బడి భోజనం.. నాణ్యత లోపం!
ABN , Publish Date - Nov 23 , 2024 | 12:40 AM
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణకు ప్రభుత్వం ఇస్తున్న డైట్ బిల్లులు, వేతనాలు చాలకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఇస్తున్న నిధులు, వాస్తవ ఖర్చులకు పొంతన వుండడంలేదు. దీంతో విద్యార్థులకు నాణ్యతతో రుచికరమైన భోజనం వండిపెట్టడం సాధ్యం కావడంలేదని వాపోతున్నారు. అంతేకాక భోజనం బిల్లులు, తమ వేతనాలు సకాలంలో ఇవ్వక పోవడంతో అప్పులు చేసి విద్యార్థులకు భోజనాలు పెడుతున్నామని చెబుతున్నారు.
పోషకాహారానికి దూరమవుతున్న విద్యార్థులు
ప్రభుత్వం ఇచ్చే బిల్లులు చాలడంలేదంటున్న పథకం నిర్వాహకులు
విపరీతంగా పెరిగిన నిత్యావసర సరకులు ధరలు
బిల్లులు, వేతనాల చెల్లింపుల్లో జాప్యం
సెప్టెంబరు నుంచి బకాయిలు
‘పిల్లల భోజనం’ కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి
సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి మూడున ఢిల్లీలో ధర్నా
నర్సీపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణకు ప్రభుత్వం ఇస్తున్న డైట్ బిల్లులు, వేతనాలు చాలకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఇస్తున్న నిధులు, వాస్తవ ఖర్చులకు పొంతన వుండడంలేదు. దీంతో విద్యార్థులకు నాణ్యతతో రుచికరమైన భోజనం వండిపెట్టడం సాధ్యం కావడంలేదని వాపోతున్నారు. అంతేకాక భోజనం బిల్లులు, తమ వేతనాలు సకాలంలో ఇవ్వక పోవడంతో అప్పులు చేసి విద్యార్థులకు భోజనాలు పెడుతున్నామని చెబుతున్నారు.
జిల్లాలో 1,033 ప్రాథమిక, 148 ప్రాథమికోన్నత, 226 ప్రభుత్వ/ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్ల 23,378 మంది, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 9,500 మంది, ఉన్నత పాఠశాలల్లో 62,559 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి పాఠశాలల పనిదినాల్లో మధ్యాహ్నం భోజనం పెట్టాలి. ఇందుకు నిర్వాహక ఏజెన్సీలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. భోజనం తయారీకి అవసరమై బియ్యం, కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కూరగాయలు, పప్పుదినుసులు, ఇతర వస్తువులు, వంట గ్యాస్‌ను నిర్వాహకులు సమకూర్చుకోవాలి. ఒక్కో విద్యార్థికి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రోజుకు రూ.7.75, ఆరు నుంచి పదో తరగతి వరకు రూ.8.55 చొప్పున ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది.
ఏ రోజు.. ఏం వడ్డించాలి..
సోమవారం హాట్ పొంగలి, ఉడికించిన గుడ్డు లేదా కూరగాయల పులావ్, గుడ్డు కూర, చెక్కీ పెట్టాలి. మంగళవారం చింతపండు పులిహోరా, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు; బుధవారం కూరగాయల అన్నం, బంగాళాదుంపల కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ; గురువారం సాంబార్ బాత్ లేదా టమాటా చెట్నీతో నిమ్మరసం రైస్, ఉడికించిన గుడ్డు పెట్టాలి. శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి; శనివారం ఆకుకూర అన్నం, పప్పుచారు, తీపి పొంగలి పెట్టాలి.
మండుతున్న ధరలతో..
బియ్యం, కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేస్తున్నప్పటికీ మిగిలిన సరకులు, కూరగాయల ధరలు మండిపోతుండడంతో ప్రభుత్వం ఇచ్చే బిల్లులు చాలడంలేదని నిర్వాహకులు వాపోతున్నారు. ఈ ప్రభావం భోజనం నాణ్యతపై పడుతున్నది. ప్రధానం కందిపప్పు, కారం, వంట నూనెల ధరలు చాలా నెలల నుంచి చుక్కలనంటాయి. ఇక టమాటా, బంగాళా దుంపలు, దొండకాయలు, ఇతర కూరగాయల ధరలు రెండు, మూడు నెలల నుంచి కిలో రూ.40కి తగ్గడంలేదు. ఉల్లిపాయలు అయితే ఆరు నెలల నుంచి కిలో రూ.50కి పైనే ధర పలుకుతున్నది. అధిక ధరలతోపాటు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో భోజనంలో నాణ్యత లోపిస్తున్నది. ఆరో తరగతి విద్యార్థికి, పదో తరగతి విద్యార్థికి ఒకే విధంగా భోజనం పెడుతున్నారు. కూరలు, సాంబారు కొద్దికొద్దిగా వడ్డిస్తున్నారు. దీని వల్ల విద్యార్థులు పోషకాహారానికి దూరమవుతున్నారు. మరోవైపు హోట్ పొంగలి, నిమ్మరసం అన్నం, పులిహార పెట్టే రోజుల్లోల అధిక శాతం విద్యార్థులు స్కూల్ భోజనం చేయడానికి ఇష్టపడడం లేదు. ఈ విషయం తల్లిదండ్రుల దృష్టికి రావడంతో పలువురు ఇళ్ల నుంచి భోజనాలు పంపిస్తున్నారు.
అప్పులు చేసి నిర్వహిస్తున్నాం
ప్రసన్న, జిల్లా మధ్యాహ్న భోజన నిర్వహకుల సంఘం అధ్యక్షురాలు
మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణకు ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు సరిపోవడం లేదు, కూరగాయలు, కిరాణ సరకుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. సెప్టెంబరు నుంచి బిల్లులు, మా వేతనాలు అందలేదు. అప్పులు చేసి భోజనాలు పెడుతున్నాం. మాకు వచ్చే వేతనాలు వడ్డీలు చెల్లించడానికి సరిపోతున్నాయి. భోజన పథకం నిర్వహకుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడానికి డిసెంబరు 3న ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నాం.