పారిశుధ్య కార్మికుడి మృతికి బాధ్యుడిగా జగన్‌పై కేసు పెట్టండి
ABN, Publish Date - Mar 11 , 2024 | 11:51 PM
మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలో మరణించిన పారిశుధ్య కార్మికుడు ఊదరగొడి మురళీకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకుని, న్యాయం చేయాలని, మురళీ మృతికి కారణమైన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిపై ఏ1గా కేసు నమోదు చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ డిమాండ్ చేశారు.
మురళీ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి
రిమ్స్ వద్ద వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ నేతలు
రూ. కోటి ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్
ఒంగోలు (కార్పొరేషన్), మార్చి 11 : మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలో మరణించిన పారిశుధ్య కార్మికుడు ఊదరగొడి మురళీకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకుని, న్యాయం చేయాలని, మురళీ మృతికి కారణమైన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిపై ఏ1గా కేసు నమోదు చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ డిమాండ్ చేశారు. సోమవారం ఒంగోలులోని రిమ్స్ వద్ద మృతుని కుటుంబ సభ్యులను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్, జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గ ఇన్‌చార్జి బీఎన్ విజయ్‌కుమార్, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ సభ విజయవంతం కోసం ఇళ్లలో ఉండేవారిని కూడా బలవంతంగా తీసుకెళ్లారన్నారు. అధికార బలంతో పోలీసులను అడ్డుపెట్టుకుని హైవేని దిగ్బంధించారని ధ్వజమెత్తారు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అతను చనిపోయాడని చెప్పారు. గతంలో కందుకూరులో జరిగిన చంద్రబాబు నాయుడు సభలో జరిగిన తొక్కిసలాటలో కొందరు ప్రాణాలు కోల్పోతే అప్పట్లో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావుపై కేసుపెట్టారని, అదే చట్టాన్ని వైసీపీకీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కుటుంబానికి ఆధారమైన మురళీకృష్ణ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఆయన భార్యకు ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇద్దరు పిల్లలను చదవించాలని దామచర్ల డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేవరకు టీడీపీ పోరాడుతోందన్నారు. జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ వైసీపీ భజన సభ కారణంగా పారిశుధ్య కార్మికుడు మరణించడం బాధాకరమన్నారు. సిద్ధం పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. ఒంగోలుకు చెందిన కార్మికుడు మరణిస్తే ఇంతవరకు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాలినేని నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఏపీ మునిసిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆఽధ్వర్యంలో మార్చురీ వద్ద నిరసన చేపట్టారు. మురళీ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మురళీ కుటుంబాన్ని ఆదుకుంటాం-బాలినేని
కాగా మురళీకృష్ణ కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారంరాత్రి మురళి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని, అలాగే ఆయన భర్యకు ఉద్యోగం, సొంతిల్లు మంజూరు చేస్తామని తెలిపారు. తన వ్యక్తిగతంగా సొంత నిధులు రూ. 3లక్షలు అందజేశారు.
Updated Date - Mar 11 , 2024 | 11:51 PM