శివయ్య క్షేత్రంలో జ్వాలాతోరణం
ABN , Publish Date - Nov 16 , 2024 | 12:19 AM
హరహర మహాదేవ శంభోశంకర... ఓం నమఃశివాయ.. అంటూ భక్తుల శివనామస్మరణతో శ్రీగిరి క్షేత్రం మార్మోగింది.
ఘనంగా లక్ష దీపోత్సవం, గంగా హారతి
భక్తులతో కిక్కిరిసిన శ్రీగిరి
శ్రీశైలం, నవంబరు 15(ఆంధ్రజోతి): హరహర మహాదేవ శంభోశంకర... ఓం నమఃశివాయ.. అంటూ భక్తుల శివనామస్మరణతో శ్రీగిరి క్షేత్రం మార్మోగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో శ్రీగిరి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులు తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. పాతాళగంగ వద్ద పుణ్యనదీ హారతి, ప్రధాన ఆలయానికి ముందుభాగాన గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం, ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరణికి దశ విధ హారతులు కన్నులపండువగా సాగాయి. పౌర్ణమి సందర్భంగా క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. భ్రమరాంబమల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పాతాళగంగలో అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేశారు. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. కార్తీక పౌర్ణమి వేడుకలను దేవదాయశాఖ జాయింట్ కమిషనర్, కార్తీక మాసోత్సవాల ప్రతేక అధికారి ఎస్. ఎస్ చంద్రశేఖర ఆజాద్, ఈఓ చంద్రశేఖర్ పర్యవేక్షించారు.
జ్వాలాతోరణం
శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లను పల్లకిలో ఆశీనులనుజేసి మంగళవాయిద్యాల నడుమ ఆలయం ముందుభాగాన ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వద్దకు తోడ్కొని వచ్చి పూజాదికాలు నిర్వహించి, జ్వాలాతోరణాన్ని ప్రజ్వలింపచేశారు. ఈ జ్వాలాతోరణ భస్మాన్ని నుదుటన ధరించడం వలన ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. కాగా జ్వాలా తోరణం వేడుకలో వినియోగించే నూలు ఒత్తులను బాపట్ల జిల్లా వేటపాలెం మండలం, ఆమోదగిరిపట్నానికి చెందిన భక్తులు వసుంధరరావు, రామకృష్ణారావు సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో వచ్చి సమర్పించారు.
లక్ష దీపోత్సవం
మల్లన్న కొండపై శుక్రవారం రాత్రి కార్తీక పౌర్ణమిని సందర్భంగా లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి పుష్కరణి వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా వివిధ ఆకృతుల్లో రూపొందించిన దీపాలను వెలిగించి పూజాదికాలు చేపట్టారు.
కర్నూలు నగరం.. కార్తీక శోభితం
వినాయక ఘాట్‌లో ఘనంగా వేడుకలు
వివిధ ఆలయాలు, తుంగభద్రనదీ తీరాల్లో పూజలు
కర్నూలు కల్చరల్, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): కార్తీక మాసంలో విచ్చేసే కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరం ఆధ్యాత్మిక శోభితంగా మారిపోయింది. పున్నమి వెలుగులో నింగిలోని తారలన్నీ నేలపై వెలిగినట్లుగా... కార్తీక పౌర్ణమి దీపోత్సవ శోభ నగరాన్ని పసిడి కాంతులతో నింపింది. చిరుదివ్వెల కిరణాలన్నీ వేవేల వెలుగుల్ని విరజింపజేశాయి. శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలను నగరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. నగరంలోని వివిధ ఆలయాలు, ధార్మిక క్షేత్రాలు, కేసీ కెనాల్ ఒడ్డున శుక్రవారం సాయంత్రం నుంచి నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండువలా సాగింది. శైవ, వైష్ణవ ఆలయాల్లో కార్తీక దీపాలు, జ్వాలా తోరణాల మహోత్సవాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కర్నూలు కార్తీక దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కేసీ కెనాల్ వినాయక ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఘాట్‌కు ఇరువైపులా విద్యుద్దీపాలతో అలంకరించి, కాషాయ పతకాలను ఏర్పాటు చేశారు.