సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు చెక్
ABN , Publish Date - Nov 20 , 2024 | 01:11 AM
నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు 45 రోజులు ప్రణాళికను అమలు చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్ తెలిపారు.
వినియోగాన్ని నియంత్రించేందుకు 45 రోజులు ప్రణాళిక
డిసెంబరు నెలాఖరువరకూ అవగాహన కార్యక్రమాలు
ఆ తరువాత ఎవరైనా ఉపయోగిస్తే చర్యలు
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ బ్యాగ్‌లు సరఫరా
రోడ్ల నిర్వహణ గ్లోబల్ టెండర్ల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగింత
మధురవాడ ప్రాంతానికి తాగునీటిని తరలించేందుకు రూ.295 కోట్లతో నరవ నుంచి పైప్‌లైన్ నిర్మాణం
జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్
విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):
నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు 45 రోజులు ప్రణాళికను అమలు చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్ తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో మౌలిక వసతుల కల్పన, పచ్చదనం పెంపు, జీవీఎంసీ స్థలాల పరిరక్షణ, వీధి దీపాల సమస్య పరిష్కారం, నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న చర్యల గురించి వెల్లడించారు. నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పెనుసమస్యగా తయారైందని, దీనిని అధిగమించేందుకు ‘ఎకో వైజాగ్’ కార్యక్రమాన్ని ముమ్మరం చేయబోతున్నామన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువులను డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిసెంబరు చివరి వరకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, తర్వాత కఠిన చర్యలకు దిగుతామన్నారు.
నగరంలో రోడ్ల నిర్వహణను ఏప్రిల్ నుంచి గ్లోబల్ టెండర్ల ద్వారా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించబోతున్నామన్నారు. జీవీఎంసీ పరిఽధిలో 40 అడుగులకు మించి వెడల్పు కలిగిన 253 కిలోమీటర్ల రోడ్లకు ఆధునిక హంగులు చేకూర్చబోతున్నామన్నారు. ఐదేళ్లపాటు ఒకే కాంట్రాక్టర్‌కు రోడ్ల నిర్వహణ, నిర్మాణ బాధ్యతలను అప్పగించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారని, 2026 జనవరి నాటికి రోడ్ల స్వరూపం మారిపోతుందని కమిషనర్ ఆశాభావం వ్యక్తంచేశారు. నగర ప్రజలందరికీ అవసరమైనంత మేరకు నీటి సరఫరా చేయడంపై దృష్టిపెట్టామన్నారు. మధురవాడ ప్రాంతానికి తాగునీటిని తరలించేందుకు రూ.295 కోట్లతో నరవ నుంచి ముడసర్లోవ మీదుగా పైప్‌లైన్ నిర్మాణం చేపట్టబోతున్నట్టు ఆయన తెలిపారు. జోన్-2 (మధురవాడ), జోన్-6 (గాజువాక) ప్రాంతాల్లో యూజీడీ అందుబాటులోకి తేవడంతోపాటు కోర్‌సిటీ పరిధిలో ప్రస్తుతం ఉన్న యూజీడీ నెట్‌వర్క్‌ను పెంచేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. నగరంలో ఇప్పటికే లక్ష వరకూ యూజీడీ కనెక్షన్లు ఉండగా 95 వేల కనెక్షన్లకు వేర్వేరు కారణాలతో లబ్ధిదారులు ముందుకురావడం లేదన్నారు. నగరంలో 24 చోట్ల మురుగునీరు నేరుగా సముద్రంలో కలుస్తోందని, వాటిలో 14 పాయింట్లను డిసెంబరు నాటికి సమీపంలోని ఎస్‌టీపీలకు మళ్లించే పని పూర్తవుతుందన్నారు. శుద్ధిచేసిన నీటిని పరిశ్రమలకు విక్రయించడం ద్వారా ఏటా రూ.30 కోట్లు ఆదాయం సమకూరుతుందన్నారు. నగరంలో తాగునీరు కలుషితం కాకుండా ఉండేందుకు డ్రైనేజీలను క్రాస్ చేస్తున్న పైప్‌లైన్ పాయింట్లు 274 గుర్తించి వాటిని వేరే మార్గాల్లోకి మళ్లించామన్నారు. నీటి కాలుష్యం జరిగితే గుర్తించేందుకు వీలుగా ప్రతిరోజూ మూడుసార్లు నీటి శాంపిల్స్‌ను జీవీఎంసీ ల్యాబ్‌ల్లో పరీక్షిస్తున్నామన్నారు. నగరమంతటికీ నిరంతరం నీరు సరఫరా చేయాలంటే రూ.1,200 కోట్లు అవసరమవుతుందన్నారు. జీవీఎంసీ పరిధిలో వీధి దీపాల పనితీరును మెరుగుపరిచే చర్యలు ప్రారంభమయ్యాయని, లైటింగ్ తక్కువగా ఉంటుందనే ఫిర్యాదులు అందుతున్నందున 50 వేల స్తంబాలకు 70 వాట్స్ లైట్లను ఏర్పాటుచేసి లైటింగ్ పెంచుతామన్నారు. జీవీఎంసీ పరిధిలో 600 ఎకరాల విస్తీర్ణంలో 1200 ఓపెన్‌స్పేస్‌లు ఉన్నాయని వాటిలో 400 ఓపెన్‌స్పేస్‌లకు ఇప్పటికే కంచెలు ఉండగా మిగిలిన వాటికి రెండు వరుసల్లో మొక్కలునాటడం ద్వారా గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటుచేస్తామన్నారు. అలాగే కాపులుప్పాడలో 22 ఎకరాల్లో మొక్కలు నాటుతున్నామన్నారు. దీనివల్ల జీవీఎంసీలో ప్రస్తుతం 28 శాతం ఉన్న పచ్చదనం 33 శాతానికి పెరుగుతుందన్నారు. నగరంలో అనధికార భవనాలను గుర్తించేందుకు వీలుగా డ్రోన్‌ల ద్వారా సర్వే చేసే ప్రతిపాదన ఉందన్నారు. వంద గజాల్లోపు నిర్మాణాలకు ప్లాన్ అవసరం లేదని రాష్ట్రప్రభుత్వం ప్రకటించిందని, దీనివల్ల చాలావరకూ ఫిర్యాదులు తగ్గిపోతాయని ఆశాభావం వ్యక్తంచేశారు.