‘ఎన్‌డీబీ’ రోడ్ల పనులు మొదలు
ABN, Publish Date - Nov 23 , 2024 | 04:40 AM
న్యూ డెవల్‌పమెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) నిధులతో రాష్ట్రంలో చేపట్టిన రహదారుల నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.
పర్యవేక్షించిన ఆర్‌అండ్‌బీ మంత్రి జనార్దన్ రెడ్డి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
న్యూ డెవల్‌పమెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) నిధులతో రాష్ట్రంలో చేపట్టిన రహదారుల నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. మంత్రి లోకేశ్ నేతృత్వం వహిస్తోన్న మంగళగిరిలో ఎన్‌డీబీ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గుంటూరు జిల్లాలో రూ.120 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే రూ.51.06 కోట్ల పనులు మొదలయ్యాయి. ఎన్‌డీబీ పనులపై ప్రతి పక్షం రోజులకోసారి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వంలో సాగని పనులు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రానికి ఎన్‌డీబీ ప్రాజెక్టు మంజూరైంది. రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణం కోసం 6,400 కోట్లను సింగపూర్ కు చెందిన న్యూ డెవల్‌పమెంట్ బ్యాంక్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయితే ఆతర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు ముందుకు సాగలేదు. కాంట్రాక్టర్ల డిమాండ్లు, సమస్యలను జగన్ సర్కారు పట్టించుకోలేదు. దీంతో పనులు ఆగిపోయాయి. పైగా, ఎన్‌డీబీ ఇచ్చిన రూ.500 కోట్లను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించింది. దీంతో ఈ ప్రాజెక్టును ఎన్‌డీబీ నిలిపివేసింది. కూటమి సర్కారు వచ్చాక ఎన్‌డీబీతో సంప్రదింపులు జరిపి, ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించింది. కాంట్రాక్టర్లు కోరిన మేరకు సీనరేజీ మినహాయింపు, ఇసుక, గ్రావెల్ సరఫరాకు ప్రభుత్వం అంగీకరించింది. మంత్రి చొరవతో తొలి విడత నిధులు రూ.250 కోట్లు విడుదలయ్యాయి. దీంతో శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌డీబీ రోడ్ల పనులు ప్రారంభమయ్యాయి.
Updated Date - Nov 23 , 2024 | 04:41 AM