‘వైసీపీ’ అధికారికి అందలం!
ABN, Publish Date - Oct 25 , 2024 | 04:47 AM
గుంటూరు దేవదాయ శాఖలో అర్హత లేకపోయినా కీలక పదవులు నిర్వహించి, వైసీపీ నాయకులతో అంటకాగిన అఽధికారికి శ్రీశైలం దేవస్థానం ఈవోగా పోస్టింగ్ ఇవ్వడంపై పాలక టీడీపీలో కలకలం రేపుతోంది.
శ్రీశైలం ఈవోగా కీలక పోస్టింగ్.. అర్హులైన డిప్యూటీ
కమిషనర్లను పక్కన పెట్టి చంద్రశేఖర్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యత
అధికారులు, టీడీపీ శ్రేణుల విస్మయం.. గతంలో ధూళిపాళ్ల
ట్రస్టు ఆస్పత్రి మూసివేయించేందుకు ఆయన యత్నాలు
3 ఉమ్మడి జిల్లాల్లో పనిచేసే ఈవోలు, మేనేజర్లకు వేధింపులు
ముడుపులు తీసుకుని అక్రమ పదోన్నతులిచ్చినట్టు ఆరోపణలు
గుంటూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): గుంటూరు దేవదాయ శాఖలో అర్హత లేకపోయినా కీలక పదవులు నిర్వహించి, వైసీపీ నాయకులతో అంటకాగిన అఽధికారికి శ్రీశైలం దేవస్థానం ఈవోగా పోస్టింగ్ ఇవ్వడంపై పాలక టీడీపీలో కలకలం రేపుతోంది. అవినీతి, అరాచక పాలనకు ఆయన కేరాఫ్ అడ్రస్ అయినప్పటికీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి ఇన్‌చార్జిగా పంపడాన్ని దేవదాయ శాఖలోని డిప్యూటీ కమిషనర్లు (డీసీలు) ఆక్షేపిస్తున్నారు. తమను కాదని.. తమ కంటే కింది కేడర్ అధికారికి కీలక పోస్టింగ్ ఇవ్వడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. సదరు అధికారి పేరు చంద్రశేఖర్‌రెడ్డి. గత శనివారం ఇన్‌చార్జిగా ఈవోగా బాధ్యతలు చేపట్టారు కూడా.
ఆయన గతంలో గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవోగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు అప్పటి దేవదాయ కమిషనర్ అనురాధకు ఫిర్యాదులు అందాయి. ఆయన అప్పటి ఓ మంత్రితో తనకున్న బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని పైరవీ చేయడంతో అవి బుట్టదాఖలయ్యాయి. వైసీపీ జమానాలో ఆయన గుంటూరు డీసీగా (తనది అసిస్టెంట్ కమిషనర్-ఏసీ స్థాయి అయినప్పటికీ ఈ పదవి దక్కించుకున్నారు) ఉన్న సమయంలో తనకు అధికారం లేకపోయినా కొందరు ఉద్యోగులకు అడ్డగోలుగా పదోన్నతులిచ్చి భారీగా ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో నడుస్తున్న ధూళిపాళ్ల వీరయ్య చౌదరి (డీవీసీ) ట్రస్టు ఆస్పత్రిని ఎలాగైనా మూయించాలన్న అప్పటి సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా అడ్డగోలు నిబంధనలను చూపి చంద్రశేఖర్‌రెడ్డి పలుమార్లు నోటీసులు జారీచేశారు. పాడి రైతులకు రాయితీపై వైద్య సేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఆ ఆస్పత్రి స్థలాన్ని ఆఖరికి 22ఏ నిషేధిత భూముల జాబితాలో పేర్కొంటూ నోటీసులిచ్చారు. గుంటూరు కేంద్రంగా 3 ఉమ్మడి జిల్లాల (గుంటూరు, ప్రకాశం, నెల్లూరు) అధికారిగా ఉండి తనిఖీల పేరుతో ఈవోలు, మేనేజర్లను వేధింపులకు గురిచేసి ముడుపులు దండుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
శ్రీశైలం ఇన్‌చార్జి ఈవోగా నియమించకముందు ఆయన ఆ దేవస్థానంలోనే నలుగురు ఏసీలలో ఒకరిగా ఉన్నారు. ఆ నలుగురులోకీ ఈయనే జూనియర్. వాస్తవానికి శ్రీశైలం ఈవో పోస్టుకు డీసీ లేదా ఆర్‌జేసీ కేడర్ అధికారిని నియమించాలి. అక్కడే డిప్యూటీ ఈవో స్థాయిలో ఓ మహిళ డీసీ కేడర్ అధికారిగా ఉన్నారు. వాస్తవానికి ఆమెనే ఇన్‌చార్జి ఈవోగా నియమించాలి. ఆమెను కాదని.. సీనియర్లను పక్కన పెట్టి.. జూనియర్ అయిన చంద్రశేఖర్‌రెడ్డికి పెద్దపీట వేయడంపై దేవదాయ శాఖ అధికారులు సైతం విస్తుపోతున్నారు. వైసీపీ హయాంలో గుంటూరు జిల్లాలో ఈయన తీరును దగ్గరుండి చూసిన టీడీపీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకె ళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.
Updated Date - Oct 25 , 2024 | 04:47 AM