Vizag MLC Election: ఎడతెగని ఉత్కంఠ.. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఇంకా ఖరారు కాని టీడీపీ అభ్యర్థి
ABN , Publish Date - Aug 09 , 2024 | 08:46 PM
ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో పోటీ చేయనున్న కూటమి అభ్యర్థిపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థి ఎంపికపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు కసరత్తు ప్రారంభించినప్పటికీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు.
అమరావతి: ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో పోటీ చేయనున్న కూటమి అభ్యర్థిపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థి ఎంపికపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు కసరత్తు ప్రారంభించినప్పటికీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఇవాళ (శుక్రవారం) రాత్రి లేదా రేపటికి అభ్యర్థి ఎన్నిక, ఎన్నికల్లో పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు అందరి అభిప్రాయాలను సీఎం చంద్రబాబు సేకరించారు. అర్బన్‌లో ఎన్ని ఓట్లు, రూరల్ ఎన్ని ఓట్లు ఉన్నాయనే అంశంపై ఆయన పార్టీ కేడర్‌తో సమీక్ష నిర్వహించారు.
మరోవైపు సర్పంచులు, ఎంపీటీసీలను వైసీపీ ఇప్పటికే క్యాంపులకు తరలించింది. ఈ విషయాన్ని పార్టీ నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల బలా బలాలపై నేతలతో పార్టీ అధినేత చర్చించారు. విశాఖ రూరల్ నుంచి మరింత సమాచారం తీసుకురావాలని ఆయన ఆదేశించారు.
కాగా ఈ నెల 30న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు తమ స్థానిక సంస్థల అభ్యర్థులను బెంగళూరు తరలించిందని తెలుస్తోంది. దీంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బొత్స సత్యనారాయణను ఢీకొట్టే అభ్యర్థిని రంగంలోకి దించాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. కూటమి తరఫున అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఈ మేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తు్న్నారు.
ఇదిలావుంచితే.. ఇటీలే జరిగిన గ్రేటర్ విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) స్థాయీ సంఘం కమిటీ ఎన్నికల్లో 10కి పది మంది సభ్యులు కూటమి అభ్యర్థులే గెలిచారు. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలోనూ గెలిచి తీరుతామని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.