Share News

నిబంధనలు తుంగలో..

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:58 PM

వైసీపీ రంగు పూసుకున్న ఓ కాంట్రాక్టర్‌ అక్రమాలు కారణంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న తుంగభద్ర ప్రాజెక్టు (టీబీపీ) బోర్డు అకౌంట్‌ ఫ్రీజ్‌ చేసే పరిస్థితికి వెళ్లింది.

నిబంధనలు తుంగలో..
తుంగభద్ర జలాశయం

‘వైసీపీ’ కాంట్రాక్టర్‌ ప్రయోజనం కోసం..

టీబీపీ బోర్డునే తప్పుదోవ పట్టించారు

వైసీపీ హయాంలో ఇష్టారాజ్యం

ఓ ఈఎన్‌సీ పాత్రపై అనుమానం

వైసీపీ రంగు పూసుకున్న ఓ కాంట్రాక్టర్‌ అక్రమాలు కారణంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న తుంగభద్ర ప్రాజెక్టు (టీబీపీ) బోర్డు అకౌంట్‌ ఫ్రీజ్‌ చేసే పరిస్థితికి వెళ్లింది. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో జరిగిన అవినీతి కారణంగా ఏకంగా బోర్డు ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయాయి. బోర్డులో పని చేస్తున్న దాదాపు 600 మంది ఉద్యోగులు, ఇంజనీర్లు, అవుట్‌ సోర్సింగ్‌ వర్కర్లు, పింఛన్‌దారులు రెండు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి రావడానికి దారితీసిన కారణాలు ఏమిటి? కూపి లాగితే విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. బళ్లారిలో స్థిరపడిన ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ రంగు పూసుకున్న ఓ కాంట్రాక్టర్‌ ప్రయోజనం, స్వలాభం కోసం 70 ఏళ్ల చరిత్ర కలిగిన టీబీపీ బోర్డు ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. జీవో నంబరు.45కు విరుద్ధంగా టెండర్లు పిలవడమే కాకుండా ఏకంగా నిబంధనలు తుంగలో కలిపేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. వైసీపీ హయాంలో పని చేసిన ఓ ఈఎన్‌సీ, అదే సమయంలో బోర్డులో పని చేసిన ఓ ఉన్నత ఇంజనీరింగ్‌ అధికారి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ)తో విచారణ చేయిస్తే.. ఐదేళ్లలో టీబీపీ బోర్డులో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

కర్నూలు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాయసీమ జీవనాడి తుంగభద్ర జలాశయం. కర్నూలు జిల్లాలో తుంగభద్ర దిగువ కాల్వ (ఎల్లెల్సీ) పరిధిలో ఖరీఫ్‌, రబీలో 1,51,413 ఎకరాలకు, అనంతపురం, కడప జిల్లాల్లో టీబీపీ హెచ్చెల్సీ కాలువ కింద 2,84,992 ఎకరాలు, కేసీ కాలువ కింద ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. తుంగభద్ర డ్యాం నుంచి ఏపీ వాటాగా 66.50 టీఎంసీలు కేడబ్ల్యూడీటీ-2 కేటాయించింది. ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సాగు, తాగునీటి ప్రయోజనాల కోసం టీబీపీ బోర్డును 1953లో ఏర్పాటు చేశారు. తుంగభద్ర డ్యాం సహా ఎల్లెల్సీ కాలువ 0/0 నుంచి 241 కిలోమీటర్లు వరకు, హెచ్చెల్సీ కాలువ 0/0 నుంచి 135 కి.మీలు వరకు టీబీపీ బోర్డు పర్యవేక్షణలో ఉంది. బోర్డు పాలకవర్గంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఎస్‌ఈ స్థాయి అఽధికారి సెక్రెటరీగా, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రెటరీ హోదా కలిగిన ఐఏఎస్‌ అధికారి, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్‌సీ హోదా అధికారులు సభ్యులుగా ఉంటారు. తుంగభద్ర డ్యాం, కాలువలు నిర్వహణ, మరమ్మతులు, ఆధునికీకరణ, ఉద్యోగుల జీతాలు కోసం ఏపీ ప్రభుత్వం 65 శాతం, కర్ణాటక ప్రభుత్వం 35 శాతం నిధులు సమకూరుస్తుంది. ముందుగా ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి నిధులు కేటాయిస్తుంది. ఆ తరువాత కర్ణాటక ఇవ్వాల్సిన వాటా నిధులు సర్దుబాటు చేస్తుందని ఇంజనీర్లు అంటున్నారు. మూడు నెలలకు ఒకసారి జరిగే బోర్డు సమావేశంలో తీసుకునే నిర్ణయాలే అమలు చేయాలి. స్వయంప్రతిపత్తి కలిగిన తుంగభద్ర బోర్డును సైతం వైసీపీ ఆయాంలో ఒకరిద్దరు కాంట్రాక్టర్లు, వైసీపీ ముఖ్య నాయకులు, కొందరు ఇంజనీరింగ్‌ అధికారుల ధనాపేక్ష, స్వార్థప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించారనే ఆరోపణులు లేకపోలేదు. వైసీపీ రంగు పూసుకున్న ఓ కాంట్రాక్టర్‌ అక్రమాలు వల్ల బోర్డు బోర్డు ఖాతా కార్యకలాపాలే ఆగిపోయాయంటే బోర్డులో రాజకీయ జోక్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తుంది.

