పొంచి ఉన్న నీటి ఎద్దడి
ABN , Publish Date - Nov 23 , 2024 | 01:32 AM
పట్టణ జనాభా దాదాపు 2.5లక్షలు. 19వేల కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. పట్టణ ప్రజలకు రోజూ 25మిలియన్ల లీటర్ల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 22మిలియన్ల లీటర్ల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు.
దెబ్బతిన్న బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకు కాంక్రీట్ ఫ సగం కూడా నింపలేని దుస్థితి
మరమ్మతులు చేస్తే తప్ప.. ఆదోని ప్రజల దాహార్తి తీరదు
ఆదోని టౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పట్టణ జనాభా దాదాపు 2.5లక్షలు. 19వేల కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. పట్టణ ప్రజలకు రోజూ 25మిలియన్ల లీటర్ల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 22మిలియన్ల లీటర్ల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు.
బసాపురం ట్యాంకు నుంచే సరఫరా
పట్టణ ప్రజల ప్రధాన తాగునీటి అవసరాలు తీర్చేందుకు లో బసాపురం సమ్మర్ స్టోరేజీ ట్యాంకును 2004లో నిర్మించారు. పూర్తి సామర్థ్యం 3,110 మిలియన్ లీటర్లు కాగా, ట్యాంకు దెబ్బతినడంతో సగం కూడా నింపే పరిస్థితి లేదు.
దెబ్బతిన్న కాంక్రీట్
చెరువు గట్టుకు వేసిన కాంక్రీట్ దెబ్బతింది. నల్లరేగడి కావడతో చెరువు గట్టును బలోపేతం చేయడానికి శాశ్వత మరమ్మతులు చేయాలని గతంలోనే నిపుణులు సూచించారు. ఇందుకు సుమారు రూ.34కోట్లు అవసరం. గతంలో వైసీపీ ప్రభుత్వం అరకొర నిధులతో మరమ్ముతులు చేసి వదిలేశారు. అయితే అప్పుడు చేసిన పనులు దెబ్బతిన్నాయి.
శాశ్వత మరమ్మతులే పరిష్కారం
గత వైసీపీ ప్రభుత్వం చెరువుకు శాశ్వత మరమ్మతులు చేయకుండా, తాత్కాలిక పనులు చేసింది. దీంతో పరిస్థితి మల్లీ మొదటికి వచ్చింది. చెరువు చుట్టూ మూడున్నర కిలోమీటర్ల మేర ఉన్న గట్టుకు సీసీ లైనింగ్ కన్నా రాతి పరుపు (స్టోన్ పిచ్చింగ్) వేస్తే తప్ప క్షేమం కాదని నిపుణులు సూచించారు. కూటమి ప్రభుత్వం అయినా చెరువుకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
వేసవిలో పొంచి ఉన్న ముప్పు
వేసవిలోపు బసాపురం చెరువు గట్టుకు మరమ్మతులు చేయకుంటే ప్రజలకు తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. గట్టుకు వేసిన సిమెంట్ కాంక్రీట్ చాలా భాగం దెబ్బతినడంతో చెరువులో పూర్తి సామర్థ్యంతో నీటిని నింపుకోవడం సాధ్యం కావడం లేదు. కూత వేటు దూరంలో ఎల్‌ఎల్సీ ఉన్నా, చెరువును పూర్తిగా నింపితే, గట్టు తెగిపోతుందన్న భయం అధికారుల్లో ఉంది.
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం
చెరువు శాశ్వత మరమ్మతులకు రూ.34 కోట్లతో ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. అమృత్, జల్ జీవన్ పథకాల్లో నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి పంపిస్తున్నాం. నిధులు మంజూరు అయితే పనులను ప్రారంభించి పూర్తి చేస్తాం. కృష్ణ, కమిషనర్, ఆదోని మున్సిపాలిటీ