Share News

‘నకిలీల’ కేసు నీరుగార్చారు!

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:21 AM

ఆయన కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టులో నెట్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. వైసీపీ సానుభూతిపరుడైన అతను గత ప్రభుత్వంలో వలంటీర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో అక్రమార్జన కోసం అడ్డదారి తొక్కాడు. అధికారం అండతో విచ్చలవిడిగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేశాడు. రైతులకు అవసరమైన 1బీ, అడంగళ్లతోపాటు బర్త్‌, డెత్‌, సదరం, ఇతర పలు రకాల సేవలకు సంబంధించి నకిలీ పత్రాలు పెద్దమొత్తంలో సృష్టించాడు. ఒక్కో సర్టిఫికెట్‌కు ధర నిర్ణయించి అమ్ముకొని భారీగా సొమ్ము చేసుకున్నాడు.

‘నకిలీల’ కేసు నీరుగార్చారు!

ఓ నెట్‌ సెంటర్‌ కేంద్రంగా

నాలుగేళ్లు సాగిన వ్యవహారం

అంతా తానై వ్యవహరించిన నిర్వాహకుడు

ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో వలంటీర్‌

అతను ఇచ్చిన డూప్లికేట్‌

1బీ, అడంగల్‌తో బ్యాంకులకు

కొందరు రైతుల బురిడీ

పెద్దఎత్తున బర్త్‌, డెత్‌, సదరమ్‌

సర్టిఫికెట్‌లు కూడా తయారు

సాధారణ కేసుతో సరిపుచ్చిన పోలీసులు

ఆయన కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టులో నెట్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. వైసీపీ సానుభూతిపరుడైన అతను గత ప్రభుత్వంలో వలంటీర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో అక్రమార్జన కోసం అడ్డదారి తొక్కాడు. అధికారం అండతో విచ్చలవిడిగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేశాడు. రైతులకు అవసరమైన 1బీ, అడంగళ్లతోపాటు బర్త్‌, డెత్‌, సదరం, ఇతర పలు రకాల సేవలకు సంబంధించి నకిలీ పత్రాలు పెద్దమొత్తంలో సృష్టించాడు. ఒక్కో సర్టిఫికెట్‌కు ధర నిర్ణయించి అమ్ముకొని భారీగా సొమ్ము చేసుకున్నాడు. ఇతని వద్ద పొలాలకు సంబంధించిన పత్రాలు తీసుకున్న కొందరు రైతులు వాటిని బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకొన్నారు. నాలుగేళ్లుగా నడిచిన ఈ బాగోతం ఓ రైతు ఫిర్యాదుతో రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టకుండా మమ అనిపించారు. రెవెన్యూ అధికారులు సైతం మిన్నకుండిపోయారు. అసలు ఈ విషయాన్నంతా గోప్యంగా ఉంచారు. భారీ మొత్తంలో ముడుపులు ముట్టడం వల్లనే ఇలా కేసును నీరుగార్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మార్కాపురం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : కొనకనమిట్ల మండలంలో నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంకులను, ప్రభుత్వ కార్యాలయాలను బురిడీ కొట్టించిన కేసులో అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహించినట్లు తేటతెల్లమౌతోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో కఠినంగా ఉండాల్సిన పోలీసు, రెవెన్యూ అధికారులు తూతూమంత్రం కేసులతో మమ అనిపించినట్లు అవగతమవుతోంది. లోతుగా విచారించి అక్రమాల స్థాయిని నిర్థారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. యంత్రాంగం నిర్లక్ష్యపు వైఖరితో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించిన వైసీసీ సానుభూతిపరుడు ప్రస్తుతం అజ్థాతంలో ఉన్నట్లు సమాచారం.

ఏం జరిగిందంటే..

మండలంలోని గొట్లగట్టు గ్రామంలో వైసీపీ సానుభూతిపరుడైన ఓవ్యక్తి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్‌గా పనిచేశాడు. అతనికి అదేగ్రామంలో కంప్యూటర్‌ నెట్‌ సెంటర్‌ ఉంది. పలు ధ్రువీకరణ పత్రాల జెరాక్స్‌లు, రెవెన్యూ పత్రాలకు సంబంధించిన నకళ్లను అవసరార్థులకు ఆయా సైట్‌ల నుంచి డౌన్‌లోడ్‌ చేసి ఇస్తుండేవాడు. ఈ క్రమంలో కొందరు రైతులు వచ్చినప్పుడు వారి భూములు వెదికితే 22ఏ నిషేధిత జాబితాలో ఉండటాన్ని గమనించాడు. అలాంటి వాటికి నకిలీ 1బీ, అడంగల్‌లు సృష్టిస్తే పెద్దమొత్తంలో సంపాదించవచ్చని యోచించాడు. అనుకున్నదే తడవుగా కార్యాచరణకు దిగాడు. మొదట పలువురు మీసేవ కేంద్రం వాళ్లకు ఆశచూపి ఖాళీ ధ్రువపత్రాలు సంపాదించాడు. అనంతరం నిషేధిత జాబితాలో భూములున్న రైతులతో మాట్లాడాడు. మీకు భూములున్నట్లుగా 1బీ, అడంగల్‌ ఇస్తానని వాటితో బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చని వల విసిరాడు. పాతవైన కొన్ని ఒరిజనల్‌ ధ్రువపత్రాలను స్కాన్‌ చేసి కాపీ చేసిన సమాచారాన్ని మీసేవ కేంద్రాల నుంచి తెచ్చుకున్న ఖాళీ ధ్రువపత్రాలపైన పేస్ట్‌ చేసి నకిలీ పత్రాలను తయారు చేశాడు. దీన్ని అవసరార్థులకు, అక్రమార్కులకు అమ్ముకున్నాడు. వాటిని తీసుకెళ్లి గొట్లగట్టులో ఉన్న ఓ బ్యాంకులో పలువురు రుణాలు పొందారు. ఈవిధంగా ఆ వైసీపీ సానుభూతిపరుడు పెద్ద సంఖ్యలో నకిలీ 1బీ, అడంగళ్లను తయారు చేసి రూ.లక్షల్లో జేబులు నింపుకున్నాడు.

