నీటి సంఘాల ఎన్నికలకు 5న నోటిఫికేషన్
ABN , Publish Date - Nov 23 , 2024 | 01:14 AM
సాగునీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనెల 5న విడుదల కానుంది. అనంతరం మూడు రోజులకు తొలుత డబ్ల్యూయూఏలకు, తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలను నిర్వహిస్తారు. ఆ మేరకు సవరించిన షెడ్యూల్‌పై జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది.
8న డబ్ల్యూయూఏలు, 11న డీసీలకు నిర్వహణ
సవరించిన షెడ్యూల్ విడుదల
ఏర్పాట్లలో అధికారులు
ఒంగోలు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): సాగునీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనెల 5న విడుదల కానుంది. అనంతరం మూడు రోజులకు తొలుత డబ్ల్యూయూఏలకు, తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలను నిర్వహిస్తారు. ఆ మేరకు సవరించిన షెడ్యూల్‌పై జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. ఈనెల 20న నోటిఫికేషన్ ఇచ్చేలా గతంలో షెడ్యూల్ ప్రకటించారు. అందుకు వీలుగా జిల్లాలో 342 డబ్ల్యూయూఏలు, 10 డీసీల ఓటర్ల జాబితాలు, ప్రాదేశిక నియోజకవర్గాల (టీసీ) గుర్తింపు, ఎన్నికల అధికారుల నియామకం, వారికి శిక్షణ వంటి అంశాలను అటు రెవెన్యూ, ఇటు ఇరిగేషన్ అధికారులు పూర్తిచేశారు. అయితే నోటిఫికేషన్ విడుదల చేసే రెండు రోజుల ముందు తాత్కాలికంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నీటి సంఘాల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలు కీలకం కాగా వారంతా అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నారు. దీంతో తాత్కాలికంగా నీటి సంఘాల ఎన్నికలను వాయిదా వేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రక్రియను నిలిపివేయాలని జిల్లా అధికారులకు అప్పట్లో సమాచారం ఇచ్చారు.
ఏర్పాట్లపై యంత్రాంగం దృష్టి
అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగియనుండటంతో నీటిసంఘాల ఎన్నికలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఆగిపోయిన ప్రక్రియ కొనసాగింపునకు సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 5న నీటిసంఘాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆయా డబ్ల్యూయూఏ స్థాయిలో నియమించిన ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ స్థానికంగా ఈ నోటిఫికేషన్ ఇస్తారు. 8వతేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ప్రాదేశిక (టీసీ) సంఘాల ఎన్నికలను మధ్యాహ్నం వరకు నిర్వహించి అనంతరం వారితో సమావేశం ఏర్పాటు చేసి డబ్ల్యూయూఏ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికల కూడా అదేరోజు సాయంత్రానికి పూర్తిచేస్తారు. ఇక డీసీల ఎన్నికలను 11వతేదీన, ప్రాజెక్టు కమిటీ ఎన్నికను ఈనెల 14న నిర్వహిస్తారు. జిల్లాలో చిన్న నీటివనరుల పరిధిలో 240, మధ్యతరహాలో 14, భారీ నీటిపారుదల (ఎన్‌ఎస్‌పీ) విభాగంలో 88 కలిపి 342 డబ్ల్యూయూఏలు ఉండగా ఎన్‌ఎస్‌పీ పరిఽధిలో 10 డిస్ట్రిబ్యూటరీలు, అలాగే మఽధ్యతరహాలోని కంభం చెరువు, మోపాడు రిజర్వాయర్, పీబీ ఆనకట్ట ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి.