ఇష్టారాజ్యంగా పంచేశారు!
ABN, Publish Date - Nov 23 , 2024 | 01:20 AM
ఐదేళ్లపాటు యథేచ్ఛగా పంచేశారు. గత వైసీపీ పాలనలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) కార్యకలాపాలు అడ్డగోలుగా సాగాయి. బ్యాంకు పాలకవర్గం, అధికారులు కుమ్మక్కై నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
డీసీసీబీలో ఐదేళ్లు అడ్డగోలుగా కార్యకలాపాలు
అధికారులు, పాలకవర్గం మిలాఖత్
ప్రభుత్వ మార్గదర్శకాలకు తిలోదకాలు
అన్ని విభాగాల్లోనూ అక్రమాలే
భారీగా నిధుల దుర్వినియోగం
విచారణలో గుర్తించిన త్రిసభ్య కమిటీ
కలెక్టర్‌కు చేరిన నివేదిక
నేడో, రేపో ప్రభుత్వానికి పంపనున్న అన్సారియా
ఐదేళ్లపాటు యథేచ్ఛగా పంచేశారు. గత వైసీపీ పాలనలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) కార్యకలాపాలు అడ్డగోలుగా సాగాయి. బ్యాంకు పాలకవర్గం, అధికారులు కుమ్మక్కై నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఉద్యోగుల ప్రమోషన్లు, వారిపై వచ్చే ఆరోపణలపై విచారణ, వాటిపై చర్యలు, బ్యాంకు అభివృద్ధి పనులు, ఆధునికీకరణ, సీసీ కెమెరాల కొనుగోలు, రుణాల మంజూరు ఇలా ఏ అంశంలో చూసినా ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. ఏవిషయంలోనూ హేతుబద్ధంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. పైగా కోర్టు తీర్పులను సైతం తాము అనుకున్న దానికి అనుగుణంగా ఉండేలా వక్రభాష్యం చెబుతూ వ్యక్తులకు ఆయాచిత లబ్ధి చేకూరేలా వ్యవహరించారు. ఎట్టకేలకు ఆ పాపాలు బయటపడుతున్నాయి.
ఒంగోలు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పీడీసీసీ బ్యాంకులో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పాలకవర్గం నుంచి అధికారుల వరకు ఎవరికివారు అంతా పందేరం చేశారు. అలాగే పంచుకొని తినేశారు. కోట్లాది రూపాయల బ్యాంకు ధనం దుర్వినియోగం కాగా.. బాధ్యులైన అధికారులు, ఉద్యోగులు దర్జాగా బ్యాంకులో కొనసాగు తున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల బ్యాంకుపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు కలెక్టర్ తమీమ్ అన్సా రియా డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృ త్వంలో నియమించిన త్రిసభ్య కమిటీ దాదా పు పక్షం రోజులపాటు సమగ్రంగా విచారణ నిర్వహించింది. అటు ప్రభుత్వానికి, ఇటు కలెక్టర్‌కు అందిన మొత్తం 62 ఫిర్యాదులను ఏడెనిమిది విభాగాలుగా చేసి పరిశీలింది. విచారణ నివేదికను గురువారం రాత్రి కలెక్టర్ అన్సారియాకు అందజేసింది.
