‘బాల’న్నగారి చేపల చెరువు!
ABN , Publish Date - May 09 , 2024 | 12:47 AM
‘బాల’న్నగారి చేపల చెరువు!
సాగు నీటి జలాశయాలను చేపల చెరువులుగా మార్చిన వైసీపీ నాయకులు
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అండతో పెట్రేగుతున్న వైనం
లక్ష్యం తప్పిన గురురాఘవేంద్ర ప్రాజెక్టు జలాశయాలు
మంత్రాలయం కరువు ప్రాంతం. గ్రామాల్లోని ప్రజలు సాగునీరు లేక మెట్ట వ్యవసాయం చేస్తుంటారు. వానలు కురవకపోతే పెద్ద ఎత్తున వలసపోతుంటారు. కరువు నివారణ లక్ష్యంగా గత టీడీపీ ప్రభుత్వం గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా పులికనుమ సహా నాలుగు జలాశయాలు నిర్మించింది. ఇంత మహదాశయంతో నిర్మించిన సాగునీటి జలాశయాలను కొందరు చేపల చెరువులుగా మార్చారు. ఈ అక్రమానికి పాల్పడుతున్న చేపల మాఫియాలోని వ్యక్తులు వైసీపీ నాయకుల అనుచరులు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అండతో వీళ్లు పెట్రేగిపోతున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారు. చట్ట వ్యతిరేకంగా బినామిల పేరిట చేపల వ్యాపారం చేసి రూ. కోట్లు గడిస్తున్నారు. ప్రజలకు తాగు, సాగునీరు అందకుండా చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకులు గ్రామాలకు వెళితే.. ఈ చేపల మాఫియా నుంచి జలాశయాలను రక్షించండి.. మీకే మా ఓటు అంటున్నారంటే ఏ స్థాయిలో ఈ మాఫియా రెచ్చిపోతోందో తెలుసుకోవచ్చు.
కర్నూలు, మే 8 (ఆంధ్రజ్యోతి):
మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడానికి, గ్రామాల్లో ప్రజల దాహం తీర్చడానికి గత టీడీపీ ప్రభుత్వం గురురాఘవేంద్ర ప్రాజెక్టు చేపట్టింది. తుంగభద్ర నదీజలాల 3.786 టీఎంసీలు ఎత్తిపోసి 45,790 ఎకరాలకు సాగునీరు అందించాలి. 2003లో అప్పటి మంత్రి బీవీ మోహన్‌రెడ్డి నాటి సీఎం చంద్రబాబును ఒప్పించి రూ.177 కోట్లు మంజూరు చేయించారు. టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి మూగలదొడ్డి, పులచింత, చిలకలడోణ, సోగనూరు, కృష్ణదొడ్డి, రేమట, మునగాల, కంబదహాల్, చింతమానుపల్లె ఎత్తిపోతల పథకాలు, జలాశయాలు పనులు చేపట్టారు. ఆ తరువాత 2005లో ప్యాకేజీ-97 కింద రూ.62.21 కోట్లు ఖర్చు చేసి మాధవరం, బసలదొడ్డి, దుద్ది ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్ల పనులు మొదలు పెట్టారు. వీటి కోసం రూ.242.48 కోట్లు ఖర్చు చేశారు. 1.23 టీఎంసీల సామర్థ్యంలో పులికనుమ జలాశయం నిర్మించి రూ.310 కోట్లు ఖర్చు పెట్టారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు లిఫ్టుల కోసం సుమారు రూ.552 కోట్లకు పైగా ప్రజా ధనం వెచ్చించారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక సాగునీటిపై చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ లిఫ్టులు పూర్తి చేసి సాగు జలాలు అందించారు. అయితే.. 2019లో వైసీపీ వచ్చాక గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలపై నిర్లక్ష్య మేఘాలు కమ్ముకున్నాయి. కనీసం నిర్వహణ నిధులు ఇవ్వకపోగా.. వైసీపీ నాయకులు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అండదండలతో సాగునీటి జలాశయాలను చేపల చెరువులుగా మార్చేశారు.
