చి‘వరి’ ప్రయత్నం!
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:20 AM
పలాస, సోంపేట ప్రాంతాల్లో అత్యధిక శాతం వర్షాధారంగా వరిని సాగు చేస్తున్నారు.
పలాస రూరల్/సోంపేట, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పలాస, సోంపేట ప్రాంతాల్లో అత్యధిక శాతం వర్షాధారంగా వరిని సాగు చేస్తున్నారు. మొద ట్లో వర్షాలు కురవడంతో వరి పంట వేశారు. కీలకమైన ఈ దశలో నీరు అవసరం. కానీ నెల రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంట ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి సమయంలో మోటార్లతో నీరు పెట్టి... పంట పొలాలను రక్షించుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. మోటార్లు వేసుకుంటే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయని వాపోతున్నారు. పలాస మం డలం రెంటికోట, కైజోల, కాంట్రగడ, లొత్తూరులోని మెట్టు ప్రాంతాల్లో వరి పంటకు నీరు అందించేందుకు రైతులు ఆప సోపాలు పడుతున్నారు. లొత్తూరు, కాంట్రగడ ప్రాంతా ల్లో మరో వారం రోజుల్లో పంట కోతకు వస్తోంది. ఈ సమయంలో అడవి పందులతో పంట నాశనమవు తుండడంతో చుట్టూ తీగలు కట్టడం, సిమెంట్ కవర్లతో కొయ్యలు పాతడం ద్వారా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు రెంటికోట కాలనీ, కాంట్రగడ కాలనీల్లో నీరు లేకపోవడంతో గెడ్డల్లో ఉన్న నీటిని పైకి లాగి పంట పొలాలకు తరలించేందుకు మోటార్లను అద్దెకు తీసుకు వస్తున్నారు.