Share News

Sharmila : నాన్న ఆదేశించారు.. అమ్మ వెయ్యిసార్లు చెప్పింది

ABN , Publish Date - Oct 26 , 2024 | 05:17 AM

వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్థాపించిన అన్నివ్యాపారాలూ కుటుంబ వ్యాపారాలేనని, అందులో తన నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానవాటా ఉండాలన్నది ఆయన ఆదేశమని, అమ్మ కూడా కనీసం వెయ్యిసార్లు ఇదే విషయం చెప్పారని వారి కుమార్తె,

Sharmila : నాన్న ఆదేశించారు.. అమ్మ వెయ్యిసార్లు చెప్పింది

అవన్నీ కుటుంబ ఆస్తులే.. నా సోదరుడు జగన్‌ గార్డియన్‌ మాత్రమే

గ్రాండ్‌ చిల్డ్రన్‌కు సమాన వాటా ఇవ్వాలనేది వైఎస్‌ ఆదేశం

ఆ బాధ్యత మాత్రమే జగన్‌ది.. నాకు ఆస్తులపై మోజు లేదు

నా బిడ్డలకు రావాల్సిందే అడుగుతున్నా

రాజకీయాల్లోకి వచ్చానని తొక్కాలని చూశారు

అన్యాయపు సెటిల్‌మెంట్‌కు ఒప్పుకోలేదనే కేసులు

జగన్‌, భారతి, అవినాశ్‌లను రాజకీయంగా విమర్శించరాదట!

అందుకు నేను ఎలా ఒప్పుకొంటా?.. అందుకే వేధింపులు

బెయిల్‌కు, ఆస్తుల పంపకాలకు ముడిపెట్టి.. కొత్తగా నిందలు

కొడుకు నిర్వాకంతో తల్లి విజయమ్మ క్షోభిస్తోంది

వైఎస్‌ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ

అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్థాపించిన అన్నివ్యాపారాలూ కుటుంబ వ్యాపారాలేనని, అందులో తన నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానవాటా ఉండాలన్నది ఆయన ఆదేశమని, అమ్మ కూడా కనీసం వెయ్యిసార్లు ఇదే విషయం చెప్పారని వారి కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. వ్యాపారాలకు, ఆస్తులకు తన సోదరుడు జగన్‌ గార్డియన్‌ మాత్రమేనన్నారు. ఆస్తులు ఎగ్గొట్టడానికి కన్న కొడుకే కేసులు పెట్టి కోర్టుకు లాగడంతో తన తల్లి విజయలక్ష్మి క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని వైఎస్‌ అభిమానులకు శుక్రవారం ఆమె బహిరంగ లేఖ రాశారు. గత కొద్దిరోజులుగా వైఎస్‌ కుటుంబ ఆస్తుల గొడవల నేపథ్యంలో షర్మిలను నిందిస్తూ జగన్‌ పత్రిక శుక్రవారం సంచికలో ఒక కథనం ప్రచురించింది. ఈ కథనాన్ని ఖండించడంతోపాటు వైఎస్‌ రాజశేఖర రెడ్డి అభిమానులకు వాస్తవాలు తెలియాలని తాను ఈ లేఖ రాస్తున్నట్టు ఆమె తెలిపారు. జగన్‌ పత్రిక శుక్రవారం సంచికలో వండి వార్చిన అబద్ధపు కథనంలో తెలిపినట్టు... వైఎస్‌ బతికుండగా ఏ ఒక్క ఆస్తి పంపకమూ జరగలేదని, ఈరోజుకూ న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా తన చేతుల్లో లేదని తెలిపారు. వైఎస్‌ కుటుంబ కంపెనీల్లోని వాటాలను పంచుకోవడం వల్ల జగన్‌ బెయిల్‌కు వచ్చిన ముప్పేం లేదని, అది రద్దయ్యే అవకాశం ఉండబోదన్నారు. ఇంకా షర్మిల ఏమన్నారంటే..

h;.jpg

నాన్నపై అమ్మ రాసిన పుస్తకంలో...