పెట్రేగుతున్న చేపల మాఫియా!
కోసిగి మండలం దుద్ది జలాశయం కింద 3 వేల ఎకరాలకు సాగునీరు అందాలి. వైసీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి స్వయాన బావమరిది వైసీపీ కోసిగి మండలం ఇన్చార్జి మురళిరెడ్డి ఈ రిజర్వాయర్‌ను చేపల చెరువుగా మార్చారు. మత్స్య శాఖ అనుమతి లేకుండా చేపలు పెంపకం చేపట్టారు. మూగలదొడ్డి జలాశయం కింద 3,793 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటే ఈ రిజర్వాయర్‌లో కూడా అనధికారికంగా చేపలు పెంపకం చేపట్టారు. ఐదేళ్లుగా చేపల మాఫియా పెట్రేగిపోతూ రూ.లక్షలు విలువైన చేపలు బెంగళూరు, హైదరాబాదుకు తరలిస్తున్నారు. మంత్రాలయం మండలం సూగూరు రిజర్వాయరు నుంచి దాదాపు 3 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంటే ఇక్కడ కూడా ఇదే పరిస్థితి.
బినామీల పేరిట మాఫియా పెత్తనం
ఎల్లెల్సీ కాలువలో నీటి సరఫరా లేనప్పుడు మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో చివరి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని పులికనుమ జలాశయం నిర్మించారు. దీని సామర్ధ్యం 1.23 టీఎంసీలు. ఈ రిజర్వాయర్‌లో ఒక్కటే చేపల పెంపకానికి మత్స్య శాఖ అనుమతి ఉంది. అయితే.. టెండర్లలో వైసీపీ నాయకులు పెత్తనం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అత్యంత సన్నిహితుడు, పెద్దకడుబూరు వైసీపీ మండల ఇన్చార్జి రవిచంద్రారెడ్డి బినామీ పేరుతో చేపల పెంపకం హక్కులు దక్కించుకున్నారు. ఆన్లైన్ టెండర్లు పేరిట ప్రత్యర్థులను రాకుండా అధికారం మాటున పెత్తనం చెలాయిస్తున్నారు. కేవలం రూ.85 వేలకు దక్కించుకొని రూ.లక్షలు విలువైన చేపలు రవాణా చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అండ ఉండడంతో అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణులు ఉన్నాయి.
రాయల చెరువులో అక్రమ చేపలు
పెద్దకడుబూరు మండలం చిన్నతుంబళం రాయల చెరువును శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారు. దీనికి కింద 1,050 ఎకరాలు ఆయకట్టు ఉంది. దిగువ గ్రామాలకు తాగునీరు కూడా ఇవ్వాలి. కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన గంగపుత్రులు చేపలు వేటతో జీవనం సాగిస్తున్నారు. ఈ చెరువుపై కన్నేసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకుడు రవిచంద్రారెడ్డి అధికారం, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అండతో అక్రమంగా చేపల పెంపకం చేపట్టారు. ఏడాదికి 70-100 లారీలు, టెంపోలకు పైగా చేపలు రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. అక్రమాలు బయటకు రాకుండా ఆ గ్రామానికి చెందిన గంగపుత్రులకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున రెండు విడతలుగా ఇస్తూ తన పెత్తనం సాగిస్తున్నారు. చేపలు పట్టే సమయంలో చెరువు మొత్తం ఖాళీ చేస్తుండడంతో దిగువ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
తుంగభద్ర కలుషితం
మంత్రాలయం, కోసిగి మండలాలు తుంగభద్ర నదీతీర గ్రామాలైన నారాయణపురం, తుంగభద్ర, అగసనూరు, సాతనూరు తదితర గ్రామాల్లో అనుమతుల పేరిట చేపల మాఫియా పెట్రేగిపోతుంది. వీరికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అండదండలు ఉండడంతో అధికారులు సైతం కళ్లకు గంతలు కట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చేపల చెరువుల వృఽథా నీటిని తుంగభద్రలో వదలేయడంతో నది జలాలు కలుషితం అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.