Share News

Sharmila : జగన్‌ విషనాగు

ABN , Publish Date - Oct 28 , 2024 | 05:17 AM

తన అన్న జగన్మోహన్‌రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మళ్లీ విరుచుకుపడ్డారు.

Sharmila : జగన్‌ విషనాగు

స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు ఈడ్చారు

అన్నపై మరోసారి షర్మిల నిప్పులు

వైఎస్‌ మరణానికి చంద్రబాబు కారణమైతే ఐదేళ్లు అధికారంలో ఉండి గాడిదలు కాశారా?

ప్రత్యేక విచారణ జరిపించలేదేం?

సాయిరెడ్డీ.. మీరూ జగన్‌ మోచేతి నీళ్లు తాగేవాళ్లేగా!

మీరు చదివింది కూడా ఆయన స్ర్కిప్టే

అద్దంలో చూసుకున్నా మీ నేతకు చంద్రబాబే కనిపిస్తున్నట్లుగా ఉంది

ఆస్తుల్లో నలుగురు చిన్న బిడ్డలకూ సమాన వాటా అన్నది వైఎస్‌ఆదేశం

అది అబద్ధమని మీ బిడ్డలపై ప్రమాణం చేస్తారా: షర్మిల

సాయిరెడ్డి ఆరోపణలపై ఆగ్రహం

అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తన అన్న జగన్మోహన్‌రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మళ్లీ విరుచుకుపడ్డారు. స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు ఈడ్చిన విషనాగుగా ఆయన్ను అభివర్ణించారు. తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానికి కారణమైన కాంగ్రెస్‌, చంద్రబాబుతో షర్మిల చేతులు కలిపారని.. జగన్‌ మళ్లీ సీఎం కాకూడదని ఆమె కంకణం కట్టుకున్నారని ఎంపీ విజయసాయురెడ్డి ఆదివారం చేసిన వ్యాఖ్యలపై ఆమె ‘ఎక్స్‌’లో మండిపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి మరణానికి చంద్రబాబే కారణమైతే.. ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గాడిదలు కాశారా అని ఆయన్ను నిలదీశారు. ‘జగన్‌ ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయటపెట్టలేదు? దోషులను ఎందుకు శిక్షించలేదు? అనుమానం ఉండి.. ఐదేళ్లు అధికారంలో ఉండి.. ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదు? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా’ అని ధ్వజమెత్తారు. రాజశేఖర్‌రెడ్డి మరణానికి కాంగ్రెస్‌ ముమ్మాటికీ కారణం కాదన్నారు. కాంగ్రె్‌సను ఆయన రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చారని.. బంగారు బాతును ఎవరూ చంపుకోరని.. సొంత కళ్లను ఎవరూ పొడుచుకోరని స్పష్టం చేశారు. వైఎస్‌ మరణం తర్వాత చార్జిషీటులో ఆయన పేరు చేర్పించింది జగన్‌ కాదా అని ప్రశ్నించారు. ‘కేసుల నుంచి బయటపడేందుకు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (సీనియర్‌ న్యాయవాది)తో కలసి ఈ కుట్ర చేయలేదా? కుట్ర చేయకపోతే జగన్‌ సీఎం అయిన వెంటనే అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పదవి ఆయనకు ఎందుకిచ్చారు’ అని దుయ్యబట్టారు. జగన్‌కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడినట్లు లేదని అన్నారు. ‘ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. బాబే కనిపిస్తున్నట్లుంది’ అని ఎద్దేవాచేశారు. బాబు కళ్లలో ఆనందం చూడడానికో.. ఆయన బ్రాండింగ్‌ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్‌ చేయడానికో పనిచేయాల్సిన అవసరం వైఎస్‌ బిడ్డకు ఎప్పటికీ రాదన్నారు.

నాన్న పిలిచినట్లే పెళ్లికి నేనూ పిలిచా..

చంద్రబాబుతో తనకు వ్యక్తిగత సంబంధాలూ లేవని షర్మిల స్పష్టం చేశారు. రాజశేఖర్‌రెడ్డి తన బిడ్డ (షర్మిల) పెళ్లికి ఆయన్ను పిలిచారని, అదే విధంగా తానూ తన కుమారుడి వివాహానికి పిలిచానని తెలిపారు. ‘ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్లకు సభ్యత, సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి చదివింది జగన్‌ స్ర్కిప్టు కాదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ‘ఆస్తుల్లో నలుగురు చిన్న బిడ్డలకు(మనుమడు, మనుమరాళ్లకు) సమాన వాటా ఉంటుందన్న రాజశేఖర్‌రెడ్డి ఆదేశం అబద్ధమని మీ బిడ్డలపై ప్రమాణం చేస్తారా? మీరు కూడా జగన్‌ మోచేతి నీళ్లు తాగిన వాళ్లే! రాజకీయంగా, ఆర్థికంగా ఆయన వల్ల బలపడినవాళ్లే. ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే’ అని ఆక్షేపించారు.

Updated Date - Oct 28 , 2024 | 05:19 AM