పంచాయతీ కార్యదర్శుల నుంచి లాగిన్‌

ఇద్దరు స్నేహితులైన పంచాయతీ కార్యదర్శుల వద్ద ఆ వైసీపీ సానుభూతిపరుడు అనధికారికంగా లాగిన్‌ తీసుకొన్నాడు. బర్త్‌, డెత్‌, సదరమ్‌ సర్టిఫికెట్లే కాక పలు రకాలైన సేవలకు సంబంధించిన పత్రాలను కూడా నకిలీవి సృష్టించాడు. వీటి ద్వారా పెద్ద మొత్తంలో అక్రమార్జన చేసినట్లు తెలిసింది. ఈ తంతు సుమారు నాలుగేళ్లపాటు నిరాటంకంగా సాగినట్లు సమాచారం.

ఓ ఫిర్యాదుతో వెలుగులోకి

అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీసీ సానుభూతిపరుడు నకిలీ ధ్రువపత్రాలు అమ్ముకుంటున్న వైనాన్ని ఓ రైతు సెప్టెంబర్‌లో తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో తాను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించడంతో రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుత తహసీల్దార్‌ సురేష్‌ ముందుగా గొట్లగట్టులోని ఓ బ్యాంకుకు వెళ్లి తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత (3నెలలు) రుణాలు పొందిన వాళ్ల జాబితాను పరిశీలించారు. ముగ్గురు వ్యక్తులు తప్పుడు ధ్రువపత్రాలతో రుణాలు పొందినట్లు నిర్థారించుకున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు కంప్యూటర్‌ నెట్‌ సెంటర్‌ నిర్వాహకుడైన సదరు వలంటీర్‌, నకిలీ ధ్రువపత్రాలతో అక్రమంగా బ్యాంకు నుంచి రుణాలు పొందిన వారిపై కొనకనమిట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అధికారుల తీరుపై అనేక అనుమానాలు

నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో అటు పోలీసు, ఇటు రెవెన్యూ అధికారుల తీరు అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. మండల తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు అక్టోబర్‌ 6న పోలీసులు వైసీసీ సానుభూతిపరుడైన నెట్‌ సెంటర్‌ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం అతనితోపాటు రైతులను స్టేషన్‌కు పిలిపించి విచారించి వదిలేశారు. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం నిందితుడు అజ్ఘాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. నకిలీ ధ్రువపత్రాలతో నాలుగేళ్ల నుంచి పెద్ద సంఖ్యలో రుణాలు పొందినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లోనే కొందరు వీటిని సమర్పించి మోసం చేసినట్లు సమాచారం. అయితే తహసీల్దార్‌ తాను బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మాత్రమే పరిశీలన చేసినట్లు సమాచారం. గత నాలుగేళ్లలో ఎంత మంది ఇలా నకిలీ సర్టిఫికెట్లతో రుణాలు తీసుకున్నారన్న విషయం గురించి పట్టించుకోలేదు. తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం మూడు నెలల్లో నకిలీ సర్టిఫికెట్లతో రుణాలు తీసుకున్న ముగ్గురు రైతులపై మాత్రమే ఫిర్యాదు చేశారు. వారితోపాటు నెట్‌ సెంటర్‌ నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం ప్రాథమికంగా విచారించి వదిలేశారు. మీసేవ కేంద్రం ఖాళీ పత్రాలు ఎక్కడ నుంచి వచ్చాయో రెవెన్యూ అధికారులే నిర్ధారించాలి. అయితే వారు కూడా దీనిపై దృష్టిసారించ లేదు. నిందితుడు ధైర్యంగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేయడం వెనుక బలమైన శక్తులు ఏమైనా ఉన్నాయా? అతనికి సహకరించిన కార్యదర్శులు, వీఆర్వోలు ఎవరు? అన్న విషయాలను అసలు పట్టించుకోలేదు.

లోతుగా విచారించని పోలీసులు

కేసు నమోదై సుమారు 45 రోజులు దాటినా పురోగతి ఏమిటనేది కూడా బయటకు పొక్కడం లేదు. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే నిజాలు ఎప్పుడో బహిర్గతవయ్యేవి. కానీ వారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. భారీ మొత్తంలో చేతులు తడపడంతోనే కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టమౌతోంది. జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే ఈ అక్రమ తంతులో ప్రమేయమున్న వాళ్లందరూ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Nov 24 , 2024 | 12:21 AM