Share News

ఎట్టకేలకు పోస్టింగ్‌లు

ABN , Publish Date - Nov 23 , 2024 | 01:12 AM

జిల్లా పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న గ్రేడ్‌-5, 6 (సచివాలయ) ఉద్యోగులకు పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చారు. ఇటీవల జరిగిన ఉద్యోగుల బదిలీల్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి.

ఎట్టకేలకు పోస్టింగ్‌లు

గాలిలో ఉన్న సచివాలయ ఉద్యోగులకు ఊరట

మండలాలకు ఆర్డర్లు

మొత్తం 102 స్థానాలు భర్తీ

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న గ్రేడ్‌-5, 6 (సచివాలయ) ఉద్యోగులకు పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చారు. ఇటీవల జరిగిన ఉద్యోగుల బదిలీల్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా 50 మంది గ్రేడ్‌-5 ఉద్యోగులను గ్రేడ్‌-4కు పోస్టింగ్‌లు ఇవ్వగా, మరో 52మంది గాలిలో ఉన్నారు. గాలిలో ఉన్న ఉద్యోగులు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో వారందరికీ న్యాయం చేయాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. కమిషనర్‌ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వడంతో తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం 102 మందికి కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకట నాయుడు పోస్టింగ్‌ ఆర్డర్లను ఇచ్చారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి ఆయా వివరాలను కలెక్టర్‌ దృష్టికి డీపీవో తీసుకెళ్లారు. కలెక్టర్‌ సూచనలకు అనుగుణంగా ఆయా ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వడంతోపాటు ఆర్డర్ల కోసం ఎవరూ కలెక్టరేట్‌లోని జిల్లా పంచాయతీ కార్యాలయానికి రాకుండా వాటిని మెయిల్‌ ద్వారా ఆయా మండలాలకు పంపారు. దీంతో ఆ ఉద్యోగులందరూ ఆయా ఆర్డర్ల ప్రకారం ఉద్యోగాల్లో చేరనున్నారు.

Updated Date - Nov 23 , 2024 | 01:12 AM