‘కళాకారుల సమస్యలపై సీఎం స్పందించారు’
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:34 AM
రాష్ట్రంలో పేద, వృద్ధ రంగస్థల కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారని ఏపీ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు, ప్రముఖ రంగస్థల నటి మంగాదేవి అన్నారు.
కర్నూలు కల్చరల్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేద, వృద్ధ రంగస్థల కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారని ఏపీ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు, ప్రముఖ రంగస్థల నటి మంగాదేవి అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ప్రదర్శించిన సత్య హరిశ్చం ద్ర నాటకంలో మంగాదేవి సత్యహరిశ్చంద్రునిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆమె మాట్లాడుతూ శుక్రవారం రోజున సీఎంను కలిసి కళాకారుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చామని అన్నారు. అనేక సమస్యలను సీఎం దృష్టికి తీసుకురాగా త్వరలోనే వాటికి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆమె గుర్తు చేశారు. త్వరలోనే కర్నూలు జిల్లాలోనూ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం శాఖను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇటీవల ఒంగోలులో తమ ప్రదర్శనల ద్వారా వచ్చిన రూ.2 లక్షలు నగదు వరద సహాయ నిధికి అందజేశామని చెప్పారు. సమావేశానికి అధ్యక్షత వహించిన పత్తి ఓబులయ్య మాట్లాడుతూ ప్రతి నెలా టీజీవీ కళాక్షేత్రం పక్షాన నాట కానికి రూ.10వేలు, బయట నుంచి వచ్చిన కళాకారులు పూర్తి నాటకం వేస్తే రూ.30 వేలు పారితోషికం ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం కార్యదర్శి మహ్మద్ మియా, కన్వీనర్ జి. శ్రీనివాసరెడ్డి, యాగంటీశ్వరప్ప పాల్గొన్నారు.
అలరించిన సత్య హరిశ్చంద్ర నాటకం... యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో రంగస్థల పద్యాల ఫేమ్‌గా నిలిచిన రంగస్థల నటీమణి మంగాదేవి సత్యహరిశ్చంద్రునిగా ప్రధాన పాత్ర వేసి నటించిన సత్య హరిశ్చంద్ర నాటకం అసాంతం ప్రేక్షకులను ఉర్రూత లూగించింది. మహిళా నటీమణి అయినా ఆమె పద్యాలాపనలో మగగొంతుకతో పోటీ పడుతూ పాడిన పద్యాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ నాటకంలో వనజకుమారి, ఆంజనేయులు, రాజారత్నం, సంగా ఆంజనేయులు, వెంకటేశ్వర్లు వివిధ పాత్రల్లో మెప్పించారు. పత్తి ఓబులయ్య కళాకారులను జ్ఞాపిక, శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
Updated Date - Oct 21 , 2024 | 12:34 AM