ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గళం విప్పి.. సమస్యలు చెప్పి

ABN, Publish Date - Nov 23 , 2024 | 01:16 AM

ఈసారి అసెంబ్లీ సమావేశాలలో జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు గళం విప్పారు. తమ ప్రాంతాలకు సంబంధించిన అంశాలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొన్నింటిపై సానుకూల సమాధానాలు రాబట్టారు. అదేసమయంలో వెలిగొండతోపాటు ఇతర సాగునీటి వనరులకు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్‌లో నిధులు కేటాయింపుతో ఊరట లభించింది. కనిగిరి ప్రాంతంలో రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు ఒప్పందం ప్రభుత్వ స్థాయిలో కుదరడం మరింత ఉపకరించే విషయం.

క్రియాశీలకంగా మంత్రి డాక్టర్‌ స్వామి

వెలిగొండకు నిధుల ఊరట

కనిగిరి ప్రాంతంలో రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఒప్పందం

సభా కమిటీల్లో కందుల, ముత్తుములకు స్థానం

వైసీపీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులూ గైర్హాజరు

ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

ఒంగోలు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఈసారి అసెంబ్లీ సమావేశాలలో జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు గళం విప్పారు. తమ ప్రాంతాలకు సంబంధించిన అంశాలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొన్నింటిపై సానుకూల సమాధానాలు రాబట్టారు. అదేసమయంలో వెలిగొండతోపాటు ఇతర సాగునీటి వనరులకు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్‌లో నిధులు కేటాయింపుతో ఊరట లభించింది. కనిగిరి ప్రాంతంలో రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు ఒప్పందం ప్రభుత్వ స్థాయిలో కుదరడం మరింత ఉపకరించే విషయం. మరోవైపు తమ అధిష్ఠాన ఆదేశానుసారం జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విడత సమావేశాలకు గైర్హాజరయ్యారు. చివరిరోజు సమావేశాల సందర్భంగా జరిగిన శాసనసభా కమిటీల ఎన్నికలలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ఎం.అశోక్‌రెడ్డిలకు స్థానం లభించడం విశేషం. సాధారణంగా శాసనసభా సమావేశాలు అత్యంత కీలకం కాగా అందులో బడ్జెట్‌ సెషన్‌కు మరింత ప్రత్యేకత ఉంటుంది. గత వైసీపీ పాలనలో జిల్లా నుంచి ఇలాంటి చొరవ అధికారపక్షం నుంచి పెద్దగా కనిపించకపోగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు చొరవగా వ్యవహరించారు. జిల్లాలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో మంత్రి డాక్టర్‌ స్వామితో సహా ఆరుగురు టీడీపీ వారు ఉండగా ఇద్దరు వైసీపీకి చెందిన వారు ఉన్నారు. ఈ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించడంతో ఆ పార్టీకి చెందిన శివప్రసాద్రెడ్డి, చంద్రశేఖర్‌లు సభకు హాజరుకాలేదు. ఇక టీడీపీకి చెందిన మంత్రి స్వామితోపాటు మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు 11 రోజులపాటు సాగిన సమావేశాల్లో పాల్గొన్నారు. మంత్రి ప్రభుత్వం తరఫున ఇటు శాసనసభలో, అటు శాసనమండలిలోనూ తన శాఖాపరమైన అంశాలపై సమాధానాలు చెప్తూ, అవకాశం ఉన్నప్పుడల్లా వైసీపీ ప్రభుత్వంపైనా, ఆ పార్టీ ఎమ్మెల్సీలపైనా విరుచుకుపడుతూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇక జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శాసనసభలో అవకాశాన్ని అందిపుచ్చుకొని పలు స్థానిక, జిల్లా అభివృద్ధి అంశాలపై గళం విప్పారు.

పశ్చిమప్రాంత సమస్యలు సభ దృష్టికి..

కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయాల్సిన అవసరాన్ని తద్వారా జిల్లాకు మేలును, అదేసమయంలో గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను సభలో వివరించారు. అలాగే కనిగిరి నియోజకవర్గంలోని రోడ్లు, ప్రత్యేకించి ఓవీరోడ్డు నిర్మాణం పూర్తిచేయకపోవడం, చేసిన పనులలో నాణ్యతలోపం, కనిగిరిలో డయాలసిస్‌ సెంటర్‌ అభివృద్ధి, మోపాడు పాలేరు రిజర్వాయర్లను వెలిగొండకు అనుసంధానం చేయడం, నిమ్జ్‌లో పరిశ్రమల ఏర్పాటు, భారీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి కల్పన చేయాలని కోరారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గతంలో ఆ ప్రాంతంలో దేదీవ్యమానంగా వెలిగి నేడు కనుమరుగువుతున్న పలకల పరిశ్రమను రక్షించాలని, దానిపై జీఎస్‌టీ తగ్గింపుతోపాటు విద్య కిట్లలో చేర్చి ఆదుకోవాలని కోరారు. అలాగే వెనుకబడిన మార్కాపురం ప్రాంతం వారికి ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్ల జారీలో ఐదు ఎకరాల పరిమితిని 10ఎకరాలకు పెంచాలని కోరారు. గిద్దలూరు ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డి నీటి కోసం తల్లడిల్లుతున్న తమ ప్రాంతంలో జలజీవన్‌ మిషన్‌ పనులు పూర్తిచేసి ఇంటింటికి నీటి సరఫరా, గిద్దలూరు ప్రభుత్వాస్పత్రిని 100 పడకల స్థాయికి పెంపు, అలాగే కొమరోలు ఆస్పత్రిని 30 పడకలకు పెంచాల్సిన అవసరాన్ని సభావేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు


పోతురాజు కాలువ పనుల అక్రమాలను వెలికితీయాలి

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఒంగోలు నగరంలో పోతురాజు కాలువ ఆధునీకరణ పనులలో గత ప్రభుత్వ కాలంలో జరిగిన అక్రమాలు వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఆ కాలువ పనులు పూర్తిచేయాలని కోరారు. అలాగే ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌ జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చిన నేపథ్యంలో తక్షణం ఆ నిధులు విడుదల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా సాగునీటి రంగానికి వాస్తవికత ఆధారంగా నిధులు ఇవ్వడం ఊరట కలిగించింది. ఒంగోలు కేంద్రంగా ఉన్న ఇరిగేషన్‌ సీఈ పరిధిలో రూ.581 కోట్లు కేటాయింపు జరగ్గా అందులో వెలిగొండకు రూ.349 కోట్లు, గుండ్లకమ్మకు రూ.13 కోట్లు ఇవ్వడం సంతృప్తికరంతోపాటు పనులపై ప్రజల్లో నమ్మకం కలిగించింది. అదే సమయంలో జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును కలిసి జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఇరువురికి కమిటీలలో స్థానం

రాష్ట్రంలో బయోగ్యాస్‌ ఎనర్జీ రంగంలో భారీపెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో రిలియన్స్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. అందులో తొలి ప్రాధాన్యం కనిగిరి ప్రాంతానికి లభించింది. ఇది ఆ ప్రాంత అభివృద్ధికి, జిల్లాకు ఉపకరించే అంశం. ఈ విషయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కూడా ప్రత్యేక చొరవ చూపారు. ఇదిలా ఉండగా సభా సమావేశాలు ముగింపు రోజైన శుక్రవారం శాసనసభ పబ్లిక్‌ అకౌంట్‌, ఎస్టిమేట్స్‌, పబ్లిక్‌ అండర్‌ టెకింగ్‌ కమిటీల సభ్యుల ఎంపిక జరిగింది. ఒక్కో కమిటీలో 12 మంది సభ్యులు ఉండనుండగా జిల్లాకు చెందిన ఇరువురికి అవకాశం దక్కింది. కీలకమైన పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీలో గిద్దలూరు ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డికి, ఎస్టిమేట్స్‌ కమిటీలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి స్థానం లభించింది.

Updated Date - Nov 23 , 2024 | 01:16 AM