Share News

చెన్నైలో నిందితుడు!

ABN , Publish Date - Feb 05 , 2024 | 01:24 AM

తహసీల్దార్‌ సనపల రమణయ్య హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

చెన్నైలో నిందితుడు!

గుర్తించిన పోలీసులు

పట్టుకునేందుకు వెళ్లిన ప్రత్యేక బృందం

విమానాశ్రయంలో ఉండగా గుర్తించకపోవడంపై సీపీ పోస్టుమార్టం

సంబంధిత అధికారులపై ఆగ్రహం

వైఫల్యంపై జాయింట్‌ సీపీ ఆధ్వర్యంలో విచారణ

తహసీల్దార్‌ రమణయ్య హత్యపై కొనసాగుతున్న దర్యాప్తు

విశాఖపట్నం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి):

తహసీల్దార్‌ సనపల రమణయ్య హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రమణయ్యను ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేసింది పెద రుషికొండ జ్యువెల్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మురహరి సుబ్రహ్మణ్యం గంగారాం అలియాస్‌ గంగాధర్‌ అలియాస్‌ జగన్‌ గా గుర్తించినట్టు తెలిసింది. దీంతో గంగాధర్‌ సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా ప్రస్తుతం చెన్నైలో ఉన్నట్టు గుర్తించి అక్కడికి ద్వారకా సీఐ రమేష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని పంపించారు. హత్య చేసిన తర్వాత గంగాధర్‌ తన ద్విచక్రవాహనంపై నేరుగా అనకాపల్లి వైపు వెళ్లి, శనివారం ఉదయాన్నే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నట్టు తేల్చారు. గంగాధర్‌ తన సెల్‌ఫోన్‌లోనే మేక్‌ మైట్రిప్‌ యాప్‌లో చెన్నైకి విమానం టిక్కెట్‌తోపాటు రైలు టిక్కెట్టు కూడా తీసినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. గంగాధర్‌ సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ శనివారం ఉదయానికి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నట్టు చూపించి, తర్వాత లొకేషన్‌ చూపించకపోవడంతో చెన్నై వెళ్లిపోయినట్టు భావించారు. అక్కడికి హుటాహుటిన ఒక బృందాన్ని పంపించారు. కానీ గంగాధర్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండి, శనివారం మధ్యాహ్నం బెంగళూరు మీదుగా చెన్నై వెళ్లే విమానం ఎక్కినప్పటికీ పోలీసులు గుర్తించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. చెన్నై విమానం ఎక్కిన గంగాధర్‌ అక్కడకు వెళ్లకుండా ట్రాన్సిట్‌ హాల్ట్‌ కోసం బెంగళూరులో విమానం ఆగడంతో అక్కడ దిగిపోయాడు. అనంతరం శనివారం మధ్యాహ్నం చెన్నై విమానం ఎక్కినట్టు ఆలస్యంగా గుర్తించిన పోలీసులు బెంగళూరు నుంచి చైన్నై వచ్చే విమానంలో గంగాధర్‌ను అదుపులోకి తీసుకోవాలని అప్పటికే చెన్నైలో ఉన్న పోలీస్‌ బృందాన్ని ఆదేశించారు.

నగర పోలీసులు ఇచ్చిన ఆదేశాలతో విశాఖ నుంచి బెంగళూరు మీదుగా చెన్నై వచ్చిన విమానంలో గంగాధర్‌ కోసం ప్రత్యేక బృందం గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో కంగుతిన్నారు. తర్వాత గంగాధర్‌ బెంగళూరులోనే ఉన్నట్టు గుర్తించి ట్రాకింగ్‌ పెట్టగా, ఆదివారం ఉదయానికి చైన్నైలో ఉన్నట్టు తేలింది. దీంతో మరో బృందాన్ని అక్కడికి పంపించారు. ఇదిలావుండగా శనివారం ఉదయానికి నిందితుడు గంగాధర్‌గా గుర్తించడంతో పాటు ఎక్కడికి వెళ్లేందుకు టికెట్లు తీశాడు, అతని లొకేషన్‌ ఎక్కడ అనేది తెలుసుకున్నప్పటికీ శనివారం మధ్యాహ్నం వరకూ నగరంలోనే ఉన్నా గుర్తించలేకపోవడం, పట్టుకోలేకపోవడంపై సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆదివారం పలుమార్లు అధికారులతో సమావేశమై గంగాధర్‌ను అదుపులోకి తీసుకోలేకపోవడానికి కారణాలు, వైఫల్యాలపై చర్చించడంతోపాటు ఇప్పుడు ఏం చేయాలనే దానిపైనా చర్చించినట్టు సమాచారం. ఎయిర్‌పోర్ట్‌లో నిందితుడు ఉన్నప్పటికీ గుర్తించడంలో సంబంధిత అధికారులు విఫలమవడానికి కారణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారని, అందులో భాగంగానే జాయింట్‌ సీపీ ఫకీరప్ప ఆదివారం ఎయిర్‌పోర్టుకు వెళ్లి పలు అంశాలను పరిశీలించినట్టు పోలీస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కన్వేయన్స్‌ డీడ్‌ జారీలోనే వివాదం

విశాఖపట్నం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి):

మధురవాడ రెవెన్యూ పరిధిలోని పెద రుషికొండలో నిర్మించిన ఒక అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్లకు సంబంధించి కన్వేయన్స్‌ డీడ్‌ల జారీ అంశమే తహసీల్దారు రమణయ్య హత్యకు కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. చివరకు రెవెన్యూ అధికారులు సైతం ఇదే కారణమని నిర్ధారణకు వచ్చారు. వివరాల్లోనికి వెళితే..

