Re-Survey Issues : జగన్ పాపం రైతులకు శాపం
ABN , Publish Date - Dec 16 , 2024 | 03:52 AM
జగన్ సర్కారు చేసిన పాపాలు రైతులకు శాపంగా, కూటమి ప్రభుత్వానికి సంకటంగా మారాయి. నాడు నాలుగు దశల్లో 6,700 రెవెన్యూ గ్రామాల్లో అడ్డగోలుగా, హడావుడిగా చేసిన భూముల రీసర్వే ఎన్నో చిక్కులు తెచ్చిపెట్టింది.
వెంటాడుతున్న రీసర్వే కష్టాలు
రుణాల రీషెడ్యూల్‌లో సమస్యలు.. భూముల క్రయవిక్రయాలకు బ్రేక్
నిలిచిపోయిన వేలాది రిజిస్ర్టేషన్లు
ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 54 వేలు
ప్రభుత్వానికీ రూ.వేల కోట్లు నష్టం
ఒకటి కంటే ఎక్కువ సర్వే నంబర్లకు
ఒకే ఎల్‌పీ కేటాయించిన అధికారులు
హద్దులు నిర్ణయించడంలో అవస్థలు
భూమి విలువ నిర్ధారణలో తేడాలు
పాస్‌పుస్తకాల నిండా జగన్ పెద్ద పెద్ద ఫొటోలు.. సర్వే రాళ్లపైనా ఆయన బొమ్మలు.. ఏదో తన ఆస్తి ఉచితంగా ఇచ్చినట్టు..! రైతుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ఆర్భాటం కోసం జగన్ ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే రైతులకు ఇప్పుడు శాపంగా మారింది. జగన్ చేసిన నిర్వాకానికి జనం అష్టకష్టాలు పడుతున్నారు.
జగన్ ఫొటోల పిచ్చి కాసేపు పక్కన పెడితే.. రీ సర్వే అయినా సరిగా చేయించారా అంటే అదీ లేదు. వివాదాలు పరిష్కరించకపోగా కొత్త సమస్యలు తెచ్చిపెట్టారు. అంతా తప్పుల తడక. రికార్డులను గందరగోళం చేసేశారు. ఫలితంగా ఎంతోమంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేని దుస్థితి. అత్యవసరాలకు భూములను అమ్ముకోలేని పరిస్థితి.
రాష్ట్రవ్యాప్తంగా 6700 రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే చేశారు. రికార్డులు సరిగా లేని కారణంగా ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 54,000 రిజిస్ర్టేషన్లు ఆగిపోయాయి. కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. అటు రైతులకు సమస్యలు. ఇటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఖజానాకూ నష్టం.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ సర్కారు చేసిన పాపాలు రైతులకు శాపంగా, కూటమి ప్రభుత్వానికి సంకటంగా మారాయి. నాడు నాలుగు దశల్లో 6,700 రెవెన్యూ గ్రామాల్లో అడ్డగోలుగా, హడావుడిగా చేసిన భూముల రీసర్వే ఎన్నో చిక్కులు తెచ్చిపెట్టింది. రైతులు గతంలో లేని కొత్త సమస్యలు ఎదుర్కొంటుండగా, వాటిని సరిదిద్దడం కూటమి ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. రుణాలు తీసుకోవడానికి, రీ షెడ్యూల్ చేయించుకోవడానికి రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.
