Share News

ఏయూ మాజీ వీసీపై విచారణ

ABN , Publish Date - Nov 23 , 2024 | 01:04 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అక్రమాలపై వారం రోజుల్లో విచారణ కమిటీ వేస్తామని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.

ఏయూ మాజీ వీసీపై విచారణ

  • వారం రోజుల్లో కమిటీ ఏర్పాటుచేస్తాం

  • జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రి నారా లోకేశ్‌ హామీ

  • ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అక్రమాలను పూసగుచ్చినట్టు వివరించిన ప్రజా ప్రతినిధులు

  • ఇంకా ఆయన కనుసన్నల్లోనే పాలన సాగుతుందని ఫిర్యాదు

  • ప్రస్తుత పాలనా వ్యవహారాలపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందుతుందన్న అమాత్యుడు

విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అక్రమాలపై వారం రోజుల్లో విచారణ కమిటీ వేస్తామని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ప్రభుత్వ విప్‌ పి.గణబాబు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, సీహెచ్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌లు శుక్రవారం ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అక్రమాలను పూసగుచ్చినట్టు వివరించడంతోపాటు ఇంకా మాజీ వీసీ కనుసన్నల్లోనే పాలన కొనసాగుతుందని ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన లోకేశ్‌...గత వీసీ హయాంలో జరిగిన అక్రమాలు, అడ్డగోలు వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామన్నారు. ఏయూలో ప్రస్తుత పాలనా వ్యవహారాలపై ఎప్పటికప్పుడు తనకు, తన పేషీకి సమాచారం అందుతుందన్నారు. వర్సిటీ పాలనలో రాజకీయ జోక్యం లేకుండా చేయాలన్నదే తన అభిమతమన్నారు. టీడీపీ సానుభూతి పరులు కూడా వర్సిటీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. పూర్తిస్థాయి ఉపకులపతి నియామకం కోసం సెర్చ్‌ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి కల్పనకు సంబంధించిన కోర్సులు నిర్వహించి విద్యార్థులకు మేలు చేసేలా ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. అనుబంధ కళాశాలలను బలోపేతం చేస్తామని, ఉన్నత విద్య అభివృద్ధికి నిరంతర పర్యవేక్షణ చేస్తానని లోకేశ్‌ అన్నారు.

సింహాచలం భూ సమస్య పరిష్కరించండి

దేవస్థానానికి ప్రత్యామ్నాయ భూములు

త్వరగా బదిలీ అయ్యేలా చూడాలి

అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు

12,419 కట్టడాలను క్రమబద్ధీకరిస్తామని మంత్రి హామీ

విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):

విశాఖ జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సింహాచలం దేవస్థానం పంచ గ్రామాల భూ సమస్యను ఎన్నికల హామీగా మిగిలిపోకుండా చూడాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచగ్రామాల భూ సమస్య పరిష్కరిస్తామనే విశ్వాసంతోనే ప్రజలు భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించారన్నారు. దేవదాయ శాఖ అధికారులు అంశం కోర్టు పరిధిలో ఉందని అస్పష్టమైన సమాధానం చెప్పి తప్పించుకోవడం సరికాదన్నారు. బీఆర్‌టీఎస్‌ రహదారిలో ఇళ్లు కోల్పోయిన బాధితులు వారి కట్టడాల వెనుక ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాలను కలుపుకొని నిర్మాణం చేపట్టుకోవడానికి దేవస్థానం, జీవీఎంసీల నుంచి అభ్యంతరం లేకుండా చూడాలని కోరారు. దేవస్థానం క్రమబద్ధీకరించబోయే 12,419 కట్టడాలకు ప్రత్యామ్నాయంగా ఇవ్వబోయే ప్రభుత్వ భూముల బదలాయింపు త్వరగా పూర్తిచేయాలని గంటా కోరారు.

సమాన విలువైన భూములే ఇస్తున్నారు

వెలగపూడి రామకృష్ణబాబు, తూర్పు ఎమ్మెల్యే

ప్రజలు గృహాలు నిర్మించుకున్న దేవస్థానం భూముల విలువ లెక్కించి ఆ విలువకు సమానమైన భూములు (రూ.5,377 కోట్లు) ప్రత్యామ్నాయంగా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రతిపాదించిందని, అయితే ఈ ప్రక్రియ వేగవంతంగా జరగడం లేదని రామకృష్ణబాబు అన్నారు. టీడీపీ 2014లో గెలిచినప్పుడు విశాఖలో నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే దీనిపై తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, త్వరగా భూముల బదలాయంపు పూర్తిచేసి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని కోరారు.

ధర్మకర్తలతో మాట్లాడతాం

ఆనం రామనారాయణరెడ్డి, దేవదాయ మంత్రి

ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలపై దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. రూ.5,377 కోట్ల విలువైన భూములు దేవస్థానానికి ఇస్తున్నట్టు హైకోర్టుకు తెలియజేసి, 12,419 కట్టడాలను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. ఈ పంచ గ్రామాల సమస్యపై విశాఖలో ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. ఖాళీ స్థలాలకు గతంలోనే ధరలు నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ అంశంపై దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తలతోనే మాట్లాడతామని హామీ ఇచ్చారు.

Updated Date - Nov 23 , 2024 | 01:04 AM