‘దొర’కునా ఇటువంటి సేవ!
ABN , Publish Date - Nov 10 , 2024 | 04:41 AM
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తండ్రి డేవిడ్ బ్రౌన్ క్రైస్తవ మత ప్రచారకుడు. క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా డేవిడ్ బ్రౌన్ కుటుంబం 1762లో ఇండియా చేరుకుంది.
నేడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి
తెలుగుకు వెలుగులు అద్దిన ఆంగ్ల దొర బ్రౌన్
వ్యయ ప్రయాసలకోర్చి తెలుగు, సంస్కృత గ్రంథాల సేకరణ
ఆయనే లేకుంటే అపురూప పుస్తకాలు అంధకారంలోనే
మనుచరిత్ర, రంగనాథరామాయణం, పండితారాధ్య
చరిత్ర, దశావతార చరిత్ర తొలిసారి అందుబాటులోకి..
తెలుగు గడ్డకు తెల్ల దొరలు వచ్చారు.. తిరిగి వెళ్లిపోయారు! కానీ ఆ దొర మాత్రం తెలుగుకు వెలుగు తెచ్చారు. ఆయనే లేకుంటే మన ప్రాచీన సారస్వతంలో చాలాభాగం ఇప్పటికీ అంధకారంలోనే పడిఉండేది. వేలకు వేల వేమన పద్యాలు అనేకం వెలుగు చూసేవి కావు. ఆయన చేసింది తెలుగు సాహిత్యారాధన! దీనికోసం జీవితాన్నే అంకితం చేశారు. ఆయనే... సీపీ బ్రౌన్! నేడు ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
(కడప - ఆంధ్రజ్యోతి)
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తండ్రి డేవిడ్ బ్రౌన్ క్రైస్తవ మత ప్రచారకుడు. క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా డేవిడ్ బ్రౌన్ కుటుంబం 1762లో ఇండియా చేరుకుంది. 1798 నవంబరు 10న డేవిడ్ దంపతులకు సీపీ బ్రౌన్ కలకత్తా లో జన్మించారు. తండ్రి మరణానంతరం బ్రౌన్ కుటుంబం తిరిగి ఇంగ్లాండు వెళ్లిపోయింది. 1812లో సీపీ బ్రౌన్ సివిల్ సర్వీసె్‌సకు ఎంపికయ్యారు. ఇంగ్లాండులోని హేల్‌బరి కళాశాలలో శిక్షణ పొందారు. అనంతరం 1817లో బ్రౌన్ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి వచ్చారు. అప్పటికి ఆయనకు తెలుగు రాదు. ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆయనకు ఉద్యోగ విధుల్లో భాగంగా తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1817 ఆగస్టు 17న తొలిసారి తెలుగుభాష గురించి విన్నారు. తొలిరోజుల్లో వెలగపూడి కోదండరామయ్య పంతులు వద్ద బ్రౌన్ తెలుగుభాష నేర్చుకున్నారు. 1820 ఆగస్టులో కడప డిప్యూటీ కలెక్టరుగా చేరారు. బ్రౌన్ కడపకు రాకముందు ఆయనకు తెలుగు కంటే హిబ్రూ, పార్శీ, గ్రీకు, లాటిన్ భాషలు బాగా తెలుసు. కృషి, పట్టుదలతో తెలుగును నేర్చుకున్నారు. 1824 నాటికి, తెలుగుకావ్యాలు చదివి అర్థం చేసుకునే స్థాయికి వచ్చారు. వేమన పద్యాలను సేకరించి పుస్తకంగా ముద్రించారు. ‘ద వర్సెస్ ఆఫ్ వేమన’ పేరిట వీటిని ఇంగ్లీషులో ప్రచురించారు.
సొంత డబ్బు వెచ్చించి సాహిత్య శోధన...
కడప అప్పట్లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండేది. బ్రౌన్ కొన్నాళ్లు ఇక్కడ పనిచేసిన తర్వాత చిత్తూరు, గుంటూరు, మచిలీపట్నం, తిరునల్వేలి ప్రాంతాలకు వెళ్లారు. మళ్లీ 1826లో కడపకు వచ్చారు. బ్రౌన్ తెలుగు భాషపై పరిశోధనలు చేశారు. ప్రాచీన సాహిత్య సేకరణ, తాళపత్ర గ్రంఽథాల పరిష్కరణకు నడుం బిగించారు. వీటిని సేకరించి, వ్యాఖ్యానాలు రాసేందుకు పండితులను నియమించుకున్నారు. వీరికి సొంత డబ్బులు ఇచ్చేవారు. ఒకరకంగా జీతం మొత్తం తెలుగు భాషా సేవకే వెచ్చించారు. జీతం సరిపోక అప్పులు కూడా చేశారని అంటారు. అలా పరిష్కరించిన వాటిని బ్రౌన్ ముద్రించేవారు.
బ్రౌనే లేకుంటే..
