Share News

పరుగులు తీస్తున్న పారిశ్రామికం

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:29 PM

రాష్ట్ర విభజన తరువాత ఆనాటి టీడీపీ ప్రభుత్వం కర్నూలును పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించింది.

పరుగులు తీస్తున్న పారిశ్రామికం
జైరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ పరిశ్రమ

తొలి దశలో 2,612 ఎకరాల్లో రూ.2,786 కోట్లతో అభివృద్ధి

జపాన్‌ సంస్థ సెమీ కండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు

వైసీపీ హయాంలో పారిశ్రామిక పురోగతి కుదేలు

2024లో చంద్రబాబు వచ్చాక పురోగతి

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ వల్ల మరింత కలిసొచ్చే అవకాశం

రాష్ట్ర విభజన తరువాత ఆనాటి టీడీపీ ప్రభుత్వం కర్నూలును పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించింది. ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం చేయలేదు. ఓర్వకల్లును పారిశ్రామిక హబ్‌గా ప్రకటించి ప్రపంచంలోనే అతి పెద్ద వెయ్యి మెగావాట్ల సోలార్‌ పవర్‌ యూనిట్‌, పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. కొలిమిగుండ్ల కేంద్రంగా సిమెంట్‌ హబ్‌గా ప్రకటించి.. పలు సిమెంట్‌ పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన అయోవా విశ్వవిద్యాలయం సాంకేతిక సహకారంతో నందికొట్కూరులో మెగా సీడ్‌ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చట్టారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రమిక ప్రగతి పడకేసింది. చంద్రబాబు భూమి పూజ చేసిన ఒకటి రెండు పరిశ్రమలు పురుడుపోసుకున్నాయే తప్ప.. ఒక్క కొత్త పరిశ్రమను కూడా జగన్‌ ప్రభుత్వంలో తీసుకురాలేపోయింది. 2024 జూన్‌ 12న మళ్లీ సీఎం చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరడం.. జిల్లాకు చెందిన టీజీ భరత్‌ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పారిశ్రామిక ప్రగతి వేగం పుంజుకుంది. 2024 సంవత్సరంలో ఆరు నెలలు వైసీపీ పాలన.. ఆరు నెలలు టీడీపీ కూటమి ప్రభుత్వంలో సాధించిన పారిశ్రామిక పురోగతిని విశ్లేషిస్తే..

కర్నూలు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2014-19 మధ్య ఆనాటి సీఎం చంద్రబాబు పారిశ్రామిక ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. రాయలసీమలో వెంటాడే కరువు, వలసలు నివారించాలంటే పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలనే ఏకైక లక్ష్యంతో 33 వేల ఎకరాల్లో ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌గా ఏర్పాటు చేశారు. కొలిమిగండ్ల కేంద్రంగా సిమెంట్‌ హబ్‌, నందికొట్కూరు కేంద్రంగా మెగా సీడ్‌ హబ్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆసియాలోనే అదిపెద్ద వెయ్యి మెగా వాట్లా సోలార్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు. జైరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే తొలి పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ఉత్పత్తి యూనిట్‌ 3,500 మెగావాట్లాతో నాంది పలికారు. వివిధ రంగాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాలంటే విమాన రవాణా సౌకర్యం ఎంతో కీలకమని గుర్తించి చంద్రబాబు 1,010 ఎకరాల విస్తీర్ణంలో కొండలను పిండి చేసి రూ.110 కోట్లతో కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం నిర్మించారు. నీటి వసతి కోసం ముచ్చుమర్రి లిఫ్ట్‌ నుంచి 4 టీఎంసీలు ఎత్తిపోసి నిల్వ చేసేందుకు జలాశయం నిర్మాణం, కర్నూలు రైల్వే స్టేషన్‌ సమీపంలోని దూపాడు రైల్వే స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైల్వేలైన్‌ నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నందికొట్కూరు దగ్గర మెగా సీడ్‌ హబ్‌, జైన్‌ ఇరిగేషన్‌ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టారు. 2019లో వైపీపీ అధికారంలోకి రావడం, జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లు నిర్లక్ష్యం కారణంగా పారిశ్రామిక ప్రగతి కలలు కల్లలుగా మారాయి. మళ్లీ సీఎం చంద్రబాబు సారథ్యంలో మళ్లీ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం రావడం, చంద్రబాబు విజన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారం తోడుకావడంతో పారిశ్రామిక అభివృద్ధి ఆశలు చిగురిస్తున్నాయి. 2024 ఉమ్మడి కర్నూలులో పారిశ్రామిక పురోగతికి వేదిక అయ్యింది.

2,612 ఎకరాలు.. రూ.2,786 కోట్లు

ఓర్వకల్లు ఇండస్ర్టియల్‌ స్మార్ట్‌ సిటీ 2,612 ఎకరాల్లో రూ.2,786 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఈ ఏడాది జూన్‌ 23న కేంద్రం ప్రకటించడం జిల్లా నిరుద్యోగ యువతలో మరవలేని గుర్తింపును 2024 సొంతం చేసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌-2024-25లో ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌ అభివృద్ధి చేస్తామని కీలక ప్రకటన చేశారు. నేషనల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌ఐసీడీపీ)లో భాగంగా ఇండస్ర్టియల్‌ స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఫేజ్‌-1 కింద 2,612 ఎకరాల్లో ఓర్వకల్లు ఇండస్ర్టియల్‌ స్మార్ట్‌ సిటీలో రూ.2,786 కోట్లతో మౌలిక వసతులు కల్పించనున్నారు. నాన్‌ మెటలిక్‌ మినరల్‌ పరిశ్రమలు, ఆటోమొబైల్‌ రంగం విడిభాగాలు తయారీ, పునరుత్పాధక పరిశ్రమలు, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, ఏరోస్పెస్‌ అండ్‌ డిఫెన్స్‌ హార్డ్‌వేర్‌, ఫార్మాస్యూటికల్స్‌, వజ్రాలు, బంగారు అభరణాల తయారీ, వస్త్ర ఉత్పత్తి రంగ పరిశ్రమలు ఇక్కడే ఏర్పాటు చేసేందుకు నేషనల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఐసీడీసీ) ప్రత్యేక దృష్టిని పెట్టిందని, ఆయా పరిశ్రమలు ఏర్పాటు ద్వారా రూ.12 వేల కోట్లు పెట్టుబడులు, 45,071 మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు.

