Share News

ఇంకెన్నాళ్లు..?

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:56 PM

జిల్లాలో కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఐదేళ్లవుతున్నా నేటికీ దక్కలేదు.

ఇంకెన్నాళ్లు..?
జిల్లా ట్రెజరీ కార్యాలయం

2019లో మూడు నెలల శాలరీ పెండింగ్‌

నంద్యాల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఐదేళ్లవుతున్నా నేటికీ దక్కలేదు. అధికారులు చేసిన తప్పిదాలకు కాంట్రాక్ట్‌ అధ్యాపకులు వేతనాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019 ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల పెండింగ్‌ రోజులకు సంబంధించి జీతాలు ఇచ్చే విషయంలో చిన్న పొరపాటు జరిగింది. దీనివల్ల ఉమ్మడి జిల్లాలో దాదాపు 12 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఒక్కొక్కరు దాదాపు రూ.62 వేలను కోల్పోయారు. ఈ మొత్తం పెండింగ్‌ రోజుల జీతాన్ని తమకు అందేలా చూడాలంటూ ఐదేళ్ల నుంచి వారు పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్‌ వేతనాలు అందించాలని కోరుతున్నారు. రాయలసీమ పరిధిలోని జోన్‌-4లో దాదాపు 296 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులు ఉండగా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 90 మంది ఉన్నారు. ఆయా ప్రభుత్వ కళాశాలల్లో విద్యా బోధన చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిన ప్రభుత్వం వీరిని నియమిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియను చేపడుతూ మరుసటి సంవత్సరం వీరి కాంట్రాక్టును పునురుద్ధరిస్తూ ఉంటుంది. ఈ పద్ధతిలో కాంట్రాక్టు లెక్చరర్లకు 12 నెలల జీతం (10 రోజుల విరామంతో) జీతం చెల్లిస్తుంది. పది రోజులు విరామమిచ్చి మళ్లీ మరుసటి ఏడాదికి కాంట్రాక్టును పునరుద్ధరిస్తుంది. కానీ 2019 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌, మే, జూన్‌ పెండింగ్‌ రోజులకు సంబంధించిన వేతనాలు కొంతమంది కాంట్రాక్టు అధ్యాపకులు దక్కించుకోగా, మరికొంతమందికి అందలేదు. వేతనాలు దక్కని కాంట్రాక్టు అధ్యాపకులు తమ పరిస్థితికి కారణమేమిటని ఆరా తీశారు. అప్పటి ప్రభుత్వం వెలువరించిన జీవోల్లో స్పష్టత లేకపోవటంతో జీతాలు చెల్లించలేదని సంబంధిత ట్రెజరీ అధికారులు చెప్పుకొచ్చారు.

స్పష్టత లేకపోవటంతో..

సాధారణంగా ప్రభుత్వ శాఖ అయినా, ప్రైవేటు కంపెనీ అయినా ఆ ఏడాది ఏప్రిల్‌ నుంచి మరుసటి ఏడాది మార్చి వరకు ఆర్థిక సంవత్సరాన్ని పాటిస్తాయి. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు సంవత్సరాల్లోని పన్నెండు నెలలు ఉంటాయి. ఉదాహరణకు గత ఏడాది ఆర్థిక సంవత్సరం అని ఎవరైనా పేర్కొన్నాలి వస్తే 2023-24 అని రాస్తారు. అంటే 2023వ సంవ్సరంలోని ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు ఉన్న 9 నెలలు, 2024వ సంవత్సరంలోని జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు మూడు నెలలను కలిసి 2023-24 ఆర్థిక సంవత్సరంగా పేర్కొంటారు. కానీ విద్యాశాఖలో ఆర్థిక సంవత్సరం అని కాకుండా విద్యా సంవత్సరం అని పేర్కొంటారు. దీని ప్రకారం విద్యా సంవత్సరం జూన్‌ నుంచి మొదలై మే నెలతో ముగుస్తుంది. కాంట్రాక్టు అధ్యాపకుల నియమకాలను విద్యాశాఖ ప్రాతిపాదికన సంబంఽధిత శాఖ చేపడుతుంది. కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించి 12 నెలల జీతం (10 రోజుల విరామంతో) చెల్లించేలా 2019 సంవత్సరంలో ప్రభుత్వం జీవోఆర్టీ నెం:187, జీవోఎంస్‌ నంబరు 12ను విడుదల చేసింది. ఈ జీవోల్లో కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించి జీతాలు చెల్లింపు విషయమై చిన్న పొరపాటు జరిగిందన్నది ట్రెజరీ అధికారుల వాదన. దీనివల్ల ఉమ్మడి జిల్లాలోని 12 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు 2019 ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించి పెండిగ్‌ రోజులకు జీతాలు అందలేదు.