మధురవాడ రెవెన్యూ సర్వేనంబరు 381లో ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం గతంలో కొంతమందికి కేటాయించారు. పట్టా తీసుకున్న యజమానులు ఈ భూమిని ఇతరులకు విక్రయించారు. దీనికి జిల్లా యంత్రాంగం నిరభ్యంతరపత్రాన్ని కూడా జారీచేసింది. తరువాత ఆ భూమిలోని కొంత భాగంలో భారీ అపార్టుమెంట్‌ నిర్మాణానికి జీవీఎంసీకి దరఖాస్తు చేసుకోగా ప్లాన్‌ జారీచేసింది. 13 బ్లాకులు, ఎనిమిది అంతస్థుల్లో వందకుపైగా ఫ్లాట్‌లు నిర్మించారు. అయితే ఇందులో కొంత ప్రభుత్వభూమి ఉందని కొందరు జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆ సర్వే నంబరును 22(ఎ) జాబితాలో చేర్చింది. దీనివల్ల ఫ్లాట్‌లు కొనుగోలు చేసిన వారు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు క్రమబద్ధీకరణ చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇళ్ల క్రమబద్ధీకరణకు 2017 జూలై 24న ప్రభుత్వం 388 జీవో ఇచ్చింది. ఫ్లాట్‌ యజమానులు సొమ్ము చెల్లించడంతో పట్టాలు జారీచేశారు. రెండేళ్ల తరువాత కన్వేయన్స్‌ డీడ్‌లు జారీచేస్తామని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. ఈలోగా ఎన్నికలు జరగడం, ప్రభుత్వం మారడంతో కన్వేయన్స్‌ డీడ్‌లు జారీ ప్రక్రియ నిలిచిపోయింది. గత ఏడాది వైసీపీ నాయకుల ఒత్తిడితో కన్వేయన్స్‌ డీడ్‌లు జారీ ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సర్వేనంబరు 381లో నిర్మించిన అపార్టుమెంట్‌లో మొత్తం ఫ్లాట్ల యజమానుల్లో 93 మందికి కన్వేయన్స్‌ డీడ్‌లు ఇచ్చేశారు. మిగిలిన వారిలో ఐదుగురు విదేశాల్లో ఉండగా మరో ముగ్గురు చనిపోయారు. ఈ ఎనిమిది ఫ్లాట్లకు సంబంధించి మురహరి సుబ్రహ్మణ్యం గంగారాం అలియాస్‌ గంగాధర్‌ పేరిట కన్వేయన్స్‌ డీడ్‌లు జారీచేయాలని కోరుతూ వారి వారసులు రూరల్‌ తహసీల్దారును కోరారు. దీనికోసం గంగాధర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ పని పెండింగ్‌లోనే ఉండగా... నాలుగు రోజులు క్రితం తహసీల్దారు రమణయ్య బదిలీ జరిగింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి రమణయ్య ఇంటి వద్ద వాగ్వాదానికి దిగాడని, చివరకు దాడిచేసి హత్య చేశాడని ప్రచారం జరుగుతోంది.

ఎవరీ మురహరి గంగాధర్‌ ?

తహసీల్దార్‌ రమణయ్య హత్యకేసులో నిందితుడిగా అనుమానిస్తున్న మురహరి సుబ్రహ్మణ్యం గంగారాం అలియాస్‌ గంగాధర్‌ ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విజయవాడకు చెందిన ఇతడు విజయవాడతో పాటు హైదరాబాద్‌లో కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడని, 2019 తర్వాత విశాఖ వచ్చినట్టు కొందరు చెబుతున్నారు. ఎండాడలోని పనోరమాహిల్స్‌లో ఉండేవాడని, తర్వాత పెద్దరుషికొండలోని జ్యువెల్‌ అపార్ట్‌మెంట్‌ నిర్మాణ కంపెనీతో సంబంధం ఏర్పడినట్టు సమాచారం. ఈ నిర్మాణానికి జీవీఎంసీ నుంచి ప్లాన్‌ తెచ్చేపనులు చూశాడని తెలిసింది. అదే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలుచేసి నివాసం మార్చుకున్నాడని, తర్వాత ఫ్లాట్‌ల రిజిస్ర్టేషన్‌తోపాటు బ్యాంక్‌రుణాల జారీకి వీలుగా భూమికి సంబంధించిన కన్వెయెన్స్‌ డీడ్‌ అవసరం కావడంతో ఆ పనిని చేయిస్తానని కొంత మొత్తానికి ఒప్పందం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కన్వెయెన్స్‌ డీడ్‌ కోసం రూరల్‌ తహసీల్దార్‌ రమణయ్యను సంప్రదించారని తెలిసింది. రమణయ్యకు బదిలీ కావడంతో పని జరగదనే భావనతోనే హత్యకు గంగాధర్‌ ప్రణాళిక వేశాడని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. కాగా గంగాధర్‌పై సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో చీటింగ్‌ కేసు ఉన్నట్టు తెలిసింది. అయితే హత్యకేసు దర్యాప్తులో పురోగతిపై పోలీసులు నోరు విప్పకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.

Updated Date - Feb 05 , 2024 | 01:24 AM