పట్టాభి స్మారక భవనం సాకారమయ్యేనా!
ABN, Publish Date - Nov 23 , 2024 | 01:16 AM
స్వాతంత్య్ర సమర యోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్యకు ముందు చూపుగల నాయకుడిగా, గాం ధీజీ సన్నిహితుడుగా పేరుం ది. మధ్యప్రదేశ్ మాజీ గవ ర్నర్‌గానూ పనిచేశారాయన. రాష్ట్రంలో పలు బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలను నెల కొల్పి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిం చారు. అంతటి మహనీయుడికి ప్రభుత్వాలు సముచిత గౌరవం ఇస్తున్నాయా అంటే లేదనే అంటున్నారు ఆయన అభిమానులు. పట్టాభి స్మారక భవన నిర్మాణానికి వైసీపీ అడ్డు తగిలిందని, కూటమి ప్రభుత్వమైనా భవ నాన్ని నిర్మిస్తే ఆయనను గౌర వించినట్టవుతుందని వారు అంటున్నారు.
భవన నిర్మాణానికి అడ్డుతగిలిన వైసీపీ
స్మారక భవనం నిర్మించాలి..పట్టాభి పేరుతో అవార్డులివ్వాలి
కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్న అభిమానులు
(మచిలీపట్నం టౌన్, ఆంధ్రజ్యోతి): భోగరాజు పట్టాభి సీతారామయ్య 1915లో కేడీసీసీ బ్యాంకు, 1923లో ఆంధ్రాబ్యాంకు, 1927లో వడ్లమన్నాడు ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంకు, 1929లో భారత లక్ష్మీబ్యాంకును స్థాపించారు. 1935లో హిందూస్థాన్ ఐడియల్ ఇన్సూరెన్స్ కంపెనీని నెలకొల్పారు. కేడీసీసీ బ్యాంకు ఇప్పటికీ రైతు లకు సేవలనందిస్తూనే ఉంది. ఆంధ్రాబ్యాంకు యూనియన్ బ్యాంకులో విలీనమయింది. దీనిపై పలువురు నిరసనలు తెలిపినా ఫలితం లేకపోయింది. ఆంధ్రాబ్యాంకు పేరు మారినప్పటికి వేలాది ఉద్యోగులు ఆ బ్యాంకులో పనిచేస్తూనే ఉన్నారు. అన్ని సమాజహిత కార్యక్రమాలు చేసిన పట్టాభి పేరిట అప్పట్లో ఆంధ్రాబ్యాంకు పట్టాభి స్మారక గ్రామీణాభివృద్ధి సంస్థను నెలకొల్పింది. పలువురు నిరుద్యోగులకు అందులో ఉపాధి అవకాశాలపై అందులో శిక్షణ ఇస్తున్నారు. మచిలీపట్నంలోని ఆంధ్రాబ్యాంకు ఫౌండర్స్ బ్రాంచ్‌పైన పట్టాభి పేరుతో లైబ్రరీని స్థాపించారు. పట్టాభి పేరుతో మచిలీపట్నంలో స్మారక భవనం నిర్మాణం కోసం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రభుత్వం నుంచి రెండెకరాల స్థలాన్ని కేటాయించేలా కృషి చేశారు. యూనియన్ బ్యాంకు నుంచి రూ. 40 కోట్లు భవన నిర్మాణానికి మంజూరు చేయించారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో భవనం నిర్మించుకునేందుకు వైసీపీ నాయకులు అడ్డుతగిలారు. మచిలీపట్నం మునిసిపాలిటీ ఇప్పటికీ భవన నిర్మాణానికి ఎన్వోసీ ఇవ్వలేదు.దీంతో యూనియన్ బ్యాంకు విడుదల చేసిన రూ.40 కోట్లు వెనక్కి వెళ్లాయి. దీనిపై పట్టాభి స్మారక భవన నిర్మాణ కమిటీ పేరుతో అనేక నిరసనలు జరిగాయి. పట్టాభి సీతారామయ్యకు సముచిత స్థానం కల్పించేందుకు వైసీపీ నాయకులు సహకరించలేదన్న విమర్శ ఇప్పటికీ ఉంది. భవనాన్ని నిర్మించాలని, పట్టాభి సీతారామయ్య పేరుతో వివిధ రంగాల్లోని ప్రముఖులకు అవార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన అభిమానులు కోరుతున్నారు.
పట్టాభి నివసించిన భవనంలో జయంతి నిర్వహిస్తున్నాం
మచిలీపట్నం పోర్టురోడ్డులో పట్టాభి సీతారామయ్య నివసించిన ఇల్లు ఇప్ప టికీ చెక్కు చెదరలేదు. నివాసాన్ని అభివృద్ధి పరిచి అక్కడ వివిధ కార్యక్రమాలు చేపట్టాం. ఆ ఇంటిని పట్టాభి స్మారక భవనంగా గాంధీ కస్తూరిబా సేవా సం ఘం తీర్చిదిద్దుతోంది. ఆ భవనంలో మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తున్నాం. విద్యా ర్థులకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పట్టాభి 140వ జయంతిని పట్టాభి నివసించిన భవనంలోనే ఆదివారం నిర్వహిస్తున్నాం. పూర్వ ఆంధ్రా బ్యాంకు 102వ వ్యవస్థాపక దినోత్సవాన్ని, ఆంధ్రాబ్యాంకు రిటైర్డు ఉద్యోగులు, పట్టాభి మెమోరియల్ ట్రస్టు నిర్వహిస్తోంది. పట్టాభి ఆశయాలను నెరవేర్చేం దుకు అందరూ కృషి చేయాలి.
- సింగరాజు గోవర్ధన్, కార్యదర్శి, గాంధీ కస్తూరిబా సేవా సంఘం
భవనం నిర్మిస్తేనే నిజమైన నివాళి
భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవ నాన్ని నిర్మించేందుకు వైసీపీ హయాంలో జగన్ రెండెకరాలు మంజూరు చేశారు. స్మారక భవన నిర్మాణానికి ఎంపీ వల్లభనేని బాలశౌరి యూనియన్ బ్యాంకు నుంచి రూ. 40 కోట్ల నిధులు తీసుకు వచ్చారు. అయితే వైసీపీ నాయకులు అడ్డు తగల డంతో ఆ భవన నిర్మాణం ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడైనా భవన నిర్మాణానికి కావలసిన స్థలం, నిధులు తీసుకురావాలి. అప్పుడే ఆయనకు నిజమైన నివాళి.
- పి.వి. ఫణికుమార్, పట్టాభి స్మారక భవన నిర్మాణ కమిటీ ప్రతినిధి
Updated Date - Nov 23 , 2024 | 01:16 AM