‘‘మా నాన్న గురించి అమ్మ ఒక పుస్తకం రాసింది. అందులో.. రాజశేఖరరెడ్డికి లోకమంతా ఒక ఎత్తయితే .. షర్మిల ఒక ఎత్తు అంటూ రాశారు. ఆడపిల్లను అని నన్ను ఆయన ఎన్నడూ చిన్నచూపు చూడలేదు. ఆయన బతికున్నంతకాలం తనకు మనవడు, మనమరాళ్లు సమానమేనని చెప్పేవారు, వ్యాపారాలన్నింటినీ నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా పంచి పెట్టడం జగన్‌ బాధ్యత. ఇది మా నాన్న ఆదేశం. ఇది వైఎస్‌ కుటుంబ సభ్యులందరికీ స్పష్టంగా తెలిసిన విషయమే. వైఎస్‌ అభిమతం ఆయన బిడ్డలుగా నాకు, జగన్‌తోపాటు భారతీరెడ్డి, మనవడు, మనుమరాళ్లు, వైఎస్‌ స్నేహితులు కేవీపీ రామచంద్రరావు, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డికి కూడా తెలుసు. సండూర్‌ మినహా .. సరస్వతి, భారతి సిమెంట్స్‌, సాక్షి మీడియా, క్లాసిక్‌ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ... ఏమైనా నలుగురి బిడ్డలకూ సమానమే. నాన్న బతికి ఉండగా ఏ ఒక్క ఆస్తి పంపకమూ జరగలేదు. ఈరోజుకూ ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో లేదు’’


జగన్‌ ఆస్తిని అడిగాననడం అబద్ధం..

‘‘జగన్‌ ఆస్తుల్లో వాటా అడుగుతున్నానునేది హాస్యాస్పదం. అవాస్తవం. ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులు కావడం వల్లే వాటి గురించి ఇప్పటిదాకా మాట్లాడలేదు. నాకు వ్యక్తిగతంగా ఈ ఆస్తులపై మోజులేదు. జగన్‌ పెట్టిన హింసలకు ఆస్తులు కావాలన్న కోరిక నాకు లేకుండా పోయింది. నాన్న అభిమతం ఒక్కటే నాకు, అమ్మకు ముఖ్యం. దానికోసమే మేం తపన పడుతున్నాం. ఇప్పటికీ అమ్మ వెయ్యిసార్లు వీళ్లను (జగన్‌, భారతీ) అడిగి ఉంటుంది. వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుంది. అయినా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తుల్లో ఒక్కటి కూడా జగన్‌ ఇవ్వలేదు’’

ఆ 200 కోట్లు డివిడెండ్‌.. ప్రేమ, మమకారం కాదు..

కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి రావడానికి ముందు పదేళ్లూ జగన్‌ ఇబ్బందులు పడుతుంటే, ఆ ఇబ్బందులు నావిగా భావించా. తోడబుట్టినవాడికోసం నా బిడ్డలను సైతం పక్కనపెట్టి జగన్‌నూ .. వైసీపీనీ నా భుజాలపై మోశాను. ఆపదేళ్లపాటు నా అవసరం ఉందనుకున్నారో ఏమో బాగానే చూసుకున్నారు. జగన్‌ నన్ను తన పెద్ద కూతురునని ప్రకటించారు. మా నాన్న కోరుకున్నట్టే... నా పిల్లలను, తమ పిల్లలను జగన్‌ ఒకేలా చూశారు. షర్మిలకు ఇచ్చానని జగన్‌ చెబుతున్న రూ.200 కోట్లు ఈ కాలంలోనే నాకు ఇచ్చారు. అదీ డివిడెండ్‌గానే. వ్యాపారాల్లో నా బిడ్డలకు సమాన వాటా ఉన్నదని గుర్తించి... కంపెనీల్లోని డివిడెండ్‌లో సగంవాటా నాకు ఇచ్చారు. ఇందులో ప్రేమ, మమకారం ఏమీ లేవు. అప్పుగా దానిని చూపించమని చెప్పారు’

బెజవాడకు పిలిపించి... చెప్పింది ఇదీ..

