వైసీపీకి మరో ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు గుడ్‌బై
ABN , Publish Date - Mar 25 , 2024 | 04:35 AM
అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు...
వరప్రసాద్ బీజేపీలో చేరిక.. కాంగ్రెస్‌లోకి ఎలీజా
ఇప్పటికే ముగ్గురు ఎస్సీ సభ్యుల రాజీనామా
న్యూఢిల్లీ/అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు... గూడూరు(ఎస్సీ) ఎమ్మెల్యే, విశ్రాంత ఐఏఎస్ అధికారి వరప్రసాద్, చింతలపూడి (ఎస్సీ) శాసనసభ్యుడు ఉన్నమట్ల రాకాడ ఎలీజా ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వేరే పార్టీలోకి వెళ్లిన ఎస్సీ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది. ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ-ఎస్సీ), కోనేటి ఆదిమూలం(సత్యవేడు-ఎస్సీ) టీడీపీలో చేరిపోగా.. నందికొట్కూరు-ఎస్సీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేనైన తనను కాదని మేరుగ మురళీధర్‌కు గూడూరు టికెట్ ఇవ్వడంతో వరప్రసాద్ మనస్తాపం చెందారు. వైసీపీకి రాజీనామా చేసి.. ఆదివారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీలో చేరారు. తిరుపతి(ఎస్సీ) లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు తెలిసింది. ఆ పార్టీ నాయకత్వం కూడా హామీ ఇచ్చినట్లు తెలిసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే వైసీపీ తరఫున విజయం సాధించారు. 2019లో గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ప్రధాని మోదీకే సాధ్యమన్నారు. మరోసారి తిరుపతి ప్రజలకు సేవచేసే అవకాశం కలిగిందని చెప్పారు. ఇంకోవైపు.. చింతలపూడి వైసీపీ టికెట్ కంభం విజయరాజుకు ఇవ్వడంతో ఎలీజా కూడా ఆ పార్టీ నుంచి వైదొలిగారు. ఆదివారం హైదరాబాద్ లోట్‌సపాండ్‌లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఆయన కాంగ్రె్‌సలో చేరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ తనను దారుణంగా అవమానించిందని.. తన పార్టీ అనుకుని పనిచేస్తే మోసం చేసిందని.. ప్రజాప్రతినిధిగా కనీస గౌరవాన్ని కూడా ఇవ్వలేదని విమర్శించారు. సిటింగ్ ఎమ్మెల్యేగా తనకు తెలియకుండానే అభివృద్ధి కార్యక్రమాలను చేశారని, శిలాఫలకంపై తన పేరే లేకుండా చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో, దేశంలో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. వైసీపీ అసంతృప్త నేతలంతా పార్టీలో చేరతారని చెప్పారు. ఈ దఫా వైసీపీ టికెట్లు దక్కని ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల్లో చెట్టి ఫాల్గుణ (అరకులోయ-ఎస్టీ), టీజేఆర్ సుధాకరబాబు (సంతనూతలపాడు-ఎస్సీ), జొన్నలగడ్డ పద్మావతి (శింగనమల-ఎస్సీ), ఎం.బాబు (పూతలపట్టు-ఎస్సీ), కె.రక్షణనిధి (తిరువూరు-ఎస్సీ), తిప్పేస్వామి (మడకశిర-ఎస్సీ), కొండేటి చిట్టిబాబు (పి.గన్నవరం-ఎస్సీ) కూడా ఉన్నారు.