పీఐసీలతో కలిసి తప్పిదాలు
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో డీసీసీబీ పాలక మండలికి ఎన్నికలు నిర్వహించ లేదు. ఆ పార్టీకి చెందిన నాయకులతో త్రిసభ్య కమిటీలను (పర్సన్ ఇన్‌చార్జి కమిటీలను) నియమించారు. ఆ పాలకవర్గాలతో బ్యాంకులో పనిచేసే వివిధ స్థాయి అధికారులు, ఉద్యోగులు మిలాఖత్ అయి అడ్డగోలుగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జేసీ నేతృత్వంలో అధికారిక పీఐసీ నియామకం జరిగినా ఆ తప్పిదాలపై పెద్దగా దృష్టిసారించ లేదు. ఈక్రమంలో బ్యాంకులో అక్రమాలపై పలువురు నేరుగా ప్రభుత్వానికి, స్థానికంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. వాటిపై విచారణ కోరుతూ ఎమ్మెల్యే జనార్దన్ సహకారశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు లిఖితపూర్వకంగా లేఖ రాశారు. దీనిపై మంత్రి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆ సమయంలో బ్యాంకు సీఈవోగా ఉన్న కోటిరెడ్డి అక్కడే ఉంటే రికార్డులు తారుమారయ్యే అవకాశం ఉంటుంది కనుక ఆయన్ను అక్కడి నుంచి తొలగించడంతో పాటు సమగ్ర విచారణ కోసం సెక్షన్ 51 విచారణ చేయించాలని ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ రాశారు.
ఆంధ్రజ్యోతి కథనంతో కదలిక
ప్రభుత్వానికి కలెక్టర్ గతనెల 21న లేఖ రాయగా నెలాఖరు వరకు చర్యలు కరువయ్యాయి. ఈ విషయాలను బహిర్గతం చేస్తూ ఈనెల 2న ఆంధ్రజ్యోతిలో ‘అక్కడంతే’ శీర్షికను ప్రచురించిన కథనం ఇటు జిల్లా, అటు రాష్ట్రంలో కలకలం సృష్టించింది. మరోవైపు సీఎం దృష్టికి కూడా వ్యవహారం వెళ్లడంతో సీఎంవో అధికారులు సైతం దృష్టి సారించారు. ఆ వెంటనే.. ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు సహకారశాఖ రిజిస్ట్రార్ సూచించారు. దీంతో విచారణకు డిప్యూటీ కలె క్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలో జిల్లా ఆడిట్ అఽధికారి, ఎల్‌డీఎంలతో కూడిన త్రిసభ్య కమిటీని కలెక్టర్ నియమించారు. మరోవైపు ఆలస్యంగా మేల్కొన్న బ్యాంకు పీఐసీ చైర్మన్ అయిన జేసీ గోపాలకృష్ణ ఈనెల 4న పాలక వర్గ సమావేశం నిర్వహించారు. బ్యాంకు సీఈవో కోటిరెడ్డితో రాజీనామా చేయించారు. ఆప్కాబ్ నుంచి మరొక అధికారిని తాత్కా లిక సీఈవోగా నియమించారు.
సహకరించని బ్యాంకు అధికారులు
కలెక్టర్ ఆదేశాలతో డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈనెల 6 నుంచి విచారణ చేపట్టింది. తొలుత రెండు రోజుల్లో పూర్తిచేయాలని భావించినా నిరంతరం అదనంగా కలెక్టర్‌కు ఫిర్యాదులు వస్తుండటం, ఆరంభంలో బ్యాంకు సిబ్బంది తగు స్థాయిలో సంబంధిత పైళ్లు ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఆయా అంశాలపై లోతుగా పరిశీలన చేయాల్సి రావడం వంటి కారణాలతో విచారణ దాదాపు పక్షంరోజులు సాగింది. తమకు ఇచ్చిన ఫిర్యాదుల జాబితాలో మొత్తం 62 అంశాలపై వారు దృష్టిసారించారు. అందులో ఉద్యోగుల వ్యక్తిగత అంశాలు, విచారణలు, బ్యాంకు ఆధునికీకరణ పనులు, రుణాల మంజూరు, వివిధ రకాల కొనుగోళ్లకు సంబంధించినవి ఉన్నాయి. వాటిని విజిలెన్స్, హెచ్‌ఆర్‌డీ ఎస్టాబ్లిష్‌మెంట్, ప్లానింగ్, ఐటీ ఇలా ఏడెనిమిది విభాగాలుగా విభజించుకొని ఆ ఫైళ్లను.. అలాగే బోర్డు సమావేశాల మినిట్స్‌ను ఈ బృందం పరిశీలించింది. వారికి అందిన ఫిర్యాదులలో ఏ ఒక్కటి కూడా నిరాధారంగా లేవన్న విషయాన్ని వారు తమ పరిశీలనలో గుర్తించారు. మొత్తంగా బ్యాంకులో ఇష్టారాజ్యంగా కార్యకలాపాలు సాగినట్లు తేటతెల్లమైంది.