‘‘అయితే....2019లో జగన్‌ సీఎం అయ్యాక గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. నన్ను చిన్నచూపు చూడటమే కాకుండా .. సీఎం అయిన నెల రోజులకే ‘విడిపోదాం’ అని ఇజ్రాయెల్‌ పర్యటనలో ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రతిపాదనను నేను, అమ్మ తిరస్కరించాం. ససేమిరా విడిపోవాల్సిందేనని జగన్‌ పట్టుబట్టి, ఆస్తుల పంపకంకోసం విజయవాడ రావాలని పిలిచారు. వచ్చాక భారతీ సిమెంట్స్‌, సాక్షిలో 60ువాటా కావాలని పట్టుబట్డారు. నాకు వాటిలో 40 శాతం ఇస్తానన్నారు. ఈ ప్రతిపాదన అమ్మకు, నాకు నచ్చలేదు. ఏకంగా 20ు ఎక్కువ కావాలంటే ఎలా అని జగన్‌ను అమ్మ ప్రశ్నించారు. ఈ ప్రతిపాదన అన్యాయంగా ఉన్నదన్నారు. అయితే.. అమ్మ మాటను బుల్డోజ్‌ చేసి .. సాక్షిలో 40ు.. భారతీ సిమెంట్స్‌లో వాళ్లకు చెందిన 49 శాతంలో 40శాతం, సరస్వతి పవర్‌లో 100శాతం, యలహంక ప్రాపర్టీలో 100 శాతం, వైఎస్‌ నివాసమున్న ఇల్లు, ఇంకా కొన్ని ఆస్తులు... నా భాగం కింద చూపించారు. తదనుగుణంగా ఆ తర్వాత కొద్దివారాల్లోనే ఎంఓయూ తయారైంది. సరస్వతి సిమెంట్స్‌ వాటాలు, యలహంక ప్రాపర్టీ ఈడీ అటాచ్‌మెంట్‌లో లేవు కాబట్టి, అవి వెంటనే రాసిస్తామని .. మిగతా ఆస్తులు కేసుల వ్యవహారం తేలాక బదిలీ చేస్తామని ఆ ఎంవోయూలో పేర్కొన్నారు. ఇదంతా నా ఆస్తిని నాకు ఇవ్వడానికి జరిపిన ప్రక్రియ.. అంతే. ప్రేమాభిమానాలతో జరిపిన కేటాయింపులు ఏమాత్రం కావు’’

జగన్‌ బెయిల్‌కు వచ్చిన ముప్పేం లేదు

‘‘సొంత చెల్లి, తల్లిపై కేసువేసి రోడ్డు మీదకు లాగిన అపకీర్తిని జగన్‌ మూటగట్టుకున్నారు. దానినుంచి బయటపడటం కోసం బెయిల్‌ రద్దు అంశం తెరపైకి తెచ్చారు. కానీ, షేర్లు బదలాయింపు జరగాల్సిన సరస్వతి కంపెనీ ఈడీ అటాచ్‌లో లేదు. అందువల్ల ఆయన బెయిల్‌కు వచ్చిన ముప్పేం లేదు. కుటుంబ, స్నేహ బంధంతో మనుషులు ఒక్కటవుతారు. కానీ వైఎస్‌ బంధం అనేది మనల్ని(వైఎస్‌ అభిమానులను ఉద్దేశించి) ఏకంచేసింది అందువల్లే ప్రతి బంధువుకూ వాస్తవాలు తెలియాలని బహిరంగ లేఖ రాస్తున్నా. తప్పుగా అర్థం చేసుకోవద్దు’’ అని షర్మిల కోరారు.

Updated Date - Oct 26 , 2024 | 05:17 AM