ఒంటెత్తు పోకడలు.. ఆపై వేధింపులు
ABN, Publish Date - Nov 20 , 2024 | 01:19 AM
‘పార్టీలో సీనియర్ నాయకు లను పట్టించుకోవడం లేదు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని పోలీసుల ద్వారా వేధిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ఉన్న అధికారులను ఇంకా కొనసాగించడంలాంటి ఒంటెత్తు పోకడలకు పోయి పార్టీని మరింత నిర్వీర్యం చేస్తున్నారు..’ అంటూ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబుపై ఎర్రగొండపాలెం టీడీపీ నాయకులు మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాల యంలో ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర నాయకులను కలిసిన అసమ్మతి తెలుగు తమ్ముళ్లు
ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జిపై ఫిర్యాదు
మార్కాపురం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘పార్టీలో సీనియర్ నాయకు లను పట్టించుకోవడం లేదు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని పోలీసుల ద్వారా వేధిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ఉన్న అధికారులను ఇంకా కొనసాగించడంలాంటి ఒంటెత్తు పోకడలకు పోయి పార్టీని మరింత నిర్వీర్యం చేస్తున్నారు..’ అంటూ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబుపై ఎర్రగొండపాలెం టీడీపీ నాయకులు మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాల యంలో ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ కేంద్రం నుంచి టీడీపీ అసమ్మతి నాయకులు సుమారు 30 వాహనాల్లో మంగళగిరి తరలివెళ్లారు. అక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్, వర్ల రామయ్య, రాంబాబులను కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు వ్యవహరిస్తున్న తీరును వారికి వివరించారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు పనిచేసిన పంచాయతీరాజ్ డీఈ సుబ్బారెడ్డి, ఎర్రగొండపాలెం మేజర్ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్టిలను ఇంకా కొనసాగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పచ్చి వైసీపీ అభిమానులైన అధికారులను ఇంకా కొనసాగిస్తే ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా ప్రజల్లోకి వెళ్లవన్నారు. పార్టీ సీనియర్ నాయకులు చెప్పినా ఇన్‌చార్జి పెడచెవిన పెడుతున్నారని తెలిపారు. దశాబ్దాలపాటు పార్టీ జెండా మోసిన వారిని పక్కన బెడుతున్నారన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై పోలీసులతో అక్రమ కేసులు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర నాయకులను కలిసిన వారిలో మాజీ ఏఎంసీ చైర్మన్ చేకూరి ఆంజనేయులు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు షేక్ జిలానీ, వడ్లమూడి లింగయ్య, అన్ని గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు ఉన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 01:19 AM