రసాభాసగా..
ABN , Publish Date - Feb 19 , 2024 | 01:48 AM
భోగరాజు పట్టాభి సీతారా మయ్య స్మారక భవన నిర్మాణానికి మునిసిపల్ కౌన్సిల్ అనుమతుల కోసం ఆదివారం వివేకానంద మందిరంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా ముగిసింది.
పట్టాభి స్మారక భవన అనుమతులపై అఖిలపక్ష సమావేశం
పట్టాభి భవన కమిటీ కరపత్రాలు చించేసిన వైసీపీ కార్పొరేటర్ మేకల సుబ్బన్న
వాగ్వివాదాల మధ్య ముగిసిన సమావేశం
మచిలీపట్నం టౌన్, ఫిబ్రవరి 18: భోగరాజు పట్టాభి సీతారా మయ్య స్మారక భవన నిర్మాణానికి మునిసిపల్ కౌన్సిల్ అనుమతుల కోసం ఆదివారం వివేకానంద మందిరంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా ముగిసింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, నగర పెద్దలు హాజరయ్యారు. భవనాన్ని నిర్మించడంలో జాప్యం జరిగితే యూనియన్ బ్యాంకు మంజూరు చేసిన నిధులు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని బందరు అభివృద్ధిని ఆకాంక్షించే రాజకీయ పార్టీ నాయకులందరూ ఏకం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ మతిన్, టీడీపీ నగర అధ్యక్షుడు ఎండీ ఇలియాస్ బాషా కోరారు. సీఎం నుంచి పట్టాభి భవనానికి కావలసిన స్థలాన్ని, యూనియన్ బ్యాంకు నుంచి రూ.40 కోట్ల నిధులను ఎంపీ వల్లభనేని బాలశౌరి తీసుకుని వచ్చారని, అయితే నగరపాలక సంస్థ భవన నిర్మా ణానికి ఎన్వోసీ ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడంలేదో తెలి యడం లేదని, దీనిపై కలెక్టర్ చెప్పినా మునిసిపల్ కౌన్సిల్‌లో పాలక వర్గం తీర్మానం ప్రవేశపెట్టడం లేదని న్యాయవాది, భవన నిర్మాణ సాధక కమిటీ కన్వీనర్ సోడిశెట్టి బాలాజీ అన్నారు. దీంతో కలెక్టరుకు, మునిసిపల్‌కమిషనర్‌కు వినతిపత్రాలు ఇస్తే సరిపోతుందా.. మేయర్‌ను ఎవరు అడిగారని వైసీపీ కార్పొరేటర్ మేకల సుబ్బన్న ప్రశ్నించారు. మీరే వినతి పత్రాలు తీసుకుని పని పూర్తి చేయించండి అని సుబ్బన్నతో బాలాజీ అన్నారు. అనంతరం సుబ్బన్న భవన నిర్మాణ సాధన కమిటీ ముద్రించిన కరపత్రాలను చించేశారు. దీంతో సభ రసాభాసగా మారింది. టీడీపీ ప్రచార కార్యదర్శి పీవీ ఫణి కుమార్, మేకల సుబ్బన్న మధ్య తీవ్రంగా వాదోపదాలు జరిగాయి.
సీఎం ఉత్తర్వులిచ్చారు..అనుమతులివ్వండి:జనసేన
వాదనలు జరుగుతుండగా జనసేన నాయకుడు మాదివాడ రాము, కొట్టె వెంకట్రావులు జోక్యం చేసుకుని మాట్లాడారు. సీఎం ఉత్తర్వులు ఇచ్చారని, కలెక్టర్ ఇందుకు కావలసిన రెండెకరాలు స్థలం కేటాయించారని, జగన్‌పై గౌరవంతో భవన నిర్మాణానికి వైసీపీ కార్పొరేటర్లు మునిసిపల్ కౌన్సిల్‌లో అనుమతులు ఇవ్వాలని సూచించారు. పట్టాభి స్మారక భవన నిర్మాణానికి కావలసిన స్థలాన్ని వేరే చోట కొనుక్కోవడం మంచిదని, పట్టాభి స్మారక భవనానికి కలెక్టర్ కేటాయించిన స్థలాన్ని 30 ఏళ్ల లీజుకు తీసుకుని వైసీపీ కార్యాలయ భవనం, క్రీడా భవనం నిర్మాణాలు జరుగుతున్నాయని అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్ అన్నారు. అక్కడ మిగిలి ఉన్న స్థలం పోలీసు శాఖదన్నారు. దీంతో పీవీ ఫణికుమార్‌కు బొర్రా విఠల్‌కు మధ్య వాదోపవాదాలు జరిగాయి. పట్టాభి భవనానికి కేటాయించిన స్థలం ఇవ్వాలని రాజకీయపార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయ కుడు కె.చంద్రశేఖర్, న్యాయవాది పుప్పాల ప్రసాద్, సీపీఎం నాయకుడు కొడాలి శర్మ, టీడీపీ నాయకుడు పిప్పళ్ల కాంతారావు, జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు, డాక్టర్ బి.ధన్వంతరి ఆచార్య, సింగరాజు గోవర్ధన్ పాల్గొన్నారు.