Share News

ప్రేమ పేరుతో మోసం

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:16 AM

ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది.

ప్రేమ పేరుతో మోసం
వరుడి ఇంటి ముందు బైఠాయించిన యువతి, ప్రియుడు ఈశ్వర్‌ ప్రసాద్‌తో యువతి

ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన

ఆదోని, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. కర్ణాటక రాష్ట్రం మైసూరు ప్రాంతానికి చెందిన యువతి చందన మంజునాథ్‌ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తోంది. అదే కంపెనీలోనే ఆదోని పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన బుగ్దే నాగరాజు, నాగవేణి దంపతుల

కుమారుడు గురు ఈశ్వర్‌ ప్రసాద్‌ పని చేస్తున్నారు. ఒకే కంపెనీలో పని చేస్తున్న వీరిద్దరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఆమోదం తెలపడంతో 40 తులాల బంగారం తోపాటు మరికొంత నగదు కట్న కానుకల కింద మాట్లాడు కున్నారు. నవంబరు 14న నిశ్చితార్థం, డిసెంబరు 6న పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వస్తానని గురు ఈశ్వర్‌ ప్రసాద్‌ ఆదోనికి వచ్చి ఇక్కడే ఉండిపోయాడు. తిరిగి రాకపోవడంతో యువతి వారం కిందట అబ్బాయి ఇంటికి చేరుకొని వారితోనే ఉంటోంది. అయితే గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయలో తల్లిదండ్రులతో కలిసి గురు ఈశ్వర్‌ప్రసాద్‌ ఉడాయించాడు. సదరు యువతి ఉదయం లేచి చూసే సరికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నష్టపోయానని గ్రహించింది. తనకు న్యాయం చేయాలంటూ గురు ఈశ్వర్‌ప్రసాద్‌ ఇంటి ముందే బైఠాయించింది. కొంతమంది మహిళలు మద్దతు తెలిపి డీఎస్పీ సోమన్నను కలిసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి చేసి న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను కోరింది. అయితే పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయలేదు.

Updated Date - Nov 16 , 2024 | 01:16 AM