ఎట్టకేలకు ప్రారంభం!
ABN , Publish Date - Nov 23 , 2024 | 01:18 AM
మల్లవల్లి ఇండస్ర్టియల్ పార్క్‌లో ఐఆర్‌సీటీసీ రైల్ నీర్ బాట్లింగ్ ప్లాంట్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. నవంబరు 7న అధికారి కంగా ట్రయల్ రన్ నిర్వహించగా అది విజయవంతం కావడంతో ఆరోజు నుంచే ప్లాంట్‌లో అధికా రికంగా ఉత్పత్తిని ప్రారంభిం చారు. దశాబ్దకాలంగా ఎదురు చూపులకే పరిమితమైన రైల్ నీర్ బాట్లింగ్ ప్లాంట్ ఎట్టకేలకు ప్రారంభమవడంతో స్టేషన్లలో రైలు ప్రయాణికులకు తక్కువ ధరకే స్వచ్ఛమైన మంచినీటి బాటిళ్లు అందుబాటులోకి వచ్చాయి.
మల్లవల్లి ఐఆర్‌సీటీసీ రైల్ నీర్ బాట్లింగ్ ప్లాంట్‌లో ఉత్పత్తికి శ్రీకారం
ఈనెల 7న ట్రయల్ రన్..విజయవంతం కావడంతో అదేరోజు నుంచి బాటిళ్ల ఉత్పత్తి
దశాబ్దం కిందటే కేంద్ర బడ్జెట్‌లో ప్లాంట్ కేటాయింపు
రూ.7 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు
రోజుకు 72 వేల మంచినీటి బాటిళ్ల ఉత్పత్తి
సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి వరకు సరఫరా
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/హనుమాన్‌జంక్షన్ రూరల్): స్పెషల్ ఎకనమిక్ జోన్(సెజ్) కింద ఏర్పడిన మల్లవల్లి ఇండస్ర్టియల్ పార్క్ (ఐపీ)లో భూములు తక్కువ ధరకు లభించడంతో ఐఆర్‌సీటీసీ రైల్ నీర్ బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటుకు గతంలో గుణ్‌రాజ్ అనే సంస్థ పనులు దక్కించుకున్న ప్పటికీ ఆ సంస్థ దీని పనులు చేపట్టడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరిచింది. పదేళ్ల కిందటే ఈ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినా దీన్ని ఏర్పాటు చేయటంలో అంతులేని తాత్సారం నడిచింది. గత అర్ధ సంవత్సర కాలంగా ఈ ప్రాజెక్టును ఐఆర్‌సీటీసీ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీనిపై శ్రద్ధ పెట్టారు. దీంతో అందుబాటులోకి రాగలిగింది. గుణ్‌రాజ్ సం స్థను వదిలించుకోవటానికి చాలా సమయం పట్టింది. ఆ సంస్థను చట్టబ ద్ధంగా వదిలించుకున్న తర్వాత ‘మెహాయ్ ఆక్వా’ సంస్థకు అప్పగించారు. మెహాయ్ ఆక్వా సంస్థ రంగంలోకి దిగాక పనులు ఊపందుకున్నాయి. ఐఆర్‌సీటీసీ అధికారుల పర్యవేక్షణలో మెహాయ్ ఆక్వా సంస్థ పనులను వేగ వంతంగా చేపట్టింది. దీంతో బాట్లింగ్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో కొన్ని దశాబ్దాలుగా రైల్ నీర్ బాటిళ్లను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఇక నుంచి దిగుమతి చేసుకునే సమస్య లేకుండా పోయింది. విజయవాడ నుంచే ఎగుమతి చేయొచ్చు. మల్లవల్లి లోని ప్లాంట్ ద్వారా తెలంగాణలోని సికింద్రాబాద్ వరకు, మన రాష్ట్రంలో ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, ఖాజీపేట, గూడూరు, రాజమండ్రి వరకు రైల్‌నీర్ బాటిళ్లను ఎగుమతి చేయొచ్చు. రైల్ నీర్ బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయటానికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం సర్వీసు (ఐఆర్‌సీటీసీ) వారు రూ.7 కోట్ల ఖర్చు చేసింది. ప్లాంట్ నిర్మాణ, నిర్వహణ పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించినా పర్యవేక్షణ మాత్రం ఐఆర్‌సీటీసీ దే ఉంటుంది. ఐఆర్‌సీటీసీ పర్యవేక్షణలోనే ఈ ప్లాంట్ పనిచేస్తుంది. ప్లాంట్‌లో రక్షిత మంచినీటిని అందించేందుకు ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. ఐఆర్‌సీటీసీ తరఫున ఒక బయాలజిస్టు ఈ ప్లాంట్‌లో పనిచేస్తారు. రోజూ ల్యాబ్‌లో మంచినీటిని పరీక్షిస్తారు.
రూ.15కే వాటర్ బాటిల్
మల్లవల్లి బాట్లింగ్ ప్లాంట్‌లో రోజూ 6 వేల కేసుల రైల్ నీర్ బాటి ళ్లను ఉత్పత్తి చేస్తారు. లీటరు పరిమాణంతో కూడిన వాటర్ బాటిళ్లను ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్నారు. ఒక కేసులో 12 చొప్పున వాటర్ బాటిళ్ళు ఉంటాయి. అంటే రోజుకు 72 వేల బాటిళ్లను ఉత్పత్తి చేస్తారు. నెలకు 21.60 లక్షలు, సంవత్సరానికి 2.59 కోట్ల బాటిళ్లను ఉత్పత్తి చేయను న్నారు. మెహాయ్ ఆక్వా సంస్థ ఇక్కడి నుంచి బాటిళ్లను సరఫరా చేయటానికి అధీకృత ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. వీరు సికింద్రాబాద్, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, ఖాజీపేట, గూడూరు, రాజమండ్రి రైల్వేస్టేషన్లకు సరఫరా చేస్తారు. రైల్వేస్టేషన్లలో రైల్ నీర్ బాటిళ్లను తక్కువ ధరకు అంటే రూ.15కే విక్రయించనున్నారు.
ఇక చవకగా..స్వచ్ఛమైన రైల్ నీర్
మల్లవల్లిలో రైల్ నీర్ ప్లాంట్ అందు బాటులోకి వచ్చింది. ప్లాంట్ ప్రారంభించడం కోసం ఏడాదిగా ఎంతో శ్రమించాం. ఇన్నాళ్లూ మంచినీటి బాటిళ్లను దిగుమతి చేసుకున్నాం. ఇక నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తాం. ఇక చవకగా.. స్వచ్ఛమైన నీటిని అందిస్తాం. నీటి నాణ్యతలో రాజీపడం. ల్యాబ్‌లో రోజూ నీటి శాంపిల్స్ తీసుకుని పరీక్ష చేయిస్తాం. మా బయాలజిస్టు ఒకరు అక్కడ ఉంటారు.
- రాజీ, ఐఆర్‌సీటీసీ మేనేజర్, విజయవాడ