జోరుగా అభివృద్ధి
ABN , Publish Date - Nov 23 , 2024 | 12:51 AM
మండలంలోని పలు గ్రామాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణం పనులు జోరుగా జరుగుతున్నాయి. 24 పంచాయతీల్లో 63 పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం రూ.4.06 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల పనులు చేపట్టారు. డిసెంబరు నెలాఖరునాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
గ్రామాల్లో శరవేగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం
సబ్బవరం మండలానికి రూ.4.06 కోట్లు మంజూరు
పంచాయతీల్లో 63 పనులు
వచ్చే నెలాఖరునాటికి పూర్తిచేయాలని లక్ష్యం
సబ్బవరం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణం పనులు జోరుగా జరుగుతున్నాయి. 24 పంచాయతీల్లో 63 పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం రూ.4.06 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల పనులు చేపట్టారు. డిసెంబరు నెలాఖరునాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించే వెసులుబాటు వున్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కేంద్రం ఇచ్చిన నిధులతో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించకుండా, వేరే పథకాలకు మళ్లించింది. దీంతో గ్రామాల్లో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. గోతులు ఏర్పడి వర్షాకాలంలో నడవడానికి వీలుకాని విధంగా తయారయ్యాయి. డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహించేది. దోమలు, ఈగల బెడద పెరిగిపోయి ప్రజలు రోగాలు, వ్యాధులబారిన పడ్డారు. ప్రజలు ఈ సమస్యలను నాటి ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. గత ఎన్నికల సమయంలో గ్రామాల్లో పర్యటించిన కూటమి నేతలు.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వచ్చిన వెంటనే గ్రామీణాభివృద్ధిపై పాలకులు దృష్టి సారించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్.. ‘ఊరూరా పల్లె పండుగ’ పేరుతో రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో ఒకే రోజున గ్రామసభలు ఏర్పాటు చేయించి సమస్యలపై చర్చించారు. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలకు నిధులు కావాలని పంచాయతీలు తీర్మానాలు చేసి పంపడంతో ఉపాధి హామీ పథకం కింద పెద్దఎత్తున నిధులు మంజూరు చేశారు. దీనిలో భాగంగా సబ్బవరం మండలంలో అత్యవసరమైన 63 రోడ్ల పనులకు ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం రూ.4.06 కోట్లు మంజూరు చేసింది. దీంతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 2,113.5 మీటర్ల సీసీ రోడ్లు, 350 మీటర్ల మేర డ్రైనేజీ కాలువలు నిర్మించారు. డిసెంబరు నెలాఖరునాటికి అన్ని పనులు పూర్తిచేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
రోడ్ల సమస్యలకు కూటమి సర్కార్ పరిష్కారం
ఆకుల శ్రీహేమ, సర్పంచ్, వంగలి పంచాయతీ
వైసీపీ అధికారంలో వున్నంత కాలం పంచాయతీలను నిర్వీర్యం చేసింది. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ, పారిశుధ్య పనులకు సైతం నిధులు లేకుండా చేసింది. రోడ్లను బాగుచేయడానికి నిధులు లేకపోవడంతో ప్రజల ముందు తలెత్తుకుని తిరగలేకపోయాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంతో ఊపిరిపీల్చుకుంటున్నాం. ఉపాధి నిధులతో చేపట్టిన పనులు త్వరలోనే పూర్తవుతాయి.