ఆరోగ్య పరిరక్షణలో దంత వైద్యం కీలకం
ABN, Publish Date - Nov 23 , 2024 | 04:36 AM
ఆరోగ్య పరిరక్షణలో దంత వైద్యం (ప్రోస్తోడాంటిక్) చాలా కీలకమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
ఐపీఎస్ సదస్సులో మంత్రి సత్యకుమార్ యాదవ్
మంగళగిరి సిటీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య పరిరక్షణలో దంత వైద్యం (ప్రోస్తోడాంటిక్) చాలా కీలకమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇండియన్ ప్రోస్తోడాంటిక్ సొసైటీ (ఐపీఎస్) ఆధ్వర్యంలో 52వ జాతీయ స్థాయి సదస్సు గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ఐపీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మహేశ్ లహోరి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. గత 52 ఏళ్ల క్రితం ఒకరిద్దరితో ప్రారంభమైన సొసైటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా 15 వేల మంది సభ్యులతో ఉన్నత స్థాయికి చేరి.. దంత వైద్య రంగంలో విశేష సేవలందించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సదస్సుల ద్వారా దంత వైద్యంలో నూతన ఆవిష్కరణలు, అధునాతన సాంకేతిక పరికరాల గురించి చర్చించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రాణాంతక వ్యాధులకు సైతం ఖరీదైన వైద్యం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఐపీఎస్ జాతీయ కార్యదర్శి డాక్టర్ జంగాల హరి మాట్లాడుతూ ఈ సదస్సులో అత్యాధునిక దంత వైద్య పరికరాలకు సంబంధించి 72 ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. సుమారు 700 మంది వివిధ అంశాలపై ప్రశ్నపత్రాలను సమర్పిస్తారని, 40 మంది సీనియర్ వైద్యులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారని తెలిపారు.
Updated Date - Nov 23 , 2024 | 04:36 AM