వెలుగులోకి అన్ని విషయాలు
ప్రధానంగా ఒంగోలులోని బ్యాంకు సెంట్రల్ ఆఫీసుతోపాటు టౌన్ బ్రాంచి, కర్నూలు రోడ్డు బ్రాంచి, చీమకుర్తి, అద్దంకి వంటి బ్రాంచిల్లో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు కమిటీ గుర్తించినట్లు సమాచారం. ఉద్యోగుల ప్రమోషన్లు, వారిపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు, శాఖలలో బంగారం పరిశీలన కోసం మేనేజర్లు, చీఫ్ మేనేజర్లను పంపడంలో నిబంధనలు పాటించకపోవడమేకాక విచారణల విధానం, వాటిపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు, పాలకవర్గం దారుణంగా వ్యవహరించిందన్న విషయం బయటపడినట్లు తెలిసింది. డిస్మిస్ అయిన ఉద్యోగులను తిరిగి నియమించడం, వారికి పెండింగ్ జీతాల పేరుతో చెల్లింపు ప్రక్రియ, అలాగే కోర్టు కేసుల విషయంలో ఉన్న బ్యాంకు స్టాడింగ్ కౌన్సిల్‌ను పక్కనపెట్టి మరో న్యాయవాదితో చేయించడం, వారికి రూ.21 లక్షల చ్లెలింపులు వెలుగుచూశాయి. అలాగే ఒక ఉద్యోగిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసిన మరో ఉద్యోగిపైనా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరూ కుమ్మక్కై అక్రమాలను నిగ్గుతేల్చకుండా చేసినట్లు గుర్తించారు.
పాల వెల్లువ రుణాలలో భారీ అక్రమాలు
బ్యాంకు సెంట్రల్ ఆఫీసుతో సహా వివిధ శాఖల్లో మరమ్మతులు, ఆధునికీకరణ పనులు, సీసీ కెమెరాలు, ఇతర వాహనాలు, వస్తువుల కొనుగోళ్లకు టెండర్లు పిలవలేదు. కనీసం కొటేషన్లు కూడా లేవు. చేసిన పనుల బిల్లులకు, చెల్లింపులకు భారీ వ్యత్యాసం ఉంది. దీంతో రూ.కోట్లలో బ్యాంకు ధనం దుర్వినియోగమైందని విచారణ కమిటీ గుర్తించింది. జగనన్న పాలవెల్లువ రుణాల మంజూరులో భారీగా అక్రమాలు జరిగాయి. నిబంధనల ప్రకారం అమూల్ సంస్థ తమకు పాలు పోస్తున్నట్లు నిర్ధారించిన వారికి రుణాలు ఇవ్వాల్సి ఉండగా బ్యాంకు అధికారులు అవేమీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అమూల్‌కు పాలు పోయని వారికి, అసలు గేదెలే లేని వారికి భారీగా రుణాలు ఇచ్చినట్లు గుర్తించారు. ఉదాహరణగా త్రిసభ్య కమిటీ పరిశీలించిన అద్దంకి బ్రాంచిలో భారీ స్కాం జరిగినట్లు గుర్తించారు. అలాగే జగనన్న తోడు, ట్రాక్టర్ల రుణాలు, ఇతర రుణాల మంజూరులోనూ ఇలాగే భారీగా అవకతవకలు జరిగాయన్న భావనకు వారు వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై సుమారు 50 పేజీల నివేదికను వారు గురువారం రాత్రి కలెక్టర్‌కు అందజేశారు. దాన్ని పరిశీలించి ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి ఆమె నివేదించనున్నట్లు సమాచారం.
Updated Date - Nov 23 , 2024 | 01:20 AM