ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వణికిస్తున్న జ్వరాలు

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:57 AM

గడిచిన కొన్నాళ్లుగా జ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు, మూడు వారాలకుపైగా ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

  • ఒక పట్టాన తగ్గడం లేదంటున్న బాధితులు

  • వారాల తరబడి కీళ్లు, ఒంటి నొప్పులు...

  • ఫ్లూ వైరస్‌ మ్యుటేషన్స్‌ వ్యాప్తిచెందడం, వైరస్‌కు యాంటీ బయాటిక్‌ రెసిస్టెన్స్‌ పెరగడం, డెంగ్యూ, చికున్‌గున్యా లైక్‌ ఫీవర్స్‌...

  • కారణంగా చెబుతున్న వైద్యులు

  • అప్రమత్తత అవసరమని హెచ్చరిక

  • మందులు వినియోగంలో నిర్లక్ష్యం వద్దని సూచన

  • కోర్సు పూర్తిగా వాడకుంటే మళ్లీ తిరగబెట్టే ప్రమాదం

విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):

గడిచిన కొన్నాళ్లుగా జ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు, మూడు వారాలకుపైగా ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొందరిలో జాయింట్‌, బాడీ పెయిన్స్‌ కనిపిస్తున్నాయి. సాధారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు ఈ తరహా వైరల్‌ ఫీవర్స్‌ వ్యాప్తిచెందడం సర్వసాధారణం. అయితే, తొలిసారి భిన్నమైన లక్షణాలు కనిపించడంతోపాటు రోజులు తరబడి జ్వరాలు తగ్గడం లేదు. ఇందుకు మూడింటిని (వైరల్‌ ఫీవర్స్‌లో పెరిగిన మ్యుటేషన్స్‌ (రకాలు), వైరస్‌ యాంటీ బయాటిక్‌ రెసిస్టెన్సీ పెరగడం, డెంగ్యూ, చికున్‌ గున్యా మాదిరి ఫీవర్స్‌) కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు.

వైరల్‌ ఫీవర్స్‌ సాధారణంగా మూడు నుంచి ఐదు రోజులపాటు ఉండి తగ్గుముఖం పడుతుంటాయి. అయితే, ప్రస్తుతం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వైరల్‌ ఫీవర్స్‌లో కొత్తరకం వ్యాప్తి చెందుతున్నట్టు చెబుతున్నారు. ఇవి అంత తేలిగ్గా తగ్గడం లేదని, రోజుల తరబడి బాధితులు జ్వరంతోపాటు ఇతర లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు. అలాగే వైరస్‌కు యాంటీ బయాటిక్‌ రెసిస్టెన్సీ పెరగడం మరో కారణంగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఏదైనా జ్వరం వచ్చినప్పుడు వైద్యులు కొన్నిరకాల మందులను సూచిస్తున్నారు. ఈ మందులను జ్వర లక్షణాలను బట్టి కోర్సు రూపంలో వాడాలి. అయితే, వైద్యులు ఇచ్చిన కోర్సును చాలామంది పూర్తిగా వినియోగించడం లేదు. ఒకటి, రెండు రోజులు వాడిన తరువాత జ్వరం తగ్గుముఖం పట్టడంతో కోర్సును ఆపేస్తున్నారు. అలాగే కొందరు వైద్యులతో సంబంధం లేకుండా లక్షణాలకు అనుగుణంగా మెడికల్‌ స్టోర్స్‌లో మందులు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. దీనివల్ల శరీరంలో చేరిన ఫ్లూ వైరస్‌కు యాంటీ బయాటిక్‌ రెసిస్టెన్స్‌ పెరిగిపోతోంది. అరకొరగా మందులు వాడడం వల్ల వైరస్‌ పూర్తిగా చనిపోకుండా శరీరంలోనే ఉంటోంది. దీంతో ఎప్పటికప్పుడు అది యాక్టివ్‌ అయి ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆ తరువాత మందులు వినియోగించినా ఒక పట్టాన లొంగకుండా రోగిని ఎక్కువ రోజులు మంచానికి పరిమితమయ్యేలా చేస్తోందని వైద్యులు వెల్లడిస్తున్నారు. వీటితోపాటు డెంగ్యూ లైక్‌ ఫీవర్స్‌ కూడా వ్యాప్తి చెందుతున్నాయంటున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న జ్వరాలన్నీ ఫ్లూ తరహాలోనే ఉంటున్నాయి. కానీ, లక్షణాలు చూస్తే డెంగ్యూ, చికున్‌ గున్యా తరహాలో ఉంటున్నాయి. దీంతో వీటిని వైద్యులు కూడా డెంగ్యూ, చికున్‌ గున్యా లైక్‌ ఫీవర్స్‌గా పరిగణించి మందులు అందిస్తున్నారు. అందుకే చాలామంది జ్వర బాధితుల్లో బాడీ, జాయింట్‌ పెయిన్స్‌, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు ఉంటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

