AP Assembly Session: అసెంబ్లీలో చంద్రబాబు తొలి ప్రసంగం
ABN, Publish Date - Jun 22 , 2024 | 12:04 PM
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారి శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని ప్రశంసల జల్లు కురిపించారు. పవన్‌ను అసెంబ్లీ గేటు తాకనీయబోమన్నారని, కానీ పవన్ పోటీ చేసిన 21 చోట్ల గెలిచారని చంద్రబాబు అన్నారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారి శనివారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని ప్రశంసల జల్లు కురిపించారు. పవన్‌ను అసెంబ్లీ గేటు తాకనీయబోమన్నారని, కానీ పవన్ పోటీ చేసిన 21 చోట్ల గెలిచారని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లు తాను ఎంతో బాధపడ్డానని అన్నారు. గత ఐదేళ్లుగా శాసనసభలో జరిగిన సంఘటనలు చూసి బాధపడ్డానని అన్నారు.
గత సభలో అసెంబ్లీని వాకౌట్ చేసేటప్పుడు చేసిన ప్రకటనను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. కౌరవ సభలో తాను ఉండబోనని, సీఎంగానే సభలో అడుగుపెడతానని చెప్పానని గుర్తుచేశారు. తన కుటుంబ సభ్యులపై వైసీపీ సభ్యులు అమర్యాదగా మాట్లాడారని చంద్రబాబు గుర్తుచేశారు.
వైసీపీ పాలనలో ఎంతోమంది మహిళలు బాధపడ్డారని, గౌరవసభగా శాసనసభను నడిపిస్తానని ప్రజలకు మాట ఇచ్చానని, రాష్ట్రంలో ఆడబిడ్డలకు వైసీపీ పాలనలో జరిగిన అవమానం ఇంకెప్పుడూ ఈ సభలో జరగకూడదని చంద్రబాబు అన్నారు. తనకు మరో జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని కోరుకుంటున్నానని అన్నారు.
అవతలి పార్టీ సభ్యులను ఎగతాళి చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ సభ్యులను సభలో గౌరవించాలని అన్నారు. ‘‘గతంలో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని ఎగతాళిగా మాట్లాడారు.’’ అని గుర్తుచేశారు.
చట్ట సభల విలువ తెలిసిన వ్యక్తి అయ్యన్న: చంద్రబాబు
ఈ సభలో హుందాతనంతో ముందుకు వెళ్లాలని, వెకిలితనం, వెకిలి మాటలకు ఇక స్వస్తి అని చంద్రబాబు స్పష్టం చేశారు. చట్ట సభలు విలువ తెలిసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడని, ఆయన నాయకత్వంలో సభ హుందాతనం పెరుగుతుందని ఆశిస్తున్నట్టు చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి విషయానికి వస్తే రాజధాని కట్టాలని, అలాగే పోలవరం నిర్మాణంతో పాటు నదుల అనుసంధానం, పేదల అభివృద్ధి వంటి కార్యక్రమాలు ఈ సభలోనే చేపట్టాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
‘‘నేను శాసనసభలో సీనియర్ సభ్యుడిని. మొత్తం 16 సభలు జరగ్గా 9 సభల్లో ఉన్నాను. 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. నా జీవితంలో 15వ శాసనసభలో జరిగినట్లు ఎప్పుడూ జరగలేదు. సభ గౌరవాన్ని పెంచేలా సభ్యులు వ్యవహరించాలి. అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో సభ హుందాగా నడుస్తుందనే నమ్మకం ఉంది. రాజ్యాంగ స్ఫూర్తిని అయ్యన్న కాపాడతారు’’ అని చంద్రబాబు అన్నారు.
Updated Date - Jun 22 , 2024 | 12:22 PM