‘బెల్టు’ పెట్టుకోండి..!
ABN, Publish Date - Nov 16 , 2024 | 11:57 PM
మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబుహెచ్చరిస్తున్నా అందుకు భిన్నంగా ఆదోని నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు
ఊరురా తిరిగి బెల్టు షాపులను
ప్రోత్సహిస్తున్న మద్యం వ్యాపారులు
గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
ఆదోని, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబుహెచ్చరిస్తున్నా అందుకు భిన్నంగా ఆదోని నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లోకి మద్యం వ్యాపారులు వెళ్లి గతంలో ఎవరెవరు గొలుసు దుకాణాలు నిర్వహించారో వారంతా మళ్లీ మద్యం అమ్మాలంటూ ప్రోత్సహిస్తున్నారు. ఎంత సరుకు కావాలన్నా ఇస్తామని, పోలీసులతో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దగ్గరుండి పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ పల్లెలను మద్యంతో నాశనం చేస్తున్నారు.
అర్ధరాత్రి వరకు..
తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉంటోంది. ఒక్కో గ్రామంలో రెండు కంటే ఎక్కువ బెల్టు దుకాణాలు ఉన్నాయి. ఆదోని నియోజకవర్గంలోని 44 గ్రామ పంచాయతీల్లో దాదాపు వంద వరకు బెల్టు దుకాణాలు ఉన్నాయి. రోజు ఒక్కో దుకాణంలో 100 నుంచి 150 వరకు మద్యం సీసాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. బెల్టు షాపులో 150కి దొరికే మద్యం అదనంగా 30 నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఒక్కో దుకాణం నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వ్యాపారం సాగుతోంది.
పోలీసులకు దొరికితే పండగే
గ్రామాల్లో బెట్లు దుకాణం నిర్వహిస్తున్న వారు పోలీసులకు దొరికితే పండుగ చేసుకుంటున్నారు. అందిన కాడికి దోచుకో వడమే కాకుండా అక్కడ ఉన్న మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు తిరిగి నిర్వాహకుడుపై కేసు నమోదు చేస్తున్నారు. వారం రోజులు క్రితం ఆదోని మండలంలో ఓ గ్రామంలో మద్యం పట్టుబడింది. దొరికిన మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దొరికిన మద్యం మాత్రం బహిర్గతం చేయకుండా ఎంతో కొంత మొత్తాన్ని తీసుకొని మళ్లీ వాళ్లకే అప్పు చెబుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇటీవల ఆదోని డివిజన్‌లో ఓ ఎస్సై మద్యం దుకాణం నిర్వాహకుడిని అరెస్టు చేశాడు. 25 వేల రూపాయలు తీసుకొని వదిలిపెట్టకుండా తిరిగి అతనిపైనే కేసు నమోదు చేసి అరెస్టు చేయడంతో బెల్ట్ షాపు నిర్వాహకులు పోలీసులపై తిరగబడే పరిస్థితి నెలకొంది. లంచం తీసుకున్నా కేసులు పెట్టడంపై ఆదోని కూటమికి చెందిన బడా నేత దగ్గరకు వెళ్లి తమ గోడును వెల్లబోసు కున్నట్లు సమాచారం. త్వరలో ఎస్పీని కలిసి ఈ విషయాన్ని వివరిస్తామని హెచ్చరిస్తు న్నట్లు తెలుస్తోంది.
సిండికేట్‌గా మారి
ఆదోని నియోజకవర్గంలో 12 మద్యం దుకాణాలన్నాయి. విడివిడిగా ఉంటే గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు ఏర్పాటు, సరుకు సరఫరాకు ఇబ్బందులు వస్తాయని వ్యాపారులు సిండికేట్‌గా మారారు. దీని ద్వారా ఏ గ్రామంలోని గొలుసు దుకాణా నికైనా.. ఏ దుకాణం నుంచైనా మద్యాన్ని తీసుకువెళ్లవచ్చంటున్నారు. దీంతోపాటు వ్యాపారులు ఒక్కో బెల్టు దుకాణం యజమాని నుంచి డిపాజిట్‌గా రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆయా గ్రామాల్లో వారి అనుచరులకే దుకాణాలు కేటాయించాలంటూ మండల గ్రామ స్థాయి నాయకులు వ్యాపారులకు సిఫార్సు చేస్తుండడం గమనార్హం.
ఉపేక్షించేది లేదు..
గ్రామాలు, పట్టణంలో మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదు. ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు చేశాను. ఎక్కడైనా నిర్వహిస్తే సమాచారాన్ని ఇవ్వండి. ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. - సైదుల్లా, ఎక్సైజ్ సీఐ, ఆదోని
Updated Date - Nov 16 , 2024 | 11:57 PM