Share News

ఉల్లి రైతుకు కన్నీళ్లు

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:15 AM

ఉల్లి పంట చేతికి వచ్చే టయానికి ధరలు పతనమయ్యాయి. అసలే దిగుబడి భారీగా తగ్గిపోయింది.

ఉల్లి  రైతుకు కన్నీళ్లు

పంట పొలాలను దున్నేస్తున్న అన్నదాత

సాగు ఖర్చులు కూడా రాని వైనం

చాగలమర్రి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఉల్లి పంట చేతికి వచ్చే టయానికి ధరలు పతనమయ్యాయి. అసలే దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఈ ఏడాదైనా ఉల్లి పంట సాగు చేసి అప్పులు తీర్చుకుంటామని అనుకుంటుండగా అధిక వర్షాలతో దిగుబడి లేక, ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకపోతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్‌కు తీసికెళ్లే ఖర్చు కూడా రావడం లేదని దున్నేస్తున్నారు. ఎర్రగా నిగనిగలాడే క్రిష్ణాపురం(కేపీ ఉల్లి) ఉల్లి గడ్డలకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. అయితే రాష్ట్రంలో మార్కెట్‌ సౌకర్యం లేదు. గత ఏడాది క్వింటం రూ.7 వేలు పలికింది. ధర ఉండటంతో ఈ ఏడాది కేపీ ఉల్లి అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ధర పతనమైంది. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు కన్నీరు పెడుతున్నారు. ఎకరాకు రూ.80 వేలు నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. తెగుళ్లతో కేపీ ఉల్లి దిగుబడి భారీగా తగ్గింది. మండలంలోని చింతలచెరువు, కొలుములపేట, పెద్దవంగలి, చిన్న వంగలి, మూడురాళ్లపల్లె, కొత్తపల్లె, ఆవులపల్లె గ్రామాల్లో కేపీ ఉల్లిని సాగు చేశారు. 1,000 ఎకరాల్లో కేపీ ఉల్లి పంటను సాగు చేశారు. ఒక్క చింతలచెరువు గ్రామంలోనే 300 ఎకరాలకు పైగా ఉల్లి పంట వేశారు. పంట ఏపుగా పెరిగి దిగుబడి వచ్చే సమయంలో అధిక వర్షాలు, తెగుళ్ల వల్ల పంట దెబ్బతినింది. పంట చేతికొచ్చే సమయంలో ధర కూడా తగ్గడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు 40 క్వింటాళ్ల నుంచి 60 క్వింటాళ్ల దాక దిగుబడి రావాల్సి ఉండగా 10 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. క్వింటం రూ.4 వేలు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది రూ.7 వేలు క్వింటం ధర రావడంతో రైతులు అధిక శాతం సాగు చేశారు. అయితే ఇప్పుడు ధరలు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. 8 ఏళ్ల కిందట దాదాపు 10 వేల ఎకరాల్లో కేపీ ఉల్లి పంట సాగు అయ్యేది. ప్రస్తుతం 1,000 ఎకరాలకు పడిపోయింది. అయితే వ్యాపారులు, దళారులు నిర్దేశించిన ధరకే విక్రయించుకోవాల్సి రావడంతో పంట సాగు చేసే రైతుల సంఖ్య తగ్గిపోతోంది. పంట దిగుబడి లేకపోవడంతో కొందరు రైతులు కేపీ ఉల్లి పంటను పొలాల్లోనే దున్నేస్తున్నారు.

మార్కెట్‌ సౌకర్యం కల్పించాలి

కేపీ ఉల్లి కొనుగోలు చేసేందుకు మార్కెట్‌ సౌకర్యం లేక రైతులు నష్టపోతున్నారు. 100 క్వింటాళ్ల బస్తాకు అదనంగా 15 కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాపారులు తూకాల్లో రైతులను దగా చేస్తున్నారు. దీంతో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మరో వైపు దళారుల వ్యవస్థ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. విదేశాలకు సరఫరా చేసే కేపీ ఉల్లి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్‌, మార్క్‌ఫెడ్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి మార్కెట్‌ సౌకర్యం, మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

కేపీ ఉల్లి పంటకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. మార్కెటింగ్‌ సౌకర్యం లేక పోవడంతో పంట సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. గత ఐదేళ్ల క్రితం 10 వేల ఎకరాల వరకు పంట సాగు చేసేవారు. అయితే ఇప్పుడు వందల ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. పలు రకాల ఉద్యాన పంటల దిగుబడులను ఎగుమతికి ప్రోత్సహిస్తున్నా ప్రభుత్వం కేపీ ఉల్లిని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వమైనా విదేశాల ఎగుమతిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

అప్పుల ఊబిలో కూరుకపోతున్నాం

మూడెకరాల్లో ఉల్లి పంట సాగు చేశా. గత ఏడాది మార్కెట్‌లో మంచి ధర ఉండటంతో ఉల్లి సాగు చేశాను. సాగుకు దాదాపు రూ.3 లక్షలు అయింది. అధిక వర్షాలు, తెగుళ్లతో పంట దెబ్బతింది. పంట చేతికొచ్చాక మార్కెట్‌లో ధర లేదు. పంటను కోసి తరలించాలన్నా ఖర్చు అవుతుంది. పెట్టుబడి కూడా రాకపోవడంతో పంటను వదిలేశా.

-సంజీవరెడ్డి, రైతు, కొలుములపేట

ప్రభుత్వం ఆదుకోవాలి

అధిక వర్షాలు, తెగుళ్ల వల్ల ఉల్లి పంట దెబ్బతినింది. 5 ఎకరాల్లో సాగు చేశా. రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టా. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనపడటం లేదు. అప్పుల ఊబిలో కూరుకపోతున్నాం. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి.

-సుధాకర్‌రెడ్డి, రైతు, చింతలచెరువు

నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాం

కేపీ ఉల్లి పంట అధిక వర్షాలు, తెగుళ్ల వల్ల దెబ్బతిన్న పంట నష్టం గురించి ప్రభుత్వానికి తెలియజేస్తాం. కేపీ ఉల్లి దిగుబడి తగ్గింది. మిగతా మండలాలతో పోలిస్తే వర్షాల వల్ల చాగలమర్రిలో దిగుబడి తక్కువగానే ఉంది. దిగుబడి రాకపోవడంతో కొందరు రైతులు పంటను దున్నేస్తున్నారు. పంట నష్టాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

- శ్రీధర్‌, ఉద్యానశాఖ అధికారి

Updated Date - Nov 16 , 2024 | 12:15 AM