లోకాయుక్త స్ఫూర్తిని కొనసాగిస్తాం
ABN, Publish Date - Nov 23 , 2024 | 04:55 AM
ప్రతిపక్ష నేత లేకపోయినా లోకాయుక్త స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు.
మండలిలో సవరణ బిల్లును ప్రవేశపెట్టిన లోకేశ్
అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష నేత లేకపోయినా లోకాయుక్త స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. శుక్రవారం మండలిలో లోకాయుక్త సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాసనసభలో ప్రతిపక్షనేత లేని నేపథ్యంలో లోకాయుక్త మెంబర్స్ సెలెక్షన్ కమిటీ గురించి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లు ప్రవేశపెట్టామన్నారు. గతంలో ముఖ్యమంత్రి చైర్మన్‌గా, స్పీకర్, హోంమంత్రి లేదా ఏదైనా శాఖ మంత్రి, ప్రతిపక్షనేత, కౌన్సిల్ చైర్మన్ సభ్యులుగా ఉండేవారని, ప్రస్తుతం ప్రతిపక్షనేత లేకపోవడంతో మిగిలిన నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ ఉంటుందన్నారు. చైర్మన్ నియామకానికి సంబంధించి ఈ బిల్లు ప్రవేశపెట్టామన్నారు. పీడీఎఫ్ సభ్యుడు కేఎస్ లక్ష్మణరావు మాట్లాడాతూ ప్రతిపక్షనేత లేని కారణంగా ఆయనను మినహాయిస్తూ లోకాయుక్త కమిటీలోకి ప్రతిపక్ష సభ్యుడిని తీసుకోవాలని సూచించారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ సవరణ బిల్లులో ప్రతిపక్షనేత లేని సమయంలో అని మాత్రమే ఉందన్నారు. తాము తీసేయలేదన్నారు.
మంత్రి సవిత వ్యాఖ్యలపై గందరగోళం
రాష్ట్రంలో వెనుకబడిన బలహీన వర్గాల సంక్షేమంపై చర్చ సందర్భంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో గందరగోళం తలెత్తింది. గత ప్రభుత్వంలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు. గత సీఎం జగన్ కాపు ద్రోహిగా, బ్రాహ్మణ ద్రోహిగా మిగిలారన్నారు. గతప్రభుత్వంలో స్వయం ఉపాధి లేక కొంతమంది యువకులు గంజాయి, మందుకు అలవాటుపడ్డారన్నారు. దీనిపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మంత్రి మహిళలను అవమానించారని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, మహిళలకు క్షమాపణ చెప్పాలని, మంత్రి డౌన్ డౌన్ అంటూ చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీనికి ప్రతిగా టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు బీసీ మంత్రిని అవమానిస్తున్నారని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. తిరిగి సభను 11.48 గంటకు ప్రారంభించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మంత్రి సమాధానం చెప్పకుండా డీ బీటీలు అని, గంజాయి అని మాట్లాడడం సరికాదని, ఆ మాటలను రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు. మంత్రి సవిత మాట్లాడుతూ తన మాటలు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మంత్రి మాటల్లో అన్‌పార్లమెంటరీ పదాలు ఉంటే రికార్డుల నుంచి తొలగించాలని చైర్మన్ ఆదేశించారు.
2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం: నిమ్మల
2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానంగా చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని 159 పాఠశాలల్లో 1,659 మంది అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు. ఎస్సీ, బీసీ గురుకులాల్లోని అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు వేతనాలు పెంచే ప్రతిపాదనలు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి చెప్పారు. రాయలసీమ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడుతున్నామన్నారు.
భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి పేరు
విజయనగరంజిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని శుక్రవారం శాసనమండలి తీర్మానం చేసింది.
పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వలేదని వైసీపీ వాకౌట్
మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం సంప్రదాయం వస్తున్నదని చెప్పారు. ఆ సంప్రదాయాన్ని పాటించనందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ పీఏసీ ఎన్నికల పోలింగ్ జరిగిందని, మీ నాయకుడు ఓటు వేయడానికే రాలేదని, వెళ్లి మీ నాయకుడ్నే అడగాలన్నారు.
21 బిల్లులకు ఆమోదం: శాసనమండలి సమావేశాలు 9 రోజులు జరిగాయని, 30 గంటల 30 నిమిషాలపాటు సభ జరిగిందని చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు తెలిపారు. 21 బిల్లులకు సభ ఆమోదం తెలిపిందన్నారు. శాసనమండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
Updated Date - Nov 23 , 2024 | 04:55 AM