Share News

సంక్షేమ హాస్టళ్ల ప్రక్షాళన

ABN , Publish Date - Nov 23 , 2024 | 01:22 AM

గడిచిన ఐదేళ్లలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన సంక్షేమ వసతి గృహాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది.

సంక్షేమ హాస్టళ్ల ప్రక్షాళన

  • హాస్టల్‌ను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడుతున్న రామారావు

  • వంద రోజుల ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశం

  • మౌలిక సదుపాయాల కల్పన, భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు

  • విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా పర్యవేక్షణ

  • ట్యూటర్ల నియామకం

  • ఎప్పటికప్పుడు అధికారుల తనిఖీలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గడిచిన ఐదేళ్లలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన సంక్షేమ వసతి గృహాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. వసతి గృహాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు సూచించింది. ఇందుకోసం వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేయాలని, అనంతరం ఫలితాలు తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సంక్షేమ శాఖ అధికారులు వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు మెరుగైన విద్యా బోధన, నాణ్యమైన ఆహారాన్ని అందించేలా ప్రణాళికలు రూపొందించారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో హాస్టళ్లలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు ఎప్పుడు బయటకు వెళుతున్నారో, ఎప్పుడు వస్తున్నారో తెలియని పరిస్థితి. దీనివల్ల అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసిస్టెంట్‌ సోషల్‌, బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు హాస్టళ్లను తనిఖీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లా ఆఫీసర్లు ప్రతి నెలా పది హాస్టళ్లను తనిఖీ చేయాలి. హాస్టళ్ల పరిసరాల్లో శానిటేషన్‌ సమస్య ఉంటే స్థానిక పంచాయతీలు, మునిసిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిశుభ్రంగా ఉండేలా చేయాలి. అలాగే విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించేలా చూడాలి. ఈ మేరకు కలెక్టర్‌ సదరు ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నెలా హాస్టల్స్‌లో మెడికల్‌ క్యాంపులను నిర్వహించేలా చూడాలి. విశాఖ విద్యా వసతి వికాసం ప్రోగ్రామ్‌లో భాగంగా నాలుగు కోట్ల రూపాయలతో 12 హాస్టళ్ల భవనాలను మరమ్మతు చేయిస్తున్నారు. వీటితోపాటు ఇతరత్రా ఏమైనా ఉంటే వంద రోజుల్లో పూర్తిచేయాలి. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్ల అధికారులు కూడా ప్రతిపాదనలు పెట్టాలి. ముఖ్యంగా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు, స్పోర్ట్స్‌ కిట్స్‌ సమకూర్చుకోవడం చేయాలి.

బాలికల రక్షణపై దృష్టి

బాలికల వసతి గృహాల పరిసరాల్లో ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. నగర పోలీస్‌ కమిషనర్‌కు బాలికల వసతి గృహాలకు సంబంధించిన జాబితాను అధికారులు అందించారు. రాత్రివేళల్లో ఆయా పరిసరాల్లో పెట్రోలింగ్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను కోరారు. మెనూ పక్కాగా అమలు చేయాలి. మెనూ అమలును ఉన్నతాధికారులను పర్యవేక్షించాలి.

మెరుగైన ఫలితాలు

హాస్టళ్లలో ఉండే విద్యార్థుల చదువుపైనా ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. మెరుగైన ఫలితాలను సాధించేలా ఉన్నతాధికారులు లక్ష్యాలు విధించారు. ముఖ్యంగా పదో తరగతి పరీక్షల ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు. ఇంటర్‌, డిగ్రీ, ఇతర కోర్సులు చదివే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలన్న లక్ష్యాన్ని ప్రణాళికలో చేర్చారు. ఇందుకోసం ట్యూటర్స్‌ను నియమించుకోవాలి. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలి. గ్రేడ్లు కేటాయించాలి. క్విజ్‌ పోటీలు నిర్వహించాలి. మోటివేషనల్‌ క్లాసులను నిర్వహించాలి. వార్డెన్స్‌ స్కూల్‌ టీచర్లతో మాట్లాడి విద్యార్థులను చదువులో మరింత మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలను సిద్ధంచేయాలి. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి. వీటితోపాటు అడ్మిషన్లు పూర్తిగా అయ్యేలా చూడడం, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టిసారించి చదువులో రాణించేలా చూడడం, క్రీడా పోటీలు నిర్వహించడం వంటివి చేయాలి.

యాక్షన్‌ ప్లాన్‌ అమలుకు స్పష్టమైన ఆదేశాలు

- కె.రామారావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ

గత నెలాఖరు నుంచి వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా షెడ్యూల్‌ను తయారుచేశాం. ఇప్పటికే హాస్టల్‌ వార్డెన్స్‌కు షెడ్యూల్‌ను అందించి అమలుకు ఆదేశించాం. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతోపాటు చదువులో రాణించేలా చర్యలు తీసుకుంటున్నాం. మెనూ అమలు, మంచినీటి సౌకర్యం, మెడికల్‌ క్యాంపులు నిర్వహణ వంటి అంశాలపై దృష్టిసారించాం. ట్యూటర్లు నియామకం, మోటివేషనల్‌ క్లాస్‌ల నిర్వహణకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Nov 23 , 2024 | 01:22 AM