Share News

బలిమెల నీటి వినియోగంపై తేలిన లెక్కలు

ABN , Publish Date - Nov 22 , 2024 | 10:57 PM

ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఆంధ్రా, ఒడిశా అధికారులు లెక్కలు తేల్చారు.

బలిమెల నీటి వినియోగంపై తేలిన లెక్కలు
బలిమెల నీటి వినియోగంపై సమావేశమైన ఇరు రాష్ర్టాల అధికారులు

ఆంధ్రా వాటా 63.7125 టీఎంసీలు,

ఒడిశా వాటా 43.5642 టీఎంసీలు

ఇప్పటికే ఒడిశా 20.1483 టీఎంసీలు

అధికంగా వినియోగం

సీలేరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఆంధ్రా, ఒడిశా అధికారులు లెక్కలు తేల్చారు. శుక్రవారం ఒడిశా మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ ఓహెచ్‌పీసీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఇరురాష్ట్రాల అధికారులు జలాశయం నిర్వహణ, నీటి వినియోగంపై చర్చించారు. అక్టోబరులో ఒడిశా తన వాటాగా 14.4075 టీఎంసీలు నీటిని వినియోగించుకోగా, ఆంధ్రా 9.9421 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్టు లెక్కలు కట్టారు. అక్టోబరులో ఆంధ్రా కంటే ఒడిశా 4.4654 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకున్నట్టు నిర్ధారించారు. అలాగే 2024-2025 నీటి సంవత్సరంలో జూలై నుంచి అక్టోబరు నెలాఖరు నాటికి ఒడిశా తన వాటాగా 43.1609 టీఎంసీలు వినియోగించుకోగా, ఆంధ్రా తన వాటాగా 23.0126 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్టు గుర్తించారు. దీని ప్రకాకం ఆంధ్రా కంటే ఒడిశా 20.1483 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకుంది. ప్రస్తుతం బలిమెల, జోలాపుట్‌ జలాశయాల్లో 103.0767 టీఎంసీలు నీటి నిల్వలు ఉండగా, ఈనెలాఖరు నాటికి 4.2000 టీఎంసీల నీటి నిల్వలు వచ్చి చేరుతుందని లెక్కలు కట్టారు. దీని ప్రకారం మొత్తం నీటి నిల్వ 107.2767 టీఎంసీలుగా గుర్తించారు. ఇందులో ఆంధ్రా వాటాగా 63.7125 టీఎంసీలు, ఒడిశా వాటాగా 43.5642 టీఎంసీలు వాడుకోవడానికి ఇరు రాష్ర్టాల మధ్య అంగీకారం కుదిరింది. ప్రస్తుతం గ్రిడ్‌ డిమాండ్‌, ఇరిగేషన్‌ అవసరాల కోసం ఆంధ్రా 2 వేల క్యూసెక్కులు, ఒడిశా 3,800 క్యూసెక్కుల నీటిని వినియోగించుకోవడానికి అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఒడిశా తరపున ఒడిశా హైడ్రో కార్పొరేషన్‌ బలిమెల జీఎం. జ్యోతిర్మయిదాస్‌, ఏజీఎం ప్రకాష్‌నాయక్‌, మేనేజర్‌ విజయ్‌కుమార్‌ ప్రధాన్‌, డిప్యూటీ మేనేజర్‌ రాకేష్‌ పాణిగ్రహి, పొట్టేరు ఇరిగేషన్‌ సీఈ పితబాసి శెట్టి, ఎస్‌ఈ రమాకాంత పాత్ర, ఏఈ గడాధర్‌ ప్రధాన్‌ పాల్గొనగా.. ఆంధ్రా తరపున సీలేరు కాంప్లెక్సు జెన్‌కో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ బి.చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈలు ఎం.శ్రీనివాసరెడ్డి, వి.రాజేంద్రప్రసాద్‌, ఏడీఈ కె. దుర్గాశ్రీనివాసరావు, ఏఈఈ సీహెచ్‌ సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2024 | 10:57 PM