యువతా మేలుకో.. అవకాశం పుచ్చుకో!
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:10 AM
విద్యార్థులు చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు కేంద్రం అవకాశం కల్పిస్తోంది.
- పీఎం ఇంటర్నెషిప్.. యువతకు ఉపాధి బాట
- బహుళ జాతి కంపెనీల్లో వృత్తి నైపుణ్యాల శిక్షణ
- ఈనెల 25 వరకు నమోదుకు గడువు
- శిక్షణలో ఏడాదికి రూ.66వేలు, బీమా సదుపాయం
నరసన్నపేట, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు కేంద్రం అవకాశం కల్పిస్తోంది. తద్వారా మొరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందొచ్చు. నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని తెచ్చింది. బహుళజాతీయ సంస్థల్లో శిక్షణ ఇప్పించి నైపుణ్యాలు పెంచుకునేందుకు ఈనెల 12 నుంచి పేర్లు నమోదు ప్రక్రియ చేపట్టింది. ఉత్తరాంధ్రలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, డా. బీబిఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో కళాశాలలు, ఐటీఐలు, కళాశాలలు, ఉన్నత పాఠశాల విద్య, ఇంటర్, డిప్లొమా చదివే 30 వేలకు పైగా విద్యార్థులకు ఇదొక సువర్ణావకాశం.
అర్హులు ఎవరంటే..
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకునే వారు పదోతరగతి, ఇంటర్, బీఏ, బీకాం, బీఎస్పీ, బీబీఏ పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ, డిప్లొమా సైతం పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చను. ఈ పథకానికి 21 నుంచి 24 ఏళ్లలోపు నిరుద్యోగ యువకుల దరఖాస్తు చేసుకోవాలని అఽధికారులు చెబుతున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.పీఎం.ఇంటర్నషిప్.ఎంసీఏ.జీవోవి.ఇన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఆధార్ అనుసంధానమైన ఫోన్ నెంబరు, బయోడేటాతో రిజస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థి ప్రొఫైల్‌లో ఈకేవైసీ పూర్తి చేయాలి. వ్యక్తిగత వివరాలు, విద్యార్హత, చిరునామా, కేటగిరీ తదితర వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేసిన ఫోన్ నెంబరు, ఈ- మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయాలి. ఎటువంటి రిజస్టేషన్ ఫీజు లేదు.
ఏఏ పత్రాలు కావాలంటే...
ఆధార్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, విద్యార్హత పత్రాలు, నేటివిటీ సర్టిఫికెట్ ఉండాలి. ఐదు అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఆఫ్సన్స్ ఉంటాయి. ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. ఎంపికైతే మీ ఈ-మెయిల్‌కు ఆఫర్ లెటర్ వస్తుంది. అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడు చేసుకునే వీలు కూడా ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ ఇలా..
పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి అబ్జెక్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు పీఎం ఇంటర్న్‌షిప్‌కు రిజస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎస్పీ, ఎస్టీ , ఓబీసీ, దివ్యాంగులు పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఎంపికైన వారికి.. వారు ఎంచుకున్న పరిశ్రమలకు సంబంధించి నైపుణ్యాలను నేర్పిస్తారు. అర్హత సాఽధించిన వారు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, పీఎం సురక్ష బీమా కవరేజ్ కూడా లభించే అవకాశం ఉంది.
వేటిని అందిస్తారంటే..
పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, ఆయిల్, గ్యాస్ అండ్ ఎనర్జీ, మైనింగ్, టెలికాం, రిటైల్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, పార్మాస్యూటికల్, ఏవియేషన్, మాన్యుప్యాక్ఛరింగ్, అగ్రికల్చర్, తదితర రంగాల్లో ఇంటర్న్‌షిప్ అందిస్తారు. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఇవ్వడంతో పాటు వన్‌టైం గ్రాంటు కింద రూ.6వేలతో పాటు ప్రతినెలా ప్రభుత్వం రూ.4,500లు, కంపెనీ రూ.500 చొప్పున డీబీటీ ద్వారా క్రెడిట్ చేస్తారు. ఈ లెక్కన ఏడాదికి మొత్తం రూ.66 వేలు పొందే అవకాశం ఉంది.