కళాశాల ఉన్నత విద్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 154 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులు విద్యాబోధన చేస్తున్నారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన జీతాల చెల్లింపు విషయమై గందరగోళం కొనసాగుతున్న సమయంలోనే దాదాపు 90 కళాశాలల్లోని కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలు చెల్లింపులు జరిగిపోయాయి. మిగిలిన వారికి జీతాలు చెల్లించటంలో జిల్లా ట్రెజరీ అధికారులు ఉదాసీన వైఖరి ప్రదర్శించారు. ఇలా జీతాలు తీసుకోని ఉమ్మడి జిల్లా కాంట్రాక్టు లెక్చరర్లు విసిగిపోయి తమ పెండింగ్‌ జీతాలు చెల్లించాలంటూ డీటీఏ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌) శాఖకు మొర పెట్టుకున్నారు. అసలు విషయం ఏమిటి? ఎందుకు నంద్యాల ట్రెజరీ అధికారులు జీతాలు పెండింగ్‌లో పెట్టారు? అనే విషయంపై డీటీఏ అప్పట్లో ఆరా తీసింది. జీవోల్లో 2019-20 విద్యా సంవత్సరం అనేది, 2019 ఏప్రిల్‌, మే నెలలకు వర్తించదని, 2018-19 విద్యా సంవత్సరం అని ఉంటే జీతాలు చెల్లించటంలో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని, అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం మంది కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలు చెల్లించారు కాబట్టి, మిగిలిన వారికి కూడా చెల్లించవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. జిల్లా ట్రెజరీ అధికారులు మాత్రం జీవోఆర్టీ నెం:187, జీవోఎంస్‌ నంబరు 12లో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, దీనివల్ల పెండింగ్‌ రోజుల జీతం బకాయిలను చెల్లించలేమని స్పష్టం చేశారు. వీరి తీరువల్ల ఇన్నేళ్ళ నుంచి కాంట్రాక్టు లెక్చరర్లు 2019 ఏప్రిల్‌, మే, జూన్‌ నెల పెండింగ్‌ జీతాలు అందుకోవటంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

రికవరీ చేయాలంటూ ఆదేశాలిచ్చినా..

తమకు పెండింగ్‌ వేతనాలు ఇవ్వని పక్షంలో అప్పటికే శాలరీ తీసుకున్న కాంట్రాక్టు అధ్యాపకుల నుంచి సొమ్ము రికవరీ చేయాలని, లేదా వారికి వేతనాలు ఎలా ఇచ్చారో, తమకు కూడా ఇవ్వాలని కోరారు. దీనిపైన స్పందించిన అప్పటి డీటీఏ 2019 ఏప్రిల్‌, మే, జూన్‌ నెల పెండింగ్‌ రోజులకు చెల్లించిన వేతన సొమ్మును కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి రికవరీ చేయాలంటూ నంద్యాల జిల్లా డీటీఓ, ఎస్టీఓ ట్రెజరీ అధికారులకు 2020 నుంచి 2022 సంవత్సరాల మధ్యలో మూడు మార్లు మెమోలు జారీ చేశారు. దీంతో నంద్యాల డీటీఓ జీతాలు రికవరీ చేయాలని 2023 ఫిబ్రవరిలో ఆయా ఎస్టీఓలకు అప్పట్లో ఉత్తర్వులు ఇచ్చారు. అయినా జీతాలు రికవరీ కాకపోవటంతో డీటీఏ మరోమారు 2023 అక్టోబరులో జిల్లా ట్రెజరీ అధికారులకు మెమో ఇచ్చారు. దీంతో కొంతమంది ఎస్టీఓలు వేతనాలను రికవరీ చేసేందుకు పూనుకున్నా, నంద్యాల జిల్లాలోని యర్రగుంట్ల కళాశాలలో తప్పించి మిగతా ఎక్కడా కూడా వేతనం రికవరీ కాలేదు. మరి మిగిలిన వారి నుంచి జీతాలు ఎందుకు రికవరీ చేయలేదని డీటీఓతో పాటు మిగిలిన ఎస్టీఓ ట్రెజరీ అధికారులను కాంట్రాక్టు లెక్చరర్లను ప్రశ్నిస్తున్నారు. దీనిపైన సంబంధిత అధికారులు ఎలాంటి సమాధానమివ్వటం లేదు.

నిబంధనల ప్రకారమే చెల్లించాం

2019 ఏప్రిల్‌, మే, జూన్‌ నెల పెండింగ్‌ జీతాలను అడుగుతున్న వారి విషయంలో అప్పటి ప్రభుత్వ జీవో ప్రకారమే నడుచుకున్నాం. కానీ కాంట్రాక్టు లెక్చరర్లు జీవో వచ్చిన విద్యా సంవత్సరానికి సంబంధించినవి కాకుండా, అంతకుముందు సంవత్సరానికి సంబంధించిన జీతాలను అడుగుతున్నారు. అలా ఇవ్వడం కుదరదు. కొంతమంది కాంట్రాక్టు లెక్చరర్లకు అప్పుటి ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన జీతాలు పడ్డాయి. వీటిని తిరిగి రికవరీ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. త్వరలోనే వాటిని కూడా రికవరీ చేస్తాం. జీతాలు రాలేదని చెబుతున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాం.

- లక్ష్మీదేవి, జిల్లా ట్రెజరీ అధికారి, నంద్యాల

Updated Date - Nov 16 , 2024 | 11:56 PM