ఆ నియోజకవర్గానికి 8 మంది ‘ఎమ్మెల్యేలు’!
ABN, Publish Date - Nov 23 , 2024 | 04:38 AM
సాధారణంగా ఎన్నికల్లో ఎందరు పోటీ చేసినా ఓ నియోజకవర్గానికి ఒక్కరే ఎమ్మెల్యే ఉంటారు.
రైల్వేకోడూరులో అరాచకీయం
అధికారికంగా అరవ శ్రీధర్ ఎన్నిక
అనధికారికంగా మరో ఏడుగురి పెత్తనం
ముక్కా రూపానందరెడ్డి కుటుంబం ఆయన బామ్మర్దులదే రాజ్యం
ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు
రికార్డుల పరిశీలన.. అధికారులకు ఆదేశాలు
నియోజకవర్గంలో పనులు జరగాలన్నా..
బిల్లులు చేయాలన్నా అనుమతి ఉండాల్సిందే
(రాయచోటి-ఆంధ్రజ్యోతి)
సాధారణంగా ఎన్నికల్లో ఎందరు పోటీ చేసినా ఓ నియోజకవర్గానికి ఒక్కరే ఎమ్మెల్యే ఉంటారు. అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గంలో మాత్రం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే ఒకరు అయితే... అనధికారికంగా మరో ఏడుగురు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఏడుగురు ఒకే కుటుంబానికి చెందినవారు, దగ్గరి బంధువులే. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహంలా ఉంటే... అధికారిక హోదా లేనివారు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటూ, రికార్డులను పరిశీలిస్తూ, అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తున్నారు. ఓట్లు వేసి ఒకరిని గెలిపిస్తే.. ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారని, ఆ కుటుంబం పెత్తనం ఏంటని ఆ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన రైల్వేకోడూరుకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ముక్కా రూపానందరెడ్డి ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో తన సొంత మనిషి అయిన అరవ శ్రీధర్‌కు జనసేన తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నారు. కూటమి ప్రభంజనంతో పాటు నియోజకవర్గ నాయకులు కలసికట్టుగా కృషి చేయడంతో అరవ శ్రీధర్ గెలుపొందారు. ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. పేరుకే ఎమ్మెల్యే కానీ... స్వతంత్రంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని కూటమి నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. నియోజకవర్గంలో పెత్తనమంతా రూపానందరెడ్డి కుటుంబానిదేనని వాపోతున్నారు.
పెత్తనమంతా ఆ కుటుంబానిదే
రూపానందరెడ్డికి ఇటీవలే అన్నమయ్య పట్టణాభివృద్ధి సంస్థ చైౖర్మన్‌గా నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఆయన ప్రభుత్వ కార్యాలయాలు తనిఖీ చేస్తుంటారు. రికార్డులు కూడా పరిశీలిస్తారు. అదేవిధంగా ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు బావమరుదులు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు కూడా చేస్తున్నారు. ఇక రూపానందరెడ్డి భార్య ముక్కా వరలక్ష్మి ఆర్టీసీ బస్టాండు, ఆసుపత్రులు వంటి వాటిని తనిఖీ చేస్తుంటారు. ‘నా మనిషికి టికెట్ తెచ్చుకున్నాను. కోట్లు ఖర్చు చేసి గెలిపించుకున్నాను. పెత్తనం నాకు, నా కుటుంబానికే ఉండాలి’ అన్నట్టుగా ముక్కా కుటుంబం వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల వరకు నియోజకవర్గంలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేశారు. ఎన్నికలు అయిపోగానే కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను పక్కకు పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గంలో జనసేనలో రెండు వర్గాలుగా, టీడీపీలోనూ గ్రూపులుగా విడిపోయారు. బీజేపీ శ్రేణులు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి.
పనులు, పంచాయితీలు...
నియోజకవర్గంలో ఇసుక, భూములు, ఇతర పంచాయితీలు.. అన్నీ రూపానందరెడ్డి కుటుంబమే చేస్తోందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. రోడ్లు, తాగునీటి బోర్లు కూడా ఆ కుటుంబ సభ్యులే వేస్తున్నారని కూటమిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని పంచాయతీలలో ఎంత చిన్న అభివృద్ధి పని జరగాలన్నా.. నిధులు మంజూరు చేయాలన్నా.. ఈ కుటుంబం అనుమతిని అధికారులు తీసుకోవాల్సిందే. చివరకు బిల్లులు చేయాలన్నా వీళ్ల అనుమతి తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు.
ఆ ఎనిమిది మంది వీరే..!
రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి గెలిపించిన అరవ శ్రీధర్ అధికారికంగా ఎమ్మెల్యే. అయితే ముక్కా రూపానందరె డ్డి, ఆయన భార్య వరలక్ష్మి, కొడుకులు విశాల్‌రెడ్డి, సాయివికాస్‌రెడ్డితో పాటు రూపానందరెడ్డి బావమరుదులు మల్లికార్జునరెడ్డి, విశ్వనాథరెడ్డి, మహేంద్రరెడ్డి... ఈ ఏడుగురు అనధికారిక ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారనే ఆరోపణలున్నాయి.
ఉత్సవ విగ్రహంలా ఎమ్మెల్యే!
నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు ఎలాంటి ప్రాధాన్యం ఉండడం లేదని.. ఏదైనా అధికారిక కార్యక్రమం అయితే సభావేదిక మీద ఉండడం.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం వరకే ఆయన బాధ్యతగా చెబుతున్నారు. మిగిలిన అన్ని పనులూ రూపానందరెడ్డి కుటుంబమే చక్కబెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సమావేశాల్లో ఎమ్మెల్యేను కనీసం ముందు వరుసలో కూడా కూర్చోబెట్టకుండా వాళ్లే రికార్డులు పరిశీలిస్తారనే ప్రచారం ఉంది. ఎమ్మెల్యే లెటర్ హెడ్‌పై ముందుగానే సంతకాలు చేయించుకుని పనుల కోసం ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు సమాచారం. చివరికి తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు కూడా ఎమ్మెల్యే ఎవరికీ ఇచ్చుకోలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు.
Updated Date - Nov 23 , 2024 | 04:38 AM