ఉమ్మడి జిల్లాలో పట్టాలెక్కనున్న పరిశ్రమలు

జాతీయ పశు ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ కార్యక్రమం (ఎన్‌ఏడీసీపీ)లో భాగంగా ఎమ్మిగనూరు మండలం బనవాసి జెర్సీ పశుక్షేత్రంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు దృష్టి సారించారు. ఈ పశుక్షేత్రంలో పశుసంవర్ధక శాఖ నుంచి ఎన్‌ఏడీసీపీకి 100-150 ఎకరాలు కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఎమ్మిగనూరు మండలం బనవాసి జెర్సీ పశు క్షేత్రంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోనిలో 3, కర్నూలులో 4, నంద్యాలలో 3 కలిపి 10 మాతృభాషలో ఎఫ్‌ఎం ఛానల్స్‌ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఓర్వకల్లు మెగా ఇండస్ర్టియల్‌ హబ్‌లో రూ.14 వేల కోట్లతో భారీ సెమి కండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జపనీస్‌ సంస్థ, భారత్‌కు చెందిన మరో ఐటీ సంస్థ భాగస్వామ్యంతో కలసి ఏర్పాటు చేయనున్నారు. 130 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం జపాన్‌ ప్రతినిధులు ఇప్పటికే ఓర్వకల్లును పరిశీలించారు.

ఓర్వకల్లు మండలం పాలకొనను, చింతలపల్లి, కొమరోలు గ్రామాల్లో దాదాపు 300 ఎకరాల్లో ‘డ్రోన్‌ తయారి పరిశ్రమ’ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే డ్రోన్‌ తయారీ పరిశ్రమ ప్రతినిధులు, అధికారులు పరిశీలించారు.

ప్రారంభానికి సన్నాహాలు

పాణ్యం మండలం పిన్నాపురం వద్ద 5,230 మెగావాట్ల యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా పోలార్‌, విండ్‌, హైడల్‌ (పంప్డ్‌ స్టోరేజ్‌) విద్యుత్‌ సబంధించిన ఇంటిగ్రేటెట్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు-ఐఆర్‌ఈపీ)కు శ్రీకారం చుట్టారు. పాణ్యం మండలం పిన్నాపురం, ఓర్వకల్లు మండలం గుమ్మటంతాండ గ్రామాల్లో 4,750 ఎకరాల భూములు, గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని కేటాయించారు. ప్రాజెక్టు రూ.15 వేల కోట్ల పెట్టుబడి లక్ష్యం. వైసీపీ ఆయాంలో పనులు మందగించినా.. టీడీపీ కూటమి వచ్చాక వేగం పుంజుకుంది. దాదాపు 85 శాతానిపై పనులు పూర్తయ్యాయి. 2025 నూతన సంవత్సరంలో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పరిశ్రమలపై వైసీపీ దాడులు

టీడీపీ కూటమి పరిశ్రమలు తీసుకొచ్చి రాయలసీమ గమనాన్నే మార్చాలి.. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందుకు విరుద్ధంగా వైసీపీ నాయకులు పరిశ్రమలపై దాడులు చేయడం విమర్శలకు తావిస్తున్నది. ఈ ఏడాది అక్టోబరు 3న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బసినె విరుపాక్షి సోదరుడు, మరికొందరు వైసీపీ కార్యకర్తలు ఆలూరు, ఆస్పరి, దేవనకొండ మండలాల్లో వపన విద్యుత్తు (విండ్‌ వపర్‌) స్టేషన్లు, కార్యాలయాలపై దాడులు చేసి ఫర్నీచర్‌, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలు పగులుగొట్టి విధ్వంసం సృష్టించారు. ఇలా చేస్తే పరిశ్రమలు ఎలా వస్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు.

టీజీ భరత్‌ పరిశ్రమల శాఖ మంత్రి కావడం కలిసొచ్చిన అవకాశం

జిల్లాకు చెందిన కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కావడం ఉమ్మడి కర్నూలులో పరిశ్రమలు ఏర్పాటుకు కలిసొచ్చిన అవకాశం అని పలువురు అంటున్నారు. స్వయంగా యువ పారిశ్రామి కవేత్త కావడంతో రాష్ట్రానికి, ముఖ్యంగా జిల్లాకు వివిధ పరిశ్రమలు తీసుకురావడంతో టీజీ భరత్‌ కృషి ఎంతో ఉంది. అదే క్రమంలో రాష్ట్రంలో రూ.65 వేల కోట్లతో బయో గ్యాస్‌ ప్రాజెక్టులు ఏర్పాటుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ముందుకు రావడంపై పరిశ్రమలు, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ కృష్టి అభినందనీయం అని సీఎం చంద్రబాబు కొనియాడారంటే టీజీ కృషి ఏమిటో తెలుస్తుంది. ఈ ఏడాదే పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం, కీలకమైన పరిశ్రమలు జిల్లాకు తీసుకురావడంతో 2024కు మరవలేని గుర్తింపు వస్తుంది.

Updated Date - Dec 28 , 2024 | 11:29 PM