మనుచరిత్ర, రంగనాధ రామాయణం, పాండితారాధ్య చరిత్ర, దశావతార చరిత్ర లాంటి కావ్యాలు బ్రౌన్ కృషివలనే మనకు అందుబాటులోకి వచ్చాయి. 1844లో వసుచరిత్ర, 1851లో మనుచరిత్ర ప్రచురించారు. జాలూరు అప్పయ్యశాస్త్రిచేత వీటికి వ్యాఖ్యానాలు రాయించారు. 1852లో పల్నాటి వీరచరిత్ర పుస్తకం ప్రచురించారు. శుభవార్త మానం, బైబిల్ కథలు తెలుగులోకి అనువదించారు. 1164 వేమన పద్యాలు సేకరించి వాటికి పదకోశం తయారు చేశారు. మొట్టమొదటి వేమన శతకం ప్రచురించింది వీరే. తెలుగు- ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు రూపొందించారు. ఇప్పటికీ సీపీ బ్రౌన్ నిఘంటువులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ‘ఏ గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజీ’ అనే వ్యాకరణ గ్రంఽథం రాశారు. ఇతిహాసాలు, పురాణాలు, శతకాలు, వీరగాఽథలు, నిర్వచన వచన కావ్యాలు, ద్విపద కావ్యాలకు ప్రాణం పోశారు. లండన్‌లోని ఇండియన్ హౌస్ లైబ్రరీలో ఉన్న దాదాపు రెండువేల దక్షిణభారత గ్రంథాలను మద్రా్‌సకు తెప్పించారు. 1854లో ఉద్యోగ విరమణ అనంతరం ఆయన తిరిగి లండన్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డారు. 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్‌గా చేరారు. బ్రౌన్ 12 డిసెంబరు 1884న చనిపోయారు. ఆయన అవివాహితుడు.
కడపలో సీపీ బ్రౌన్ గ్రంథాలయం
డిప్యూటీ కలెక్టర్‌గా సీపీ బ్రౌన్ పలు ప్రాంతాల్లో పనిచేసినా.. ఆయన కడపలో ఎక్కువకాలం ఉన్నారు. ఆయన చనిపోయిన దాదాపు వందేళ్ల తర్వాత కడపలో సీపీ బ్రౌన్ సేవలను వెలుగులోకి తెచ్చేందుకు జానమద్ది హనుమచ్చాస్ర్తి రంగంలోకి దిగారు. బ్రౌన్ తెలుగు భాషకు ఆకుంఠిత దీక్షతో ఎలా అయితే శ్రమించారో.. జానమద్ది కూడా ఎంతగానో శ్రమించి కడపలో బ్రౌన్ గ్రంఽథాలయం ఏర్పాటుచేశారు. ఆయన కడపలో నివసించిన బంగ్లా ఉన్న స్థలం లో ఇప్పుడు సీపీ బ్రౌన్ గ్రంథాలయం ఉంది. ఇక్కడ ఎన్నో సాహిత్య పుస్తకాలతో పాటు తాళపత్ర గ్రంఽథాలు, విజ్ఞాన సంపద నిక్షిప్తమై ఉంది.
తులనాత్మకతలో తొలి అడుగులు
ప్రాచీన కావ్యాల ముద్రణ, అధ్యయనంలో పాశ్చాత్య రీతిని బ్రౌన్ అనుసరించారు. ఉదాహరణకు సింగన రాసిన అహల్యచరిత్ర, సుముఖం వెంకటకృష్ణ రచించిన అహల్య సంక్రమణ విలాసం పుస్తకాలను దగ్గర పెట్టుకుని.. తులనాత్మక అధ్యయనం చేయించారు. ఈ తరహా పరిశీలన బ్రౌన్ ద్వారానే తెలుగు సమాజానికి పరిచయం అయింది. తెలుగువారికి ఇష్టమైన వసుచరిత్ర, మనుచరిత్ర కావ్యాలు జూలూరి అప్పయ్యపంతులతో పరిష్కరించి ముద్రించారు. ఆంధ్రమహాభాగవతం శుద్ధ ప్రతిని తప్పులు లేకుండా రాయించారు. 1840లో భాగవతాన్ని బ్రౌన్ స్వయంగా ముద్రించారు. 1848లో హయగ్రీవ శాస్త్ర పూర్వ భాగవతం ముద్రించారు.
బ్రౌన్ సేవలు వెలకట్టలేనివి
తెలుగు భాషా సేవలో జీవితాన్ని తరింపజేసుకున్న గొప్ప భాషా సేవకులు సీపీ బ్రౌన్. ఆంగ్లేయుడుగా పుట్టినా తన జీవితాన్ని, జీతాన్ని తెలుగుభాషా సాహిత్యాల పునరుద్ధరణకు వెచ్చించారు. బ్రౌన్ గొప్పతనాన్ని కొలవడానికి కొలమానాలు లేవు. వేమన కవిత్వంలోని సామాజిక రుగ్మతలను తొలగించే లక్షణం చూసి బ్రౌన్ ఆశ్చర్యపోయారు. లభ్యమవుతున్న తాళపత్ర గ్రంథాలు చాలా మటుకు బ్రౌన్ సేకరించినవే. దేశం నలుచెరగుల నుంచి వీటిని తెప్పించి భద్రపరిచారు. పండితుల చేత వాటిని పరిష్కరించి కాగితాలపై రాయించి ఆంధ్ర సాహిత్య లక్ష్మికి భాగ్య భాండాగారం ఏర్పరిచారు. ఆ దొర లేకుంటే చెదలు పట్టి ఆంధ్ర గ్రంథాలు ఏమయ్యేవో!
- ఎన్.ఈశ్వర్‌రెడ్డి, తెలుగు ప్రొఫెసర్, యోగివేమన యూనివర్శిటీ