Share News

డ్వాక్రా సంఘాలకు జగన్‌ టోకరా!

ABN , Publish Date - Nov 22 , 2024 | 10:54 PM

వైసీపీ పాలనలో ఇబ్బంది పడని వర్గం ఏదీ లేదు. చివరకు కొవిడ్‌ సమయంలో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చిన, కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో బాధితులకు భోజనాలు పెట్టిన స్వయం సహాయక సంఘాలకు కూడా జగన్‌ సర్కార్‌ ఝలక్‌ ఇచ్చినవైనం తాజాగా అసెంబ్లీలో ప్రస్తావనతో వెలుగుచూసింది.

డ్వాక్రా సంఘాలకు జగన్‌ టోకరా!
చింతపల్లిలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(వైటీసీ)

స్కిల్‌ ట్రైనింగ్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్ల బిల్లులు చెల్లించని వైసీపీ సర్కార్‌

పాడేరు ఐటీడీఏ పరిధిలో రూ.72.84 లక్షలు పెండింగ్‌

అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

సమస్యను గుర్తించామన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి

కూటమి ప్రభుత్వ ఆదుకోవాలని ఎస్‌హెచ్‌సీల వేడుకోలు

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

వైసీపీ పాలనలో ఇబ్బంది పడని వర్గం ఏదీ లేదు. చివరకు కొవిడ్‌ సమయంలో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చిన, కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో బాధితులకు భోజనాలు పెట్టిన స్వయం సహాయక సంఘాలకు కూడా జగన్‌ సర్కార్‌ ఝలక్‌ ఇచ్చినవైనం తాజాగా అసెంబ్లీలో ప్రస్తావనతో వెలుగుచూసింది. స్థానిక ఐటీడీఏ పరిధిలోని ఐదు యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్లలో నైపుణ్య శిక్షణ, కొవిడ్‌ బాధితులకు భోజనాలు పెట్టిన స్వయం సహాయక సంఘాలకు వైసీపీ ప్రభుత్వం 2022లోనే రూ.72.84 లక్షలు చెల్లించాల్సి ఉంది. వాటిని నేటికీ చెల్లించలేదు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

స్థానిక ఐటీడీఏ పరిధిలో పాడేరు, అరకులోయ, చింతపల్లి, పెదబయలు, వేపగుంటలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్లలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా గిరిజన నిరుద్యోగ యువతకు 2019, 2020, 2021 సంవత్సరాల్లో వివిధ స్వయం ఉపాధి విభాగాల్లో శిక్షణ ఇచ్చారు. అలాగే కొవిడ్‌ సమయంలోనూ ఆయా యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్లలోనే కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో నైపుణ్య శిక్షణ నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాలే కొవిడ్‌ బాధితులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించాయి. తొలి విడతగా కొంత మొత్తం మాత్రమే విడుదల చేసి, తర్వాత నుంచి వైసీపీ ప్రభుత్వం ముఖం చాటేసింది. దీంతో ఈ నిధుల కోసం గత రెండేళ్లుగా ఆయా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఈ సమస్యను అసెంబ్లీ ప్రస్తావించారు. ఎస్‌హెచ్‌జీలు అందించిన సేవలను గత వైసీపీ ప్రభుత్వం గుర్తించకుండా, వారికి చెల్లించాల్సిన బిల్లులను పెండింగ్‌లో పెట్టడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దానిపై రాష్ట్ర గిరిజన సంక్షేమం, ఐసీడీఎస్‌ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సైతం స్పందించారు. ఎస్‌హెచ్‌జీలకు బిల్లుల పెండింగ్‌ అంశం తమ నోటీసులో ఉందని, దానిని ఎలా పరిష్కరించాలనే దానిపై పరిశీలిస్తున్నామన్నారు. తాజా ఘటనతో స్కిల్‌ ట్రైనింగ్‌, కొవిడ్‌లో సేవలు అందించిన స్వయం సంఘాలకు వైసీపీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం చర్చనీయాంశమైంది.

ఎస్‌హెచ్‌జీలకు పెండింగ్‌ బిల్లుల వివరాలు

-కొవిడ్‌ భోజన, వసతి కల్పనవి రూ.12,77,199

-వివిధ స్వయం ఉపాధి శిక్షణలిచ్చినవి రూ.19,66,229

-గిరి యువతకు కానిస్టేబుల్‌ కోచింగ్‌లో భోజనాల ఖర్చులు రూ.19,93,158

- ఐదు యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్ల సిబ్బంది పెండింగ్‌ జీతాలు రూ. 20,48,000

-ఐదు వైటీసీల్లోని మొత్తం పెండింగ్‌ బిల్లులు రూ.72,84,577

అప్పులు పాలైపోయాం..

పి.జయ, ఎస్‌హెచ్‌జీ ప్రతినిధి, పాడేరు

యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ద్వారా గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చినందుకు, కొవిడ్‌ సమయంలో బాధితులకు భోజనాలు పెట్టినందుకు ప్రస్తుతం అప్పుల పాలైపోయాం. స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా ప్రోత్సహించాల్సిన పాలకులు అందుకు భిన్నంగా అప్పుల పాల్జేయడం ఘోరం. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొని, అప్పులు చేసి స్వయం ఉపాధి శిక్షణ, భోజనాలు పెట్టినందుకు ఇలా చేయడం అన్యాయం. కూటమి ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని కోరుతున్నాం.

మా సేవలను గుర్తించకపోవడం దారుణం

కె.శాంతికుమారి, ఎస్‌హెచ్‌జీ ప్రతినిధి, అరకులోయ

కొవిడ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో, ఆ తర్వాత ప్రాణాలకు సైతం తెగించి తాము అందించిన సేవలను ప్రభుత్వం గుర్తించకపోవడం ఘోరం. గిరిజన యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వడం ద్వారా వారి భవిష్యత్‌కు మేలు చేయడంతోపాటు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా కృషిచేశాం. అలాగే కొవిడ్‌ బాధితులకు సంపూర్ణమైన పోషకాహారాన్ని అందించి, వారి ప్రాణ, ఆరోగ్య రక్షణకు కృషిచేశాం. అటువంటి మాకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో అన్యాయం జరగడం ఘోరం. ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశ పడుతున్నాం.

Updated Date - Nov 22 , 2024 | 10:54 PM