శిక్షణ ఎక్కడంటే..
విశాఖ, విజయనగరం, పైడిభీమవరం పరిసరాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్‌పీసీఎల్, బెల్, ప్రైవేటు సంస్థలు రెడ్డీస్, అరబిందో, దివీస్ ల్యాబొరేటరీస్, టెక్ మహీంద్ర తదితర సంస్థల్లో శిక్షణకు అవకాశం ఉంది.
- జిల్లాలో ఏడాదికి దాదాపు 30 వేల మంది ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, బిఫార్మశీలు పూర్తి చేస్తున్నారు. చాలా మంది సరైన నైపుణ్యాలు లేకపోవడంతో ప్రముఖ సంస్థల్లో అవకాశాలు కోల్పేతున్నారు. వారికి పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
వీరు అనర్హులు
ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ తదితర ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన వారు. ఎంబీఏ, ఏంసీఏ, సీఏ, ఎంబీబీఎస్ తదితర ఉన్నత డిగ్రీలు చదివినవారు, 2023-24 విద్యాసంవత్సరంలో కుటంబంలో ఏ ఒక్కరి ఆదాయం రూ.8లక్షలు దాటిన వారు, ప్రభుత్వఉద్యోగుల పిల్లలు
- దరఖాస్తు ప్రారంభం అక్టోబరు 12న
- చివర తేది: ఈనెల 25వ తేది లోపు
- దరఖాస్తు దారుల జాబితా విడుదల : ఈనెల 26వ తేది
- ఎంపిక ప్రక్రియ : ఈనెల 27 నుంచి నవంబరు 7 వరకు
- అభ్యర్ధి అంగీకారానికి గడువు : నవంబరు 8 తేది నుండి 15 వ తేది వరకు
- ఇంటర్న్‌షిప్ ప్రారంభం: డిసెంబరు 2
- సందేహాల నివృత్తికి :హెల్ప్ లైన్ నెంబరు: 1800116090కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు.
యువతకు వరం
కేంద్ర ప్రభుత్వం యువతలో నైపుణ్యాలను పెంపుదించేందుకు తీసుకువచ్చిన పీఎం ఇంటర్నెషిప్‌ను సద్వినియోగం చేసుకోవాలి. ప్రాథమింగా యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఈకార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. జిల్లాలో యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కళాశాలల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు సమాచారం ఇవ్వాలని కళాశాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం ఉపాధి కల్పనకు దోహదపడుతుంది.
- కంది విద్యాసాగర్, ప్లేస్‌మెంట్ అధికారి, బీఆర్‌ఏయూ, శ్రీకాకుళం
సువర్ణఅవకాశం
డిగ్రీలో బీఏ చదివే విద్యార్ధులకు పీఎం ఇంటర్నెషిప్ చాలా ఉపయోగంగా ఉంటుంది. వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడం వలన యువతలో దాగి ఉన్న నైపుణ్యాలు బయటపడేందుకు దోహదపడతాయి. ముందుగా శిక్షణ ఇచ్చి తరువాత పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తే మరికొంత మంది యువతకు ఈ అవకాశం అందిపుచ్చుకునేందుకు అవకాశాలు ఇవ్వడం బాగుంది.
- చిగురపల్లి శ్రీకాంత్, డిగ్రీ రిలీవ్ విద్యార్థి, బొరుభద్ర
ఆడపిల్లలకు భరోసా
ఆడపిల్లలు పీఎం ఇంటర్నెషిప్ ద్వారా నైపుణ్యాలు పెంపుదించుకునేందుకు దోహదపడుతుంది. నాన్ టెక్నికల్ చదివే విద్యార్థులకు ప్రయోజనం. స్థానికంగా ఉన్న బహుళజాతి కంపెనీల్లో ఆడపిల్లలకు ఇంటర్నెషిప్‌కు అవకాశం ఇవ్వాలి. ఇంటర్నెషిప్ పూర్తయిన వారికి ఉపాధి అవకాశాలతో ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం ఇవ్వాలి.
- కింజరాపు రేవతి, రీలివింగ్ డిగ్రీ విద్యార్థి, నిమ్మాడ
Updated Date - Oct 21 , 2024 | 12:10 AM