‘తుంగ’లో టెండరు నిబంధనలు

తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) కర్ణాటక పరిధిలో 121 కి.మీల వద్ద హగరినదిపై 56 పిల్లర్లతో అక్విడక్ట్‌ నిర్మించారు. 2022 అక్టోబరులో హగరి (వేదవతి) వరద ఉధృతికి ఒక పిల్లరు కొట్టుకుపోయింది. తాత్కలిక మరమ్మతు పనులు బళ్లారిలో స్థిరపడిన ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ రంగు పూసుకున్న కాంట్రాక్టర్‌కు అప్పగించారు. దాదాపు రూ.15 కోట్ల ఖర్చు చేశారు. మరో రూ.40 కోట్లతో శాశ్వత మరమ్మతు పనులకు 2022 డిసెంబరు 13న టెండర్లు పిలిచారు. ఆ కాంట్రాక్టర్‌కు వంతెన నిర్మాణాల అనుభవం లేకపోవడంతో టీబీపీ బోర్డు ఇంజనీర్లు జీఓ-67 ప్రకారం జాయింట్‌ వెంచర్‌కు అనుమతి ఇచ్చారు. సింగిల్‌ టెండరు షెడ్యూల్‌ రావడంతో ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. 2023 జనవరిలో దాదాపు రూ.400 కోట్లతో ఎల్లెల్సీ, హెచ్చెల్సీ లైనింగ్‌ పనులకు పిలిచిన టెండర్లతో జాయింట్‌ వెంచర్‌ నిబంధన తొలగించారు. కేవలం వైసీపీ కాంట్రాక్టర్‌ ప్రయోజనం కోసమే ఇలా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చాడు. ఆ తరువాత ఆ కాంట్రాక్టర్‌తో చర్చలు జరిపి స్టే ఎత్తివేయించినట్లు తెలుస్తుంది.

తొలి దశలో ప్యాకేజీ-11 కింద రూ.61.26 కోట్లతో ఎల్లెల్సీ 10.00 కి.మీల నుంచి 18.600 కి.మీల వరకు కెనాల్‌ సెక్షన్‌, సీసీ లైనింగ్‌ పనులకు టెండర్లు పిలిచారు. అర్హత కలిగిన ఏ కాంట్రాక్టరు అయినా ఆన్‌లైన్‌ టెండరు షెడ్యూల్‌ వేయవచ్చు. ఆ కొండ రాళ్లు కాలువలో పడకుండా గ్రౌటింగ్‌, షాట్‌క్రీటింగ్‌ పనులు చేసే టెండరు నిబంధనలు సవరించారు. ఆ పనుల్లో అనుభవం కలిగిన కాంట్రాక్టరు ఒక్కరే టెండరు వేశారు. ఈ నిబంధనల ప్రకారం కొండరాళ్ల మధ్య రంధ్రాలను పూడ్చేందుకు 5 ఎంపీఏ, 2 ఎంపీఏ పవర్‌తో సిమెంట్‌ గ్రౌండింగ్‌ పనులు, సిమెంట్‌, ఇసుక మిశ్రమాన్ని వపర్‌ గన్‌తో సీసీ లైనింగ్‌ చేసే షార్ట్‌క్రీటింగ్‌ చేయాలి. టెండర్లు ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రౌటింగ్‌, షార్ట్‌క్రీటింగ్‌ అవసరం లేదని, కెనాల్‌ సెక్షన్‌, సీసీ లైనింగ్‌ పనులు చాలంటూ వర్క్‌ మోడిఫికేషన్‌ (పని సవరణ) చేశారు. ఆ ప్రకారమే బిల్లులు చేశారని తెలుస్తుంది. కాంట్రాక్టర్‌ ప్రయోజనం అడ్డంగా నిబంధనలు మార్చేసి బోర్డునే భ్రష్టుపట్టించారనే ఆరోపణులు బలంగా వినిపిస్తున్నాయి.

సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌తో విచారణ చేయిస్తే..

తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యంగబద్దమైన సంస్థ కావడంతో.. కాలువలు మోడరైజేషన్‌ కోసం ఏపీ ప్రభుత్వం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా.. ఆ పనుల్లో నాణ్యతాప్రమాణాలపై తనిఖీ ఏపీ ప్రభుత్వం క్వాలిటీ కంట్రోల్‌, విజిలెన్స్‌ తనిఖీ చేసే అధికారం లేదు. దీంతో బోర్డులో పని చేసే ఇంజనీరింగ్‌ అధికారులు కొందరు, కాంట్రాక్టర్లు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ముఖ్య నాయకులు కుమ్మక్కై నిబంధనలు, నాణ్యతాప్రమాణాలు తుంగలో కలిపేసి అడ్డంగా దోపడి చేస్తున్నారనే ఆరోపణులు బలంగా ఉన్నాయి. దీంతో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) విచారణ చేయిస్తే గత వైసీపీ హయాంలో సాగించిన అవినీతి అక్రమాల గుట్టు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది వైసీపీ హయాంలో జరిగిన మరమ్మతులు, ఆధునికీకరణ పనుల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Nov 16 , 2024 | 11:58 PM