ఆస్పత్రులు చుట్టూ ప్రదక్షిణలు

నగర పరిధిలో జ్వరపీడితులు పెరుగుతున్నారు. ఇంట్లో ఎవరో ఒకరూ జ్వర లక్షణాలతో బాధపడుతూ కనిపిస్తున్నారు. కేజీహెచ్‌, విమ్స్‌తోపాటు అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌, ప్రైవేటు ఆస్ప త్రులకు జ్వర లక్షణాలతో ప్రతిరోజూ వందలాది మంది వస్తున్నారు. కేజీహెచ్‌, విమ్స్‌లకు ప్రతిరోజూ 50 మందికి తగ్గకుండా వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

కోర్సు పూర్తయ్యేంత వరకు మందులు వినియోగించాలి

- డాక్టర్‌ ఐ.కృష్ణమూర్తి, వైద్య నిపుణులు

జ్వరం వచ్చినప్పుడు వైద్యుల సూచన మేరకు మందులు వినియోగించడం మంచిది. ఇష్టం వచ్చినట్టు మందులు కొనుగోలు చేసి వినియోగించడం, వైద్యులు చెప్పిన కోర్సును పూర్తిస్థాయిలో వాడకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. బాడీలోని వైరస్‌కు యాంటీ బయాటిక్‌ రెసిస్టెన్సీ పెరిగిపోయి తరువాత కాలంలో ఇబ్బందులకు గురిచేయవచ్చు. కాబట్టి, వైద్యులు చెప్పిన ప్రకారం కోర్సును జ్వరం, ఇతర లక్షణాలు తగ్గినా పూర్తిగా వాడాలి. దీనివల్ల శరీరంలోని వైరస్‌ పూర్తిగా నశించిపోతుంది. మధ్యలో వాడడం నిలిపేయడం వల్ల వైరస్‌కు బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది. ప్రస్తుత సీజన్‌లో కొన్ని జాగ్రత్తలను పాటించాలి. బయట ఫుడ్‌కు దూరంగా ఉండడం, చల్లని గాలిలో తిరగకుండా ఉండడం ద్వారా చాలా రకాల వైరస్‌ల బారినపడకుండా ఉండవచ్చు.

మారిన మ్యుటేషన్స్‌కు అనుగుణమైన లక్షణాలు

- డాక్టర్‌ కె.రాంబాబు, విమ్స్‌ డైరక్టర్‌

ప్రస్తుతం ఫీవర్స్‌లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇందుకు మ్యుటేషన్స్‌ కారణంగా చెప్పవచ్చు. వీటిని జాగ్రత్తగా పరిశీలించి లక్షణాలకు అనుగుణంగా మందులు వినియోగించాలి. అప్పుడు మాత్రమే వేగంగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. ముందుల పూర్తిస్థాయిలో వాడకపోయినా ఇబ్బందులు తప్పవు. కొందరు టైఫాయిడ్‌ బాధితులు కొద్దిరోజులు మందులు వాడి తగ్గిందని కోర్సు పూర్తిచేయరు. దీనివల్ల పేగుల్లో టైఫాయిడ్‌ వైరస్‌ ఉండిపోయి ఎప్పటికప్పుడు జ్వరం రావడం, పరీక్షలు చేయించుకున్నప్పుడు నిరంతరం పాజిటివ్‌ చూపించడం జరుగుతుంది. కాబట్టి, మందులు పూర్తిగా వినియోగించడం కీలకం.

Updated Date - Nov 20 , 2024 | 12:57 AM