కన్నేశారు!
ABN , Publish Date - Dec 16 , 2024 | 01:00 AM
అంతా మా ఇష్టం... మమ్మల్ని అడిగే వారెవరు... ఏదైనా వస్తే మేము చూసుకుంటాం... అంటూ నాయకులు భరోసా ఇస్తుండడంతో రెవెన్యూ అధికారులు వారికి వత్తాసు పలుకుతూ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాలువలను పూడ్చి లే-అవుట్లకు రహదారులు
చోద్యం చూస్తున్న ఇరిగేషన్, రెవెన్యూ, రుడా అధికారులు
రాజమహేంద్రవరం రూరల్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అంతా మా ఇష్టం... మమ్మల్ని అడిగే వారెవరు... ఏదైనా వస్తే మేము చూసుకుంటాం... అంటూ నాయకులు భరోసా ఇస్తుండడంతో రెవెన్యూ అధికారులు వారికి వత్తాసు పలుకుతూ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అడంగళ్లలో పేరు మార్పులు, ప్రభుత్వ భూములు ఇతరులకు బదలాయింపు, చివరికి అసైన్డ భూములను అమ్ముకునేందుకు, ఆపై భూములను ఫిల్లింగ్ చేసి లే-అవుట్లుగా మార్చేందుకు కూడా రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సాధారణంగా బీసీ, ఎస్టీ, ఎస్టీల స్థితిగతులను బట్టి వారిలో కొందరికి ప్రభుత్వం భూములను, మరికొందరికి స్థలాలను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అయితే ఆ భూమిపైౖ ఫలసాయం మాత్రమే అనుభవించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమిని అమ్మడం కానీ, లే-అవుట్లు వేయడం కానీ చేయకూడదు. ఇక్కడ అలాంటిదేమీలేదు...
రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వున్న గ్రామంలోనే అసైన్డ భూమిలో వున్న కొబ్బరి చెట్లను నరికి ఆగమేఘాలపై ఎర్ర మట్టితో ఫిల్లింగ్ చేసి లే-అవుట్ వేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ధవళేశ్వరం రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.47/1ఎ1లో 0.4150 ఎకరాలు వీర్రాజు పేరున, సర్వే నెం.47/1ఎ2లో 0.4150 ఎకరాలు సత్యనారాయణ పేరున వున్నాయి. అయితే అవి వీరికి గతం లో ఎలా సంక్రమించాయో తెలియదు. అడంగల్‌లో సదరు భూముల పేరున శిస్తుకట్టిన గయాల్, అసైన్డ ల్యాండ్ డి- పట్టాగా అడంగల్‌లో నమోదైంది. సర్వే నెం.18లో సుమారు 23 సెంట్ల కాలిబాటను కూడా సదరు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. ఈ భూమిని రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఒక నేతకు అమ్మినట్టు, అడ్వాన్సగా సుమారు రూ.50లక్షల వరకు చేతులు మారినట్టు సమాచారం.
ఇరిగేషన్ భూమికి సంబంధించి అదే గ్రామంలో సర్వే నెం.216, 211ల్లో పంట కాలువను మూసివేసి లే-అవుట్ మార్గంగా చూపించి ‘రుడా’ నుంచి అనుమతులు తెచ్చుకున్నట్టు తెలిసింది.
ధవళేశ్వరం పంచాయతీ పరిధిలో ఇరిగేషన్ స్థలాలైన సర్వే నెం.72/1ను ఆక్రమించుకుని వాటర్ సర్వీసింగ్ స్టేషన్లు. సర్వే నెం.75, 76, 47/1 ఆక్రమించుకుని నర్శింగ్ కాలేజీ, విద్యా సంస్థల హాస్టళ్లతో పాటు పలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
సర్వే నెం.144లో దేవదాయ శాఖ స్థలాలను ఆక్రమించుకుని ఏకంగా ఇళ్లే కట్టేసుకున్నారు. ఇందుకు పంచాయతీ అధికారులు ప్లాన్ అప్రూవల్స్ మంజూరు చేసినట్టు తెలిసింది.
అయితే ఫిల్లింగ్‌కు మట్టిని ఎక్కడి నుంచి తెచ్చారు. సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బందికి తెలియకుండానే ఇదంతా జరిగిందా అన్నదే ప్రశ్న. అఽధికారులు వారిపై ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి.
రైతులను పట్టాలు తీసుకురమ్మన్నాం...
అసైన్డ భూముల్లో లే-అవుట్లు వేసేందుకు ఎర్ర మట్టి ఫిల్లింగ్ చేసిన విషయమై రూరల్ తహసీల్దారు కుమార్‌ను వివరణ కోరగా.... ఈ అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. స్థలాన్ని పరిశీలించి పట్టాలు తీసుకురమ్మని సంబంధిత రైతులకు కబురు చేశామని తెలిపారు.