ఫైళ్ల భద్రతకు డిజిటలైజేషన్
ABN, Publish Date - Nov 16 , 2024 | 11:54 PM
కోర్డుల్లోని ఫైళ్లను భద్రపరిచేందుకు న్యాయశాఖ డిజిటలైజేషన్‌ను చేపట్టినట్లు జిల్లా న్యాయాధికారి కబర్ది తెలిపారు.
నంద్యాల క్రైం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కోర్డుల్లోని ఫైళ్లను భద్రపరిచేందుకు న్యాయశాఖ డిజిటలైజేషన్‌ను చేపట్టినట్లు జిల్లా న్యాయాధికారి కబర్ది తెలిపారు. శనివారం నంద్యాల జిల్లా కేంద్రంలోని కోర్టు భవనాల సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్టులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా భవన సముదాయంలోని పలు కోర్టులను ఆయన తనిఖీ చేశారు. కోర్టులోని ఫైళ్లను పరిశీలించారు. అనంతరం నంద్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. న్యాయాధికారి కబర్ది మాట్లాడుతూ నంద్యాల న్యాయవాదులు విన్నవించిన విన్నపాలను తనవంతుగా త్వరిత గతిన పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. న్యాయవాదులకు ఆయన పలు సలహాలు, సూచనలు చేశారు. త్వరలో నంద్యాలలో జిల్లా కోర్టు, ఫ్యామిలీ కోర్టు, మరో ఎన్‌ఐ యాక్ట్ కోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టు, అదనంగా రెండు కోర్టులను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. న్యాయవాదులు లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకునేందుకు సహకరించాలని సూచించారు. కోర్టులో మౌలిక వసతుల కల్పన, ఆవరణలో వసతి గృహాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మూడవ అదనపు జిల్లా న్యాయాధికారి వాసు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయాధికారి రాధారాణి, రెండవ అదనపు జిల్లా సీనియర్ సివిల్ న్యాయాధికారి కిరణ్‌కుమార్, ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఏసురత్నం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.దుర్గాప్రసాద్, భూమావెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సింగరి జీవన్‌రాజ్, ద్వారక, విజయశేఖరరెడ్డి, వనం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 11:54 PM