రసంగించారు. వాషింగ్టన్ డీసీ రాజధానిని తలదన్నే విధంగా రాజధాని నిర్మిస్తామని సైకో జగన్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధానికి ఆయన మద్దతిచ్చారని గుర్తుచేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాటమార్చి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట చేశారని దుయ్యబట్టారు. ‘గత నాలుగేళ్లుగా రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దౌర్భాగ్య దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. 30 వేల ఎకరాలను అమరావతి రైతులు త్యాగం చేశారు. నాలుగేళ్లుగా వారిని వేధిస్తూ వారి త్యాగాలకు ఫలితం లేకుండా చేశారు. కేసులు, లాఠీచార్జీలు, అణచివేతలకు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ పదేళ్లు వెనక్కి వెళ్లేలా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటున్నారు. ప్రజలను మోసగిస్తున్నారు’ అని చెప్పారు. వైసీపీ పాలనలో అమ్మలాంటి ఉత్తరాంధ్రను ఎలాంటి అభివృద్ధి చేయకుండా వెనక్కి పెట్టారని మండిపడ్డారు. ఇంకా ఏమన్నారంటే..
అరాచక పాలనకు 2 నెలలే!
ప్రశాంతమైన విజయనగరాన్ని సైతం అరాచకాలు, అణచివేతలు, భూ దందాలు, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, డ్రగ్స్, గంజాయి, అణచివేతలు, వేధింపుల జిల్లాగా మార్చేశారు. ప్రశాంత జిల్లాను అశాంతి జిల్లాగా మార్చేశారు. ఈ అరాచక పాలన ఇంకా రెండు నెలలే. వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఉత్తరాంధ్రలో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానికంగానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. భోగాపురం విమానాశ్రయం మన హయాంలోనే మంజూరైంది.
ధైర్యం ఉంటే రండి..
ఇటీవల ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. చొక్కా మడ త పెట్టాలని కార్యకర్తలకు పిలుపిచ్చారు. ధైర్యముంటే రండి.. చొక్కా మడతేద్దాం. ముఖ్యమంత్రి కుర్చీనే ప్రజ లు మడత పెట్టే రోజులు 2 నెలల్లో ఉన్నాయి. నాపై 22 కేసులున్నాయి. హత్యాయత్నం కేసు పెట్టారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. భూమ్ భూమ్ బ్యాచ్‌కు భయపడేది లేదు. నేను ప్రజల్లోనే తిరుగుతున్నా. సైకో జగన్ మాత్రం పరదాల చాటున తిరుగుతున్నాడు. మ రి ఎవరు భయపడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవా లి. 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. జగన్ పెట్టిన అడ్డంకులు, అణచివేతలు, దౌర్జన్యాలకు వెరవలేదు. అవినీతి మరక లేని చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు. విజయనగరం మాన్సాస్ ట్రస్టుపై కన్నేశారు. రామతీర్థం ఆలయంలో రాముని విగ్రహం తల నరికేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను మాఫియా డాన్లు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ దోచుకున్నారు. భూమ్‌భామ్ అరాచక ముఠాల వైసీపీ ప్రభుత్వాన్ని పైడితల్లి అమ్మ, రాముడు క్షమిస్తారా?
ఇసుక డబ్బులన్నీ జగన్, బొత్సకే
మన ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా అందించాం. ఇప్పుడు వైసీపీ నాయకులు అమ్ముకుంటున్నారు. ట్రాక్టరు ఇసుక రూ.5వేలకు కొనుక్కోవలసిన పరిస్ధితి వచ్చింది. ఈ డబ్బులన్నీ మంత్రి బొత్సకు, సీఎం జగన్‌కు పంపిస్తున్నారు. జగనన్న కాలనీలకు ఎకరం రూ.10 లక్షలకు కొనుగోలు చేసి రూ.38 లక్షలకు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అమ్ముకున్నా రు. యాత్ర-2 సినిమాతో తమ అంతిమ యాత్ర ఖా యమని వైసీపీ నేతలకు అర్థమైంది. పోలవరం చంద్రబాబు అయితే పిల్ల కాల్వ జగన్. కియా మోటార్స్ బాబు అయితే కోడి కత్తి డ్రామా జగన్. బాబుకు బ్రాండ్ ఉంటే జగన్‌కు భూమ్‌భూమ్ బ్యాచ్ ఉంది.
టైం మీరే చెప్పండి
వైసీపీ పాలనపై రైతులు, మహిళలు, యువత వద్దకు వెళ్దామా? సీఎం సొంత మీడియా, వైసీపీ నేత లు సిద్ధమేనా? సంపూర్ణ మద్య నిషేధం విధించాకే మళ్లీ ఓట్లడిగేందుకు వస్తానని హామీ ఇచ్చారు. అది ఏమైంది? పెంచిన నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, చెత్తపైనా పన్ను.. వీటన్నింటిపై చర్చకు సిద్ధమా? పీల్చే గాలిపైనా పన్ను వేసే రోజులు వస్తున్నాయి. యువతకు ఉద్యోగాలు లేవు. గ్రూప్-1, గ్రూప్-2 లేదు. ఎన్నికల ముందు మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేస్తున్నారు. దీనిపై యువత వద్దకు వెళ్దామా? టైం మీరే చెప్పండి.