భూములు అమ్ముకోవాలని భావించేవారు, ఇప్పటికే విక్రయించినవారు రిజిస్ర్టేషన్లు జరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రిజిస్ర్టేషన్ల ఆదాయం కూడా భారీగా పడిపోయింది. ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ర్టేషన్లు ఆపడం, రీసర్వే సమస్యలతో ఆదాయానికి భారీగా గండిపడింది. రీసర్వే జరిగిన గ్రామాల్లో సర్వే నంబర్లకు బదులు ల్యాండ్ పార్సిల్ (ఎల్‌పీ) నంబర్లను కేటాయించిన గత ప్రభుత్వం వాటిని ఆన్‌లైన్‌లో ఉంచింది. ఒక సర్వే నంబరులో పలు సబ్‌డివిజన్లు ఉన్నా చాలాచోట్ల అన్నింటికీ కలిపి ఒకే ఎల్‌పీ నంబరు కేటాయించారు. దాని పరిధిలో ఏ ఒక్కరు తమ భూమిని అమ్ముకోవాలన్నా ఆ నంబరు కింద ఉన్నవారందరి భూమి విస్తీర్ణం చూపిస్తోంది. పాత సర్వే నంబర్లపై రిజిస్ర్టేషన్లు చేయాలంటే వాటిని నిషేధిత జాబితాలో చూపుతున్నారు. రిజిస్ర్టేషన్ ప్రక్రియలో భాగంగా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఎల్‌పీ నంబరు నమోదు చేస్తే రిజెక్ట్ చేస్తోంది.
బ్యాంకు రుణాలకు తిప్పలు
రీసర్వే జరిగిన ప్రాంతాల్లో ప్రజలు భూమి తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలన్నా సాధ్యం కావట్లేదు. బ్యాంకులో రుణం పొందాలంటే పట్టాదారు పాస్‌బుక్‌తో పాటు 1బీ, అడంగల్ తప్పనిసరి. పాస్‌బుక్ ఉన్నా వెబ్‌ల్యాండ్ నుంచి 1బీ, అడంగల్ రావడం లేదు. రుణాల రీషెడ్యూల్‌లోనూ ఇదే సమస్య ఎదురవుతోంది. రీసర్వే తర్వాత ఒకటి కంటే ఎక్కువ సర్వే నంబర్లకు కలిపి ఒకే ఎల్‌పీ నంబరు కేటాయించడంతో ఇలాంటి కేసుల్లో హద్దులు నిర్ణయించడం అసాధ్యంగా మారింది. మూడు వేర్వేరు విలువలు కలిగిన భూములకు ఒకే ఎల్‌పీ నెంబర్ ఇచ్చారు. వీటికి విలువ కట్టే సమయంలో మూడు విలువలు కాకుండా ఆ భూముల్లో దేనికి ఎక్కువ విలువ ఉంటే దాన్నే నమోదు చేస్తున్నారు. దీనివల్ల తక్కువ విలువ కలిగిన భూములకూ ఎక్కువ విలువ చూపిస్తుండటంతో కొనుగోలుదారులు నష్టపోతున్నారు. ఇలాంటి రిజిస్ర్టేషన్లన్నీ ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఎల్‌పీ నంబర్లు కేటాయించిన అన్ని జిల్లాల్లోనూ రిజిస్ర్టేషన్లు జరగడం లేదు. తప్పనిసరిగా రిజిస్ర్టేషన్ చేయాలంటే సబ్‌డివిజన్ చేయించుకొని రమ్మని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి, రెండు జిల్లాల్లో మాత్రమే కొంతమేర సబ్‌డివిజన్లు జరుగుతున్నాయి. మిగతా జిల్లాల్లో ఈ ప్రక్రియ చాలా మందకొడిగా నడుస్తోంది.
ఖజానాకు గండి
ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.14,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ, ఇప్పుడు రూ.10,500 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబరు వరకు రిజిస్ర్టేషన్ల ఆదాయం దాదాపు రూ.7,000 కోట్లు మాత్రమే వచ్చింది. ఎల్‌పీ నంబర్ల సమస్యకు చెక్ పెట్టాలంటే సీసీఎల్‌ఏ, సర్వే సెటిల్‌మెంట్లు, రిజిస్ర్టేషన్ల శాఖ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. పాత సర్వే నంబర్లతో కూడా రిజిస్ర్టేషన్లు చేసేలా నిబంధనలు సవరించేందుకు స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలు సీఎం దగ్గర నుంచి సర్వే సెటిల్‌మెంట్ శాఖకు చేరాయి. ఇవి అమలైతే ప్రజలకు సమస్యలు తప్పడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయమూ పెరగనుంది.