గంజాయిపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jun 19 , 2024 | 01:22 AM
నగరంలో గంజాయికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు వంద రోజులు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు.
నియంత్రణకు 100 రోజుల యాక్షన్‌ప్లాన్
సరిపల్లి వద్ద చెక్‌పోస్ట్, సీసీ కెమెరాలు ఏర్పాటు
రవాణా, విక్రయం, వినియోగం అడ్డుకట్టకు యాక్షన్ టీమ్‌లు
ఉపాధ్యాయులను భాగస్వామ్యులను చేస్తూ యాంటీ డ్రగ్స్ కమిటీలు
కళాశాలల్లో అవగాహన సదస్సులు
నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ నిర్ణయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో గంజాయికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు వంద రోజులు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. గంజాయి రవాణా, విక్రయం, వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు యాక్షన్ టీమ్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. యువత, విద్యార్థులు గంజాయి వినియోగానికి అలవాటుపడకుండా ఉండేందుకు ఉపాధ్యాయులను భాగస్వామ్యులను చేస్తూ యాంటీ డ్రగ్స్ కమిటీలను నియమించాలని కిందిస్థాయి అధికారులను నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశించారు.
గంజాయి రవాణా, విక్రయం, వినియోగానికి నగరం అడ్డాగా మారిందని, మూడు నెలల్లో దీనిని సమూలంగా కూకటివేళ్లతో పెకిలివేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. హోం మంత్రి ఆదేశాలతో ఒక్కరోజు వ్యవధిలోనే గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు వంద రోజుల యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. ముందు గంజాయి రవాణాను నియంత్రించాల్సి ఉందని గుర్తించిన సీపీ రవిశంకర్ అయ్యన్నార్ నగరంలోని ప్రవేశించేందుకు అవకాశం ఉన్న మార్గాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఏజెన్సీ నుంచి నగరానికి వచ్చే మార్గంలో సరిపల్లి వద్ద చెక్‌పోస్టుతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతరం వాహనాల తనిఖీలు నిర్వహించాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు.
అలాగే విద్యార్థులు, యువత గంజాయి, మత్తు పదార్థాల వినియోగానికి బానిసలుగా మారుతుండడంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఉపాధ్యాయులను భాగస్వామ్యులను చేస్తూ పోలీసులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలతో కలిపి యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటుచేయాలని సీపీ ఆదేశించారు. ఆయా కమిటీలు గంజాయి వినియోగిస్తున్న యువత, విద్యార్థులను గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తే వారిని డీఅడిక్షన్ సెంటర్లకు తరలించి మామూలు మనుషులుగా మార్చడంతోపాటు వారికి గంజాయి ఎక్కడి నుంచి లభ్యమవుతోందనే వివరాలను సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటారు. అలాగే నగరంలో గంజాయి వినియోగం జరుగుతున్న ప్రాంతాలు, విక్రయిస్తున్న ప్రాంతాలు, దుకాణాలపై నిరంతరం నిఘా ఉండేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిఽధిలోనూ ప్రత్యేకంగా యాక్షన్ టీమ్‌లను ఏర్పాటుచేయాలని డీసీపీలను ఆదేశించారు. యాక్షన్ టీమ్‌లు నిరంతరం తమ పరిధిలోని ప్రాంతాల్లో తిరుగుతూ గంజాయి వినియోగిస్తున్న యువతపై నిఘా పెడతాయి. అలాగే గంజాయి, మత్తుమందుల వినియోగం వల్ల తలెత్తే సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వీలుగా కళాశాలల్లో సదస్సులు నిర్వహించాలని సీపీ నిర్ణయించారు. దీనిని వంద రోజులపాటు పక్కాగా అమలుచేస్తే నగరంలో గంజాయి లేకుండా చేయవచ్చునని సీపీ ఆశాభావం వ్యక్తంచేసినట్టు పోలీసులు పేర్కొంటున్నారు.