ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వీడని వాన....

ABN, Publish Date - Oct 20 , 2024 | 12:36 AM

వాయుగుండం ముప్పు తప్పినా జిల్లాను వర్షం వీడలేదు. శుక్ర, శనివారాల్లో చాలాచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అక్కడక్కడా భారీవర్షమే పడటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు భారీవర్షాలు తెరపి ఇచ్చి ఎండలు రావడంతో పంట నష్టాలు వెలుగుచూస్తుండగా మళ్లీ జల్లులు పడుతుండటంతో తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పొదిలి మండలం కొండాయపాలెం గ్రామంలో వర్షాలకు తడిసి మొలకలొచ్చిన సజ్జ కంకులను పరిశీలిస్తున్న మంత్రి స్వామి, కలెక్టర్‌ అన్సారియా, మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి తదితరులు

జనజీవనం అస్తవ్యస్తం

వెలుగుచూస్తున్న పంట నష్టాలు

దెబ్బతిన్న పైర్లను పరిశీలించిన మంత్రి

ఛిద్రంగా రోడ్లు, అధ్వానంగా పారిశుధ్యం

పొంచి ఉన్న సీజనల్‌ వ్యాధుల ముప్పు

ఒంగోలు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : వాయుగుండం ముప్పు తప్పినా జిల్లాను వర్షం వీడలేదు. శుక్ర, శనివారాల్లో చాలాచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అక్కడక్కడా భారీవర్షమే పడటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు భారీవర్షాలు తెరపి ఇచ్చి ఎండలు రావడంతో పంట నష్టాలు వెలుగుచూస్తుండగా మళ్లీ జల్లులు పడుతుండటంతో తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేసమయంలో జిల్లా అంతటా రోడ్లు ఛిద్రంగా మారాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా పారిశుధ్యం ఆధ్వానంగా మారగా సీజనల్‌ వ్యాధులు విజృంభించే పరిస్థితి కనిపిస్తోంది. కాగా జిల్లాలో ఈ వర్షాలకు దెబ్బతిన్న పంటలను శనివారం సాయంత్రం మంత్రి డాక్టర్‌ స్వామి పలుచోట్ల పరిశీలించారు.

సగటున 15.38 సెం.మీ నమోదు

జిల్లాలో ఈనెల 11 నుంచి తెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. తొలుత మూడు రోజులు సాధారణ వర్షాలు పడగా 14 నుంచి 17 వరకు వాయుగుండం ప్రభావంతో కురిశాయి. అలా ఆ వారంరోజుల్లో జిల్లాలో సగటున 15.38 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా సగం మండలాల్లో 20 నుంచి 34 సెం.మీ మేర కురిసింది. గురువారం ఉదయం వాయుగుండం తీరం దాటడంతో ముప్పు తప్పిందని అందరూ భావించారు. అయితే తిరిగి శుక్ర, శనివారాల్లో జిల్లావ్యాప్తంగా జల్లులు పడుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షమే పడింది. శనివారం ఉదయం 8 గంటలకు గడిచిన 24గంటల్లో జిల్లాలో సగటున 9.10 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జరుగుమల్లి మండలంలో 40.60 మి.మీ కురియగా కేకేమిట్లలో 35.60, సింగరాయకొండ, బేస్తవారపేట, గిద్దలూరు, మార్కాపురం, పొదిలి, టంగుటూరు, కంభం, కొమరోలు, పెద్దారవీడు, వెలిగండ్ల తదితర మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. అలాగే శనివారం పగటిపూట కూడా చాలాచోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటలలోపు గరిష్ఠంగా సింగరాయకొండలో 46.4 మి.మీ, కురవగా కొత్తపట్నం 28.0, ఒంగోలు 24.4, జరుగుమల్లి 24.0 మి.మీ నమోదైంది. సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో జల్లులు పడుతూనే ఉన్నాయి.

పారిశుధ్యం అధ్వానం

అయితే వాయుగుండం ముప్పు తప్పిందని భావించిన ప్రజానీకానికి తిరిగి కురుస్తున్న వర్షాలు ఇబ్బందికరంగా మారాయి. వారంరోజులు కురిసిన వర్షాలతో అంతా అస్తవ్యస్తం కాగా మళ్లీ జల్లులు పడుతుండటం మరింత ఇబ్బందికరంగా మారింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు భారీగా దెబ్బతినగా రాకపోకలకు ప్రజలు అవస్థలు పడుతుండగా పారిశుధ్య పరిస్థితి మరింత దిగజారింది. మురుగు తొలగింపు, చెత్త ఎత్తి వేసే పనులకు కూడా అధికారులు చేయలేకపోతుండగా వ్యాధులు ప్రబలే పరిస్థితి కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలతో ప్రజలు మరింత అవస్థలు పడుతున్నారు. ఒంగోలు నగరంలో శనివారం భారీవర్షం కురవడంతో నగరం మరోసారి జలమయం అయింది ప్రధాన రోడ్లు, కాలువలను తలపిస్తూ నీరు పారగా పలు శివారు కాలనీల్లో ఇళ్లలోకి సైతం నీరు చేరి జనం ఇక్కట్లు పడ్డారు. ఇతర పలు పట్టణాల్లోనూ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.

సజ్జ పంటను పరిశీలించిన మంత్రి

వారం రోజులపాటు కురిసిన వర్షాలు తెరపి ఇచ్చి కాస్తంత ఎండ రావడంతో వర్షాలు వల్ల దెబ్బతిన్న పంట నష్టాలు వెలుగుచూస్తున్నాయి. జిల్లాలో ఇటీవల వర్షాలకు 17 మండలాల్లోని 89 గ్రామాల్లో 3,231 మంది రైతులకు చెందిన 3,749 హెక్టార్లలో సజ్జ, జొన్న, మినుము, అలసంద, వరి, పత్తితదితర పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే పంటనష్టాలు అంతకు నాలుగు రేట్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తుండగా మరింత ఎండ వస్తే వాస్తవ నష్టాలు బయటపడే అవకాశం ఉంది. కాని తిరిగి జల్లులు పడుతుండటంతో అధికంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి డాక్టర్‌ స్వామి శనివారం పొదిలి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో దెబ్బతిన్న పంటలను కలెక్టర్‌ అన్సారియా, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, దర్శి టీడీపీ ఇన్‌చార్జీ గొట్టిపాటి లక్ష్మిలతో కలిసి పరిశీలించారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అయితే ఇంకా వర్షం కురిస్తే మొత్తం పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Oct 20 , 2024 | 12:36 AM