నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్రాన్సిట్ హాల్టు
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:34 AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సోమవారం విశాఖ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగనున్నారు.
విశాఖపట్నం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సోమవారం విశాఖ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగనున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలో డయేరియా మృతు ల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం 8.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 9.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి 9.35 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గాన విజయనగరం జిల్లా వెళతారు. తిరిగి మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, విమానంలో గన్నవరం వెళతారు.
మళ్లీ మొదటికి!
కొలిక్కిరాని రేషన్ షాపుల విభజన ప్రక్రియ
కోర్టు స్టేతో ఇప్పటివరకు స్వీకరించిన అభ్యంతరాలు రద్దు
నేటి నుంచి మరోసారి అభ్యంతరాల స్వీకరణ
విశాఖపట్నం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి):
ఒక డిపోలో 1200 కార్టులు కంటే ఎక్కువగా ఉంటే విభజించి, మరో డిపో ఏర్పాటు చేసే విభజన ప్రక్రియ మొదటకొచ్చింది. కార్డుల విభజనపై సంబంధిత డీలర్ల నుంచి తీసుకున్న అభ్యంతరాలను రద్దుచేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి మరోసారి అభ్యతరాలు స్వీకరించాలని ఆదేశించింది. దీంతో జిల్లాలో 68 రేషన్ దుకాణాల డీలర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు వీలుగా నోటీసులు జారీచేశారు.
రేషన్ దుకాణాల హేతుబద్థీకరణకు సన్నాహాలు చేసిన పౌరసరఫరాలశాఖ గత నెలలో విధివిధానాలు ఖరారుచేసింది. దీనిపై అభ్యంతరాలు వెల్లువెత్తడంతో హేతుబద్ధీకరణకు బదులు 1,200 కార్టులు దాటిన డిపోలను విభజించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా నగరంలో 57, గ్రామీణ మండలాల్లో 11 మొత్తం 68 రేషన్ దుకాణాలకు నోటీసులు ఇచ్చి, అభ్యంతరాలు స్వీకరించారు. విభజనపై రాష్ట్రంలో పలువురు డీలర్లు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో పది రోజుల కిందట స్వీకరించిన అభ్యంతరాలను రద్దుచేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. అదే సమయంలో మరోసారి డీలర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో సోమవారం నుంచి జిల్లాలోని 68 మంది డీలర్ల నుంచి అభ్యతరాలు స్వీకరించేందుకు నగర పరిధిలో పౌరసరఫరాల శాఖ అధికారులు, గ్రామీణ ప్రాంతంలో తహసీల్దార్లు నోటీసులు ఇవ్వనున్నారు. వారం రోజుల్లో అభ్యంతరాలు తెలపాలని, వాటిపై కలెక్టర్ సమక్షంలో నిర్ణయం తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచించింది. దీంతో జిల్లాలో సోమవారం నుంచి నోటీసులు జారీచేసి అభ్యంతరాలు స్వీకరిస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి భాస్కరరావు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఘోరం
ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ
నగరానికి చెందిన తల్లి, కుమారుడు దుర్మరణం
తండ్రి, మరో కుమారుడికి గాయాలు
జగ్గయ్యపేట రూరల్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి):
ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు పరస్పరం ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా గరికపాడు కేవీకే సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. మృతులు విశాఖపట్నం వాసులుగా అక్కడి పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
విశాఖపట్నానికి చెందిన ఇళ్ల నాగవెంకట మల్లికార్జునరావు, ఆయన భార్య నాగలక్ష్మి (55), కుమారులు శ్రీకాంత్ (35), చైతన్య హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల విశాఖపట్నం వచ్చిన వీరు కుటుంబసభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం విజయవాడలో బంధువుల ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం దుర్గమ్మ దర్శనం చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు గరికపాడు కేవీకే సమీపంలోకి చేరుకోగా, అదే సమయంలో ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న శ్రీకాంత్‌తో పాటు నాగలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందారు. మల్లికార్జునరావు కుడి కాలు విరిగి పోగా, చైతన్యకు స్వల్పగాయాలయ్యాయి. సీఐ జానకీరాం, చిల్లకల్లు ఎస్‌ఐ శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Updated Date - Oct 21 , 2